Tuesday, November 26, 2024

శ్రీకాళహస్తీశ్వర శతకం

97
కాలద్వారకవాట బంధనము దుష్కాల ప్రమాణ క్రియా
లీలా చాలక చిత్రగుప్తముఖవల్మీకోగ్రజిహ్వాద్భుత
వ్యాళ వ్యాళవిరోధిమృత్యుముఖదంష్ట్రాహార్యవజ్రంబు
దిక్చేలాలంకృత! నీదు నామ మరయన్శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం: శ్రీకాళహస్తీశ్వరా! దిక్ – చేలా – అలంకృత – దిక్కులనే వస్త్రాలుగా ధరించిన వాడా! దిగంబరా!, అరయన్ – పరికించి చూడగా, నీ నామము – నీ పేరు, కాల – యముడి, ద్వార – ద్వారానికి (యమలోకానికి), కవాట – తలుపులు, బంధనము – మూయటం వంటిది, దుష్కాల – కాలాన్ని చెడుగా, ప్రమాణ క్రియా – లెక్కించే పని (అపమృత్యువు) అనే (ఆయుర్దాయాన్ని లెక్కించే చెడుపని అనే), లీలా – క్రీడని, చాలక – నడిపించే, చిత్రగుప్త – చిత్రగుప్తుడి యొక్క, ముఖ – నోరు అనే, వల్మీక – పుట్ట యందలి, ఉగ్ర – భయంకర, జిహ్వా – నాలుకలున్న, అద్భుతవ్యాళ – ఆశ్చర్యజనకమైన సర్పానికి , వ్యాళవిరోధి – సర్పాలకి శత్రువైన గరుత్మంతుడి వంటిది, మృత్యుదేవత నోటిలోని, దంష్ట్రా – కోరలకి, ఆహార్య – హరించటానికి వీలు కాని, వజ్రంబు – వజ్రాయుధం వంటిది.

తాత్పర్యం:
దిగంబరుడవైనశ్రీకాళహస్తీశ్వరా! నీ నామం యమలోకద్వారపు తలుపులను మూసే గడియ వంటిది. జీవుల ఆయుర్దాయ పరిమితిని లెక్క కట్టటం అనే కఠినమైన పనిని ఆటలాగా నిర్వర్తించే చిత్రగుప్తుడి నోరు అనే పుట్టలో కదిలే భయంకరమైన పామువంటి నాలుకకి గరుత్మంతుడి వంటిది. మృత్యుదేవత నోటిలోని కోరలకికొరుకుడు పడని వజ్రాయుధం వంటిది. అనగాశివనామంమృత్యుంజయత్వాన్ని ప్రసాదిస్తుందని భావం.

విశేషం:
చిత్రగుప్తుడు యముడి మంత్రి లేక సహాయకుడు. సృష్టిలో జరిగే అంశాల నన్నింటిని చిత్రంగా (మానవమేధకి అందని విధంగా) గోపనం చేసి (ఒక్కటి కూడా తప్పి పోకుండా) యముడికి సమయానికి అందజేసేవాడు.
వజ్రం: దధీచి వెన్నెముక నుండి తయారైన ఆయుధం. మృత్యువుని జయించ గల ఏకైక మంత్రం పంచాక్షరియే. మార్కండేయుడి కథ దీనికి పరమోదాహరణం. ఇక్కడ మృత్యువు అంటే అపమృత్యువు, అకాలమృత్యువుఅనిఅర్థం.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement