Saturday, November 23, 2024

శ్రీకాళహస్తీశ్వర శతకం

115.
నిచ్చల్ నిన్ను భజించి, చిన్మయ మహానిర్వాణపీఠంబు పై
రచ్చల్ సేయక నార్జవంబు కుజన వ్రాతంబు చే( గ్రాగి,
భూభృచ్చండాలుర గెల్చి, వారు తను గోపింపన్, బుధు0 డార్తుడై
చిచ్చారం జమురెల్ల చల్లు కొనునో శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, బుధు0డు – విద్వాంసుడు/ పండితుడు, నిచ్చల్ – అనునిత్యం/ ప్రతిరోజు, నిన్ను – నిన్ను, భజించి – సేవించి, చిన్మయ – జ్ఞానస్వరూపమైన, మహా – గొప్పదైన, నిర్వాణ – మోక్షము అనే, పీఠంబుపై – సింహాసనం మీద, రచ్చల్ – చేయకన్ – శాస్త్ర చర్చలు జరపకుండా, ఆర్జవంబు – ఋజుత్వం/ త్రికరణశుద్ధి, కుజనవ్రాతంబుచే – దుర్జనసమూహం చేత, క్రాగి – మఱిగి పోయి/ అంతరించి, భూభృత్ – చండాలురన్ – రాజులు అనే నీచులని, కొల్చి – సేవించి, వారు – ఆ రాజులు, తనున్ – తనను/ తనపై, కోపింప – కోపపడగా, ఆర్తుడు – ఐ – వేదన చెందినవాడై, చిచ్చు – ఆరన్ – ఆ దుఃఖాగ్ని చల్లారటానికి, చమురు – ఎల్లన్ – నూనె అంతటిని, చల్లుకొనును – ఓ – మీద పోసుకుంటాడా?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! పండితుడైనవాడు నిరంతరం నిన్నే సేవించుకుంటూ చిదానందస్వరూపమైన మోక్షపీఠాన్ని అధిరోహించి, శాస్త్రచర్చలు చేయవలసి ఉండగా, దానిని మాని దుర్జనుల బాధ వలన, చిత్తశుద్ధి నశించి నీచులైన రాజులని సేవించి, వారు ఆగ్రహించగా బాధపడి, ఆ మంట చల్లారటానికి నూనె మీద చల్లుకుంటాడా?

విశేషం:
పాండిత్యం, విద్వత్తు ఉన్నాయనటానికి నిదర్శనం పరమేశ్వరధ్యానం చేయటం, ఫలితంగా మోక్షపీఠాన్ని అధిరోహించి, పరబ్రహ్మతత్త్వాన్ని గూర్చి చర్చించగలగటం. దుర్జనులసాంగత్యం వల్ల చిత్తశుద్ధి లోపిస్తుంది. నీచులైన రాజులసేవ చేసి బాధపడ వలసి వస్తుంది. అది ఎట్లాంటిది అంటే నిప్పుని ఆర్పటానికి నూనె చల్లటం వంటిది. దుర్జనసాంగత్యం నిప్పు అయితే, దుష్టరాజులసేవ నూనె చల్లటం. అంటే, మరింత అధోగతే తప్ప మరేమీ లేదు. ఇది మానవుల మూర్ఖత్వానికి నిదర్శనం.
ఈ పద్యంలో పండితుల ప్రవర్తన ఎట్లా ఉండాలో నిర్దేశించబడింది. రాజనిరాసనం కూడా ఉంది.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement