113.
క్షితినాథోత్తమ సత్కవీశ్వరుడు వచ్చెన్ మిమ్ములం జూడగా
నతడో మేటి కవిత్వవైఖరిని సద్యః కావ్యనిర్మాత
తత్ప్రతిభ ల్మంచివి, తిట్టు పద్యము చెప్పం డాతడైనన్, మమున్
క్రితమే చూచెను బొమ్మ టందు రధముల్ శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, క్షితినాథ – ఉత్తమా – రాజులలోశ్రేష్ఠుడా!, మిమ్ములన్ – మిమ్ము, చూడగాన్ – దర్శించటానికి, సత్ -కవి – ఈశ్వరుడు – మంచికవిరాజు, వచ్చెన్ – వచ్చినాడు, అతడు – ఓ – ఆకవి ఎటువంటి వాడు అంటే, కవిత్వవైఖరిని – కవితారీతులలో, మేటి – దిట్ట/శ్రేష్ఠుడు, సద్యఃకావ్యనిర్మాత – ఆశువుగా కావ్యాన్ని రచించగలడు, తత్ – ప్రతిభల్ – అతడి తెలివితేటలు, మంచివి – మేలైనవి, తిట్టుపద్యములు – నిందాకవిత్వం, చెప్పండు – రచించడు, (అనగా) అధముల్ – నీచులైనరాజులు, అయినన్ – అయితే, అతండు – ఆ కవి, మమున్ – మమ్మల్ని, క్రితమే – ఇంతకు మునుపే, చూచెను – దర్శించుకున్నాడు, పొమ్ము – అట -అందురు – పొమ్మని చెప్పు అంటారు.
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! “ఓ రాజా! నీ దర్శనం కోసం ఒక మంచికవిశేఖరుడు వచ్చాడు. అతడు కవిత్వరీతులలో దిట్ట. ఆశువుగా కావ్యమునే నిర్మించగలడు. తిట్టుకవిత్వం వ్రాయడు. ప్రతిభావంతుడు.” అని ( పరివేష్ఠిమ్ చి ఉన్నవారు) చెపితే, అధములైన రాజులు “అతడైతే ఇంతకు ముందే మమ్మల్ని కలిశాడు. వెళ్ళమని చెప్పవలసింది.” అంటారు.
విశేషం:
ఈ పద్యంలో కవి లక్షణాలతో పాటు, రాజుల అభిరుచులు కూడా వెల్లడి అవుతాయి. కవితారీతులు తెలిసి ఉండటం, ఆశుధార కలిగిఉండటం, తిట్టుకవిత్వం జోలికి పోకుండా ఉండటం, ప్రతిభాశాలి అయి ఉండటం, మంచికవికి ఉండవలసిన లక్షణాలు. కాని, అవి రాజులకి అక్కరలేదు. ఈ లక్షణాలున్న కవిని వారు ఆదరించరు. అది వారి రసహీనతకి చిహ్నం.
“నవనవోన్మేషశాలినీ ప్రతిభా”– ఎప్పటి కప్పుడు క్రొత్తగా చిగురించే మేథాసంపదే ప్రతిభ.
డాక్టర్ అనంతలక్ష్మి