Tuesday, November 26, 2024

శ్రీకాళహస్తీశ్వర శతకం

110.
కరి దైత్యున్బొరిగొన్న శూలము కరగ్రస్థంబు గాదో, రతీ
శ్వరునిం గాల్చిన ఫాలలోచన శిఖావర్గంబు చల్లారెనో
పరనిందాపరుల న్వధింప విదియున్ భావ్యంబె! వారేమి చేసిరి
నీకుం బరమోపకార మరయన్ శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా! కరిదైత్యున్ – గజాసురుణ్ణి, పొరిగొన్న – సంహరించిన, శూలము – త్రిశూలం, కరగ్రస్థంబు కాదు – ఓ – నీ చేతిలో లేదా?, రతి – ఈశ్వరునిన్ – మన్మథుణ్ణి, కాల్చిన – దహించిన, ఫాలలోచన – నొసటి యందున్న కంటి యందలి, శిఖావర్గంబు – మంటలవరుస, చల్లారెను – ఓ – చప్పబడిందా్శ ఏమి?, పరనిందాపరులన్ – ఇతరులను దూషించే వారిని, వధింపవు – చంపటంలేదు, ఇదియున్ – ఈ పని, భావ్యంబు – ఎ – తగినదా?, అరయన్ – పరిశీలింపగా, వారు – ఆ పరనిందాపరులు, నీకున్ – నీకు, పరమ – ఉపకారము – గొప్పమేలు, ఏమి చేసిరి – ఏం చేశారు?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! ఇతరులను నిందించే స్వభావం గలవారిని చంపటం లేదు. గజాసురుణ్ణి సంహరించిన త్రిశూలం నీ చేతిలో లేదా? మన్మథుణ్ణి దహించిన నిటలనేత్రజ్వాలలు చల్లారాయా? ఊరుకోవటం నీకేమైనా తగునా? లేక వారేమైనా గొప్పమేలు చేశారా నీకు?

విశేషం:
శివుడు గజాసురుణ్ణి సంహరించి అతడి చర్మాన్నే తాను వస్త్రంగా ధరించి, అతడి తలని వినాయకుడికి అమర్చాడు. మన్మథుడి మూడోకంటిమంటతో దహించాడు. గజము అహంకారానికి, మన్మథుడు కామానికి ప్రతీకలు. వాటి సంహారం అంటే అహంకారాన్ని, కామాన్ని జయించటం. పరనిందకు కూడా ఈ రెండే కారణాలు. పరనిందాపరులు శివుడికి ఏదో మేలు చేసి ఉండాలని, అందువల్ల శివుడు వారిని ఉపేక్ష చేస్తున్నాడని ధూర్జటి నిందారోపణ చేస్తున్నాడీ పద్యంలో.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement