Saturday, November 23, 2024

శ్రీకాళహస్తీశ్వర శతకం

105. క్షితిలో దొడ్డతురంగ సామజములే చిత్రమ్ము లాందోళికా
తతులే లెక్క విలాసినీజన సువస్త్రవ్రాత భూషా కలా
ప తనూజాదిక మేమి దుర్లభము నీ పాదమ్ము లర్చించుచో
జితపంకేరుహ పాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, జిత – గెలువబడిన, పంకేరుహ – పద్మాలు కలిగిన, పాద – పాదాలు అనే, పద్మ – తామరల యొక్క, యుగళా – జంట కలవాడా!, నీ పాదమ్ములు – నీ అడుగులని, అర్చించుచోన్ – సేవించి నట్లైతే, క్షితిలో – భూమి యందు, దొడ్డ – గొప్ప/పెద్దవైన/ ఘనమైన, తురంగ – గుఱ్ఱములు, సామజములు – ఏనుగలు, ఏ – ఏమంత, చిత్రమ్ములు – ఆశ్చర్యకరాలు?, ఆందోళికాతతులు – పల్లకీల సమూహాలు, ఏ లెక్క – ఏమంత పరిగణింప దగినవి? విలాసినీజన – విలాసవతులైన స్త్రీలు, సువస్త్రవ్రాత – మంచిబట్టలకుప్పలు, భూషా – నగలు, కలాప – మైపూతలు మొదలైన పరిమళద్రవ్యాలు, తనూజ – బిడ్డలు, ఆదికము – మొదలైన వాటిలో, ఏమి దుర్లభము – పొందరానివి ఏమున్నాయి?

తాత్పర్యం:
పద్మాలసౌరుని గెలుచునట్టి శుభప్రదమైన పాదాలుగల శ్రీకాళహస్తీశ్వరా! నీ పాదాలని అర్చించే వారికి గొప్పగుఱ్ఱాలు, ఏనుగలు, పల్లకీలు, స్త్రీలు, మంచివస్త్రాలు, అలంకారాలు, మైపూతలు, సంతానం మొదలైనవి ఏవి కూడా గొప్పవి, ఆశ్చర్యకరమైనవి, పొందరానివి కావు.

విశేషం:
లోకంలో భోగచిహ్నాలుగా, ప్రయోజకత్వాలుగా, ఘనమైనవిగా పరిగణించబడేవి ఏవీ కూడా శివుడిపాదాలు భజించేవాడికి గొప్పవిగా అనిపించవు. వాటన్నింటిని మించిన ఘనమైన ఐశ్వర్యం ఈశ్వరదాసుడికి ఉంది. పైగా అల్పంగా అనిపించే ఈ విషయాలన్నీ శివపాదస్మరణతో అనాయాసంగా లభిస్తాయి. శివభక్తి, శివపాదమహత్వం ఈ పద్యంలో వివరించ బడింది.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement