Tuesday, November 26, 2024

శ్రీకాళహస్తీశ్వరా శతకం

68.
నీ కారుణ్యము గల్గి నట్టి నరు డే నీచాలయమ్ముం జొరండే కార్పణ్యపు మాటలాడ నరుగం డెవ్వారితో వేషముల్
గైకో( డే మతముల్ భజింప డిల నే కష్టప్రకారంబులన్ జీకాకై చెడిపోడు జీవన దశన్ శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా! నీ కారుణ్యము – నీదయ, కల్గిన – అట్టి – ఉన్నటువంటి, నరుడు – మానవుడు, ఏ – ఎటువంటి, నీచ – ఆలయమ్మున్ – నీచుడి (రాజు) నివాసాన్ని (మందిరాన్ని), చొరడు – ప్రవేశింపడు, ఏ – ఎటువంటి, కార్పణ్యము – మాటలు – కఠినమైన మాటలు, ఏ – వారితోన్ – ఎవరితోను, ఆడన్ – అరుగండు – పలకబోడు, వేషముల్ – ఆడంబరమైన వేషాలని, కైకోడు – గ్రహించడు (ధరించడు), ఏ మతముల్ – ఏ మతధర్మాలని, భజింపడు – పాటించడు, ఇలన్ – భూమియందు, జీవనదశన్ – జీవనస్థితిలో,(బ్రతుకుతెఱువునకై) ఏ – ఎటువంటి, కష్టప్రకారంబులన్ – కష్టమైన పరిస్థితులు వచ్చినా, చీకాకు -ఐ – కల్లోలపడి, చెడిపోడు్స నశింపడు (క్రుంగిపోడు).

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! నీ దయకు పాత్రుడైన మానవుడు ఎటువంటి నీచుడి భవనంలోనూ ప్రవేశింపడు. ఎవ్వరితోనూ కఠినంగా (చెడుగా) మాట్లాడడు. ఆడంబరమైన వేషాలు వేయడు. ఏ మతాన్ని సేవించడు. బ్రతుకుతెఱువు కోసం చేసే ప్రయత్నంలో ఎన్నికష్టాలు వచ్చినా, కల్లోలపడి, క్రుంగిపోడు.

విశేషం:
పరమేశ్వరుడి దయ ఉండాలే కాని సత్ప్రవర్తన అప్రయత్నంగా సిద్ధిస్తుంది. లేదా సత్ప్రవర్తన కలవాడు కనుకనే ఒకమనిషికి శివానుగ్రహం లభించిం దని చెప్పటం సమంజసం. ఇతరులని నిందిస్తే ఆ జీవిలో ఉన్న రుద్రుణ్ణి నిందించినట్టే. ఒక మతధర్మాన్నే పాటిస్తే ఇతర మార్గాలలో భగవంతుణ్ణి చేరటాన్ని అంగీకరించ నట్టే కదా! అంటే, తన అవకాశాలను తానే పరిమితం చేసుకున్నట్టు. అన్నీ భగవంతుణ్ణి చేరే మార్గాలే ననే విశాలభావన లేకపోయినవాడికి భగవంతుడి విశ్వరూపం లేదా సర్వవ్యాపకత్వం ఎట్లా అర్థ మవుతుంది?

డాక్టర్ అనంతలక్ష్మి


Advertisement

తాజా వార్తలు

Advertisement