70.
చదువుల్ నేర్చిన పండితాధములు స్వేచ్ఛాభాషణ క్రీడలన్
వదరన్ సంశయభీకరాటావుల( ద్రోవల్ దప్పి వర్తింపగా
మదనక్రోధకిరాతు లందు( గని భీమప్రౌఢ వే( దాకినం
జెదరుం జిత్తము చిత్తగింప(గదవే శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం :
శ్రీకాళహస్తీశ్వరా! చదువుల్ నేర్చిన – బాగుగా చదువుకొన్న, పండిత – అధములు – నీచులైన పండితులు, స్వేచ్ఛా – భాషణ – క్రీడలన్ – తమ ఇచ్చవచ్చినట్టు మాట్లాడటం అనే వినోదాలతో, వదరన్ – ప్రేలుతుండగా, సంశయ – సందేహాలనే, భీకర – అటవులన్-భయంకరమైన అడవులలో, తోవల్ – తప్పి – దారితప్పి, వర్తింపగాన్ – తిరుగాడుచుండగా, మదన – కామం అనే, క్రోధ – క్రోధం అనే కిరాతులు – బోయవారు, అందున్అ -క్కడ (ఆ అరణ్యాలలో), కని – చూసి, భీమప్రౌఢిన్ – భయంకరమైన బలంతో, తాకినన్ – దాడిచేస్తే, చిత్తము – మనస్సు, చెదరున్ – స్థిరత్వం తప్పుతోంది, చిత్తగింపగదవు – ఏ – ఈ విషయాన్ని గ్రహించవా? (రక్షింపవా?)
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! నీచులైన పండితులు కొందఱు తమ ఇచ్చవచ్చినట్టు మాటలగారడీలతో ప్రేలాపన చేస్తుండగా, సామాన్యజనుల కర్థం కాక, అంతకుముందు అర్థమైనవి కూడ అయోమయం కాగా, సందేహాలు అనే భయంకరమైన అరణ్యాలలో దారితప్పి, తిరుగాడుతుండగా, కామక్రోధాలనే వేటగాళ్ళు భయంకరమైన బలంతో వేగంగా దాడి చేస్తే వారి మనస్సు మఱింత చెదరి పోతోంది. అట్టివారిని రక్షింపవా?
విశేషం:
పండితుల పద్ధతిని నిరసించటం ఈ పద్యంలో కూడా కనపడుతుంది. పాండిత్యప్రకర్షతో ప్రక్కదారులు పట్టించేవారి బారినుండి రక్షించమని ప్రార్థన. దారి తెలియని స్థితిలోనే కామక్రోధాలు దాడిచేస్తాయి. తెలిసినవారు వాటిని నిగ్రహించగలరు. పండితులది పుస్తకజ్ఞానం. తెలియదని ఒప్పుకోటానికి భేషజంఅడ్డువస్తుంది. అందుకని ప్రతిదీ తమకు తెలియకపోయినా, తెలిసిందని తోచినట్టు వాగుతూ వినోదిస్తుంటారు. వారిమాటలతో వింటున్న సామాన్యులకి అంతకుముందు తెలిసినది కూడ పోయి, మఱింత అయోమయంగా ఉంటుంది.
డాక్టర్ అనంతలక్ష్మి