87.
సంపద్గర్వము బాఱద్రోలి, రిపులం జంకించి, యాకాంక్షలన
దప్పం్వ బెట్టి, కళంకముల్నఱికి, బంధక్లేశదోషంబులన్
జింపుల్ చేసి, వయోవిలాసములు సంక్షేపించి భూతంబులన్
జెంపల్వేయక నిన్ను గాన నగునా? శ్రీకాళహస్తీశ్వరా!
”దంపుల్వెట్టి”
అనే పాఠాంతరం ఉంది. అదే సరైనది కావచ్చు. ప్రాస స్థానంలో ‘ుపు’ ఉండటమే సమంజసం. ‘ప్ప’ అయితే ప్రాస తప్పుతుంది.
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, సంపత్ – గర్వమున్ – ఐశ్వర్యము వలన కలిగిన అహంకారం / ధనమదం, పాఱన్ – త్రోలి – పారిపోయేట్టు అదిలించి / వేదాల గొట్టి, రిపులన్ – అరిషడ్వర్గాలని, జంకించి – భయ పెట్టి, ఆకాంక్షలన్ – కోరికలని, తప్పన్ – పెట్టి – ప్రక్కకి త్రోసి, కళంకమున్ -మాలిన్యాన్ని / పాపాన్ని, నఱికి – తెగవేసి / నశింప చేసి, బంధ – బంధుత్వం వల్ల కలిగే, క్లేశ – కష్టాల వల్ల వచ్చిన, దోషంబులన్ – పొరపాట్లని / దుఃఖాలని / పాపాలని, చింపుల్ చేసి – ముక్కలు చేసి, వయోవిలాసములు – యవ్వన లీలలు, సంక్షేపించి – తగ్గించుకొని, భూతంబులన్ – పంచభూతాలని, చెంపల్ – వేయక – చెంపలు వాయించి అదుపులో పెట్టకుండగ, నిన్ను -నిన్ను, కానన్ – అగునా – చూడటానికి వీలవుతుందా? ( కాదు అని భావం)
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! సంపదలున్నాయన్న గర్వాన్ని వదలి, అరిషడ్వర్గాలయినకామక్రోధాదులని జయించి, కోరికలని ప్రక్కకి నెట్టి, మాలిన్యాలని అనగా, పాపాలని ఖండించి, చుట్టరికాల వల్ల వచ్చే కష్టాలని, దుఃఖాలని తెగతెంపులు చేసికొని, యవ్వనభోగాలని క్లుప్తీకరించి (తగ్గించి), శరీరనిర్మాణానికి హేతువులైన పంచభూతాలని గెలిచి నట్లైతేనే నిన్ను దర్శించటానికి వీలవుతుంది. లేనట్లయితే నిన్ను చూడటానికి వీలు కాదు.
విశేషం:
పరమేశ్వరుడి దర్శనం లభించాలంటే ఎటువంటి నియమనిష్ఠలతో సాధన చేయాలో చెప్పాడీపద్యంలో. పంచభూతాలని అదుపులో పెట్టటం అంటే వాటి ప్రకోపాన్ని తట్టుకోగలగటం, ఎండ, వాన, చలి మొదలైన వాటిని సహించి తపస్సు చేయటం. వేదాంతులు పంచీకరణంఅని శరీరంలో ఉన్న పంచభూతాలకి, బాహ్యప్రపంచంలో ఉన్న పంచభూతాలకు అనుసంధానం చేసి, తద్వారా వాటిని అదుపులో పెట్టుకుంటారు.
డాక్టర్ అనంతలక్ష్మి