86. నీపై కావ్యము చెప్పుచున్నయతడున్ నీ పద్యముల్ వ్రాసి యి
మ్మా పాఠం బొనరింతునన్నయతడున్, మంజు ప్రబంధంబు ని
ష్ఠాపూర్తింబఠియించుచున్నయతడున్సద్బాంధవుల్ గాక ఛీ!
ఛీ! పృష్ఠాగతబాంధవంబు నిజమా! శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, నీ పైన్ – నీ మీద, కావ్యమున్ – గ్రంథాన్ని, చెప్పుచున్న – రచిస్తున్న, అతడున్ – వ్యక్తియు, నీ పద్యముల్ – నీ పై పద్యాలని, వ్రాసి – రచించి, ఇమ్ము్శ ఆ – ఇవ్వ వలసినది, పాఠం బొనరింతున్ – చదువుతాను, అన్న్స అన్నటువంటి, అతడున్ – మనుజుడును, మంజు – మనోహరమైన, ప్రబంధంబు – కావ్యాన్ని / గ్రంథాన్ని, నిష్ఠాపూర్తిన్ – పరమనిష్ఠతో, పఠియించుచున్న – చదువుతున్న, అతడున్ – మానవుడును, సత్ – బాంధవుల్ – యోగ్యులైన చుట్టాలు, కాక – వారు కాక, పృష్ఠాగత – వెన్నంటి వచ్చే (జన్మసంబంధం చేత వచ్చే) బాంధవంబు – బంధుత్వం / చుట్టఱికం, నిజమా – అసలైనదా?, ఛీ! ఛీ! – చీదరించుకోదగినది కదా!
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా!నీపై కావ్యం చెప్పేవాడు, నీ మీద పద్యాలు వ్రాసి ఇస్తే చదువుకుంటాను అన్నవాడు, నిన్ను గురించి చెప్పే మనోహరమైన పురాణాది ప్రబంధాలని నియమనిష్ఠలతో చదివేవాడు, నాకు తగిన బంధువులు. జన్మ మాత్రము చేత బంధుత్వం కలవారు నిజమైన బంధువులా? కారని భావం.
విశేషం:జగత్తు కంతా తల్లితండ్రులు పార్వతీపరమేశ్వరులు. వారితో సంబంధం కలవారేతనకీ చుట్టాలు. జన్మ చేత వచ్చినవి ఈ జన్మకి సంబంధించినవి మాత్రమే కదా! శివసంబంధి చుట్టరికాలు జన్మజన్మలకి సంబంధించినవి కదా! శాశ్వతమైనవి.
డాక్టర్ అనంతలక్ష్మి