85. విత్తజ్ఞానముపాదు చిత్తము, భవావేశంబురక్షాంబువుల్
మత్తత్వంబుతదంకురంబనృతముల్ మారాకు లత్యంత దు
ర్వ్రుత్తుల్ పువ్వులు పండ్లు మన్మథముఖావిర్భూతదోషంబులున్
చిత్తాభ్యున్నతనింబభూజమునకున్శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, చిత్త – మనస్సు అనెడి, అభి -ఉన్నత – బాగా అభివృద్ధి చెంది ఎత్తైన, నింబ – వేప, భూజమునకున్ – చెట్టుకి, విత్తజ్ఞానము – ధనానికి సంబంధించిన తెలివియే, పాదు్స మూలము / బోదె, భవ – ఆవేశంబు – సంసార సంబంధమైన ఉద్రేకమే, రక్ష – అంబువుల్ – చెట్టుని రక్షించే నీరు, మత్తత్వంబు – మదించి ఉండే లక్షణమే, తత్ – అంకురంబు – దాని మొలక, అనృతముల్ – అసత్య భాషణాలే, మారు – ఆకులు – బీజదళాల తరవాత వచ్చే మొదటి ఆకులు, అతి – అంత – మిక్కిలి / అధికమైన, దుర్వృత్తుల్ – చెడ్డవర్తనలే, పువ్వులు – దాని పూలు, మన్మథముఖ – మన్మథుడి నుండి, ఆవిర్భూత – పుట్టిన, దోషంబులు – వికారములే, పండ్లు – ఫలాలు.
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! మనస్సు అనే బాగా ఎత్తుగా ఎదిగిన వేపచెట్టుకి ధనసంబంధమైనతెలివియే మొదలు. సంసార సంబంధమైన భావావేశమే రక్షణ నిచ్చే నీరు. మదించి ఉండే లక్షణమే మొలక. అసత్యాలే మారాకులు. మిక్కిలి చెడు ప్రవర్తనలే పూలు. మన్మథవికారాలే పండ్లు.
విశేషం:
ఇది విషమాలంకారం. అమృతస్వరూపుడైన శివుడి నుండి ఉద్భవించిన మానవుడి మనస్సు అనే వేపచెట్టు చేదుగా ఉండటం విపరీతం కదా!
సుఖానికి భోగాలు, భోగాలకి ధనం మూలం అనే భ్రమలో ఉండటమే ఇన్ని రకాలైన దుర్మార్గాలకి మూలం అనే సత్యాన్ని ఈ పద్యంలో తెలియ చెప్పాడు ధూర్జటి.
డాక్టర్ అనంతలక్ష్మి