84. పుడమిన్నిన్నొకబిల్వపత్రముననే పూజించి పుణ్యంబునుం
బడయన్నేరకపెక్కుదైవంబులకుంబప్పుల్బ్రసాదంబులుం
గుడముల్ దోసెలు సారెసత్తులడుకుల్గుగ్గిళ్ళునుంబెట్టుచుం
జెడి, యెందుంగొఱ గాక పోదు రకటా! శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, పుడమిన్ – భూమిలో, నిన్ను – నిన్ను, ఒక – ఒకేఒక, బిల్వపత్రమున్ – ఏ – మారేడుదళంతోనే, పూజించి – అర్చనచేసి, పుణ్యంబునున్ – పుణ్యాన్ని, పడయన్ – పొందటం, నేరక – తెలియక, పెక్కు – అనేకాలైన, దైవంబులకున్ – దేవతామూర్తులకు, పప్పుల్ – వడపప్పులని, ప్రసాదంబులున్ – వివిధాలైన ప్రసాదాలని, కుడుముల్ – ఉండ్రాళ్ళని, దోసెలు – అట్లని, సారెసత్తులు – జంతికలు మొదలైన కరకరలాడే పిండివంటలని, అడుకుల్ – అటుకులని, గుగ్గిళ్ళునున్ – సాతాళించిన సెనగలని, పెట్టుచు – నైవేద్యం పెడుతూ, చెడి – మోక్షమార్గం తప్పి (కష్టపడి), ఎందున్ – ఎక్కడైనాఅనగాఇహపరలోకాలలో, కొఱ – కాక – పోదురు – పనికి రాకుండా పోతారు.
తాత్పర్యం: శ్రీకాళహస్తీశ్వరా! భూలోకంలో నిన్ను ఒక్క బిల్వపత్రం సమర్పించి పూజించి, పుణ్యాన్ని సంపాదించటం తెలియక మానవులు అనేకమైన ఇతర దైవతాలకివడపప్పులు, వండిన ప్రసాదాలు, ఉండ్రాళ్ళు, అట్లు, జంతికలు మొదలైనవి, అటుకులు, సాతాళించిన సెనగలు మొదలైనవి నైవేద్యంగా పెట్టి, కష్టపడి, మోక్షమార్గం తప్పి, ఎటూ కాకుండా పోతున్నారు. అనగాఇహపరాలురెంటికీ చెడుతున్నారు.
విశేషం: శివుణ్ణి ‘ ఏకబిల్వంశివార్పణం’ అంటూ ఒక్క మారేడుదళంతో పూజిస్తే చాలు. సులభమైన మార్గాన్ని వదలి ఆడంబరమైన పూజలు, నైవేద్యాలు చేయటంలో పడి పూజకి సమయం మిగలక ఇహపరాలురెంటికీకొఱగాకుండా పోవటం జరుగుతోందని దూర్జటి ఆవేదన. ప్రసాదాలు తయారు చేసే హడావుడిలో పడి, శివధ్యానం తగ్గిపోవటం జరుగుతుంది. ఆ సమయం కూడా శివధ్యానంలో గడప వచ్చు కదా!
శ్రీకాళహస్తీశ్వరా శతకం
Advertisement
తాజా వార్తలు
Advertisement