Saturday, November 23, 2024

శ్రీకాళహస్తీశ్వరా శతకం

82.
తమకం బొప్ప(బరాంగనాజనపరద్రవ్యంబులన్మ్రుచ్చిలం
గ మహోద్యోగముసేయునెమ్మనముదొంగం బట్టి వైరాగ్యపా
శములంజుట్టి బిగించి నీదుచరణస్తంభంబునం గట్టి వై
చి ముదం బెప్పుడు( గల్గజేయ( గదవే! శ్రీకాళహస్తీశ్వరా!

ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, తమకంబు్శ ఒప్పన్ – ఆపరాని మోహం అధికం కాగా, పర – అంగనాజన – పరస్త్రీలని, పరద్రవ్యంబులన్ – ఇతరుల ధనాలని, మ్రుచ్చిలంగన్ – దొంగిలించటానికి, మహా – ఉద్యోగము – పెద్ద పెద్ద ప్రయత్నాలని, చేయు – చేస్తూ ఉండే, నెఱ – మనము – నిండుమనస్సు అనే, దొంగన్ – పట్టి – దొంగని పట్టుకొని, వైరాగ్యపాశములన్ – విరక్తి అనే త్రాళ్ళతో , చుట్టి – కట్టి, బిగించి – గట్టిగా బంధించి, నీదు – నీ యొక్క, చరణస్తంభంబునన్ – పాదం అనే స్తంభానికి, కట్టివైచి – కట్టి, ఎప్పుడున్ – ఎల్లప్పుడు, ముదంబునన్ – సంతోషాన్ని, కల్గన్ – చేయన్ – కదవు – ఏ – కలిగింపవా?

తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! ఆపరాని మోహంతో పరస్త్రీలని, ధనాలని దొంగిలించటానికని గొప్ప గొప్ప ప్రయత్నాలు చేస్తూ ఉండే నా మనస్సు అనే దొంగని వైరాగ్య మనే తాళ్లతో చుట్టి, గట్టిగా కదలకుండా ఉండేట్లు బిగించి, నీ పాదాలనే స్తంభాలకి కట్టి, నా కెల్లప్పుడు సంతోషాన్ని కలిగించవా?

విశేషం:
మనస్సుని తనంతట తాను అదుపు చేసుకోవటం కష్టమే. దానికి కావలసినదిదైవానుగ్రహం. అది సులభమైన మార్గం.
నిండుమనస్సు అనే దొంగ, వైరాగ్యం అనే పాశాలు, నీదు చరణాలు అనే స్తంభాలు – అనే అభేద కల్పనం వల్ల ఇది చక్కని రూపకాలంకారం. పరస్త్రీలని, పరధనాన్నివీలైతే అపహరించటం, లేకపోతే అనుభవించటం రాక్షసుల సహజగుణం. మనిషిలో రాక్షసలక్షణాలు ప్రకోపించి నప్పుడు అటువంటి గుణాలు బయల్పడతాయి.

డాక్టర్ అనంతలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement