79.
కాసంతైనసుఖంబొనర్చునొ? మనఃకామంబులీడేర్చునో
వీసంబైనను వెంట వచ్చునొ? జగద్విఖ్యాతిగావించునొ?
దోసంబుల్వెడ( బాపునో? వలసినందోడ్తోమిముంజూపునో
ఛీ! సంసార దురాశ యేలుడుపవో? శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, కాసు – అంత – ఐన – కొంచె మైనా, సుఖంబు – సౌఖ్యాన్ని, ఒనర్చును -ఒ – కలిగిస్తుందా?, మనః – మనస్సు నందలి, కామంబులు – కోరికలు, ఈడేర్చును – ఓ – తీరుస్తుందా?, వీసంబు – ఐనను – వీసమెత్తు పదార్థమైనా, వెంట వచ్చును – ఆ – పైలోకాలకి వెంట వస్తుందా?, జగత్ – విఖ్యాతిన్ – లోకంలో కీర్తిని, కావించును – ఓ – కలిగిస్తుందా?, దోసంబుల్ – పాపాలని, పెడన్ – పాపును – ఓ – నశింప చేస్తుందా?, వలసినన్ – అవసర మైతే, తోడ్తోన్ – వెను వెంటనే, మిమున్ – మిమ్ములను, చూపును – ఓ – చూప గలుగుతుందా?, సంసారదురాశ – సంసార మందున్న ఈ పేరాశ, ఏల – ఉడుపవు – ఓ – ఎందుకు పోగొట్టవో కదా!
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! సంసారంపై నున్న పేరాశ కొంచె మైనా సుఖాన్ని కలిగిస్తుందా? మనసు నందలి కోరికల్ని తీర్చుతుందా? అతి చిన్నభాగ్యమైనా శరీరం వదలిన తరువాత వెంట వస్తుందా? పోనీ, ఇహలోకంలోకీర్తిప్రతిష్ఠలనైనాకలిగిస్తుందా? పాపాలనైనాపోగొడుతుందా? అవసరమైతే మీ దర్శన మైనా కల్పిస్తుందా? (ఏమీ చేయదు కదా) ఆ దూరాశని ఎందుకు పోగొట్టవు?
విశేషం:
సంసారమోహం ఇహాన్ని, పరాన్ని కూడా ఇవ్వలేదు. అందువల్ల అది వదల దగినది.
డాక్టర్ అనంతలక్ష్మి