111.
దురమున్ దుర్గము రాయబారము మదిన్ దొంగర్కమున్ వైద్యమున్
నరనాథాశ్రయ మోడబేరమును పెన్మంత్రంబు సిద్ధించినన్
అరయం దొడ్డ ఫలంబు గల్గునది గాకా కార్యమె తప్పినన్
సిరియుం బోవును బ్రాణహానియు నగున్ శ్రీకాళహస్తీశ్వరా!
ప్రతిపదార్థం:
శ్రీకాళహస్తీశ్వరా!, అరయన్ – విచారించి చూడగా, దురమున్ – యుద్ధాన్ని, దుర్గము – కోటయు, రాయబారము – మధ్యవర్తిత్వం, మరిన్ – ఇంకా, దొంగర్కమున్ – దొంగతనమూ, వైద్యమున్ – భేషజమూ, నరనాథ – ఆశ్రయము – రాజుల నాశ్రయించటం, ఓడబేరము – నౌకావ్యాపారం,పెన్ మంత్రంబు – గొప్పమంత్రం, సిద్ధించినన్ – సఫలమైనట్లయితే, దొడ్డఫలంబు – గొప్పఫలితం, కల్గున్ – కలుగుతుంది?, అదికాక – ఆ విధంగా కాక, ఆ కార్యము – ఆపని, తప్పినన్ – సిద్ధించక పోయినట్లైతే/ లోపం జరిగితే, సిరియున్ – ధనము కూడా, పోవున్ – తొలగిపోతుంది, ప్రాణహానియున్ – ప్రాణనష్టం కూడా, అగున్ – అవుతుంది.
తాత్పర్యం:
శ్రీకాళహస్తీశ్వరా! యుద్ధం, కోట, మధ్యవర్తిత్వం, దొంగతనం, వైద్యవృత్తి, రాజాశ్రయం, నౌకావ్యాపారం, గొప్పమంత్రరాజం వంటివి సరిగా ఫలిస్తే, చాలా గొప్పగా ఉంటుంది ఫలితం. లేక ఏ మాత్రం తేడా వచ్చినా ఆ పని చెడిపోవటమే కాదు ధనహాని, ప్రాణహాని కూడా కలుగుతుంది. ధనార్జనకై చేసే ఈ పనులు ఎంత లాభదాయకాలో, అంతటి ప్రమాదకరాలు.
విశేషం:
“మననాత్ త్రాయతే ఇతి మంత్రః” మననము చేయగా, చేయగా రక్షించేది అని అర్థం.
పైన చెప్పిన వన్ని వెంటనే సత్ఫలితాల నిస్తాయి. ఏ మాత్రం లోపం జరిగినా అంతటి దుష్ఫలితాలే ప్రాప్తిస్తాయి. శివారాధనలో ఎటువంటి తేడాలు వచ్చినా హాని ఏ మాత్రం ఉండదు. శివుడు తమోగుణప్రధాను డైనా భక్తుల పట్ల సాత్వికుడు. ఎందుకంటే భక్తి సాత్వికం కదా!
డాక్టర్ అనంతలక్ష్మి