Saturday, November 23, 2024

శూర్పణఖ, రావణ కుంభకర్ణ, విభీషణుల వివాహాలు

సోదరులు ముగ్గురు యుక్త వయస్కురాలైన శూర్పణఖకు పెండ్లి చేయతలచి, తగిన వరునికై అన్వేషించారు. కాలకేయుడైన విద్యుజ్జిహ్వుడు తగిన వరుడు అని నిర్ణయించారు. శూర్పణఖ విద్యుజ్జిహులకు పెండ్లి చేశారు. దశకంఠుడు ఒకనాడు వేటాడుటకై పోయి మయునితో పాటు ఒక అతిలోక సుందరిని చూశాడు. మదన బాణ పీడితుడయ్యాడు. అట్టహాసాన్ని బయటపడనీయకుండా, వినయ స్వభావుడై మయాసురుని సమీపించి, ”నీవు ఎవరు”? అడవిలో ఈ కన్యను వెంట పెట్టుకుని తిరుగుతున్నావేమి? ఈ లావణ్య రాశి ఎవరు?” అని అడిగాడు. మయాసురుడు తన వివరాలను ఇలా తెలిపాడు.
”నా పేరు మయుడు. దేవతలు నా గుణగణాలను మెచ్చి హేమ అనే అప్సరసను నాకు ఇచ్చారు. నేను ఆమెను పెండ్లాడాను. ఆమెతో నేను 500 వందల యేం డ్లు సుఖించాను. తర్వాత దేవ కార్య నిమిత్తమై హేమ దివికి వెళ్ళింది. 14 ఏళ్లు గడిచినా ఆమె తిరిగి రాలేదు. హేమ సంస్మరణార్థమై మాయా ప్రభావంతో వజ్ర వైఢూర్యాలను పొదిగిన పేరు మండోదరి. ఈమె నాకు హేమకు జన్మించిన పుత్రిక. ఈమెకు తగిన వరునికై అన్వేషిస్తున్నాను. అదృష్ట వశమున నిన్ను కలిశాను. ఈ పుత్రిక కంటే ముందు మాకు మాయవి, దుందుభి అనే కొడుకులు పుట్టారు. ఇరువురు కొడుకుల తర్వాత పుట్టిన మా గారాబు పుత్రిక మండోదరి. ఇవి నా వివరాలు. నీవు ఎవరివో తెలుపుమన్నాడు మయుడు.
దశకంఠుడు నేను పులస్త్య బ్రహ్మ మనుమడిని. విశ్రవసుని
పుత్రుడను. లంకేశ్వరుడను. నన్ను దశకంఠుడు అంటారు అని తెలిపాడు. ”నా కూతురు భాగ్య వశమున నువ్వు తారసపడ్డావు. బ్రహ్మ వంశానికి చెందిన మహాత్ముని అల్లునిగా పొందడం నా పూర్వజన్మ సుకృతం! ఈమెను భార్యగా స్వీకరింపుము. ఉభయ వంశాల కీర్తికి ఈమె వన్నె తేగలదు” అని మయుడు ప్రార్థించాడు. తొలి చూపులోనే తన మనసు దోచుకున్న సుందరాంగి, తనకు భార్య అవుతున్నందులకు దశకంఠుడు మురిసిపోయాడు. దశకంఠుడు మండోదరి పాణిగ్రహణం చేశాడు. మయుడు తపశ్శక్తితో తాను పొందిన దివ్య ”శక్తి”ని దశకంఠునికి కానుకగా ఇచ్చాడు. మయుడు దశకంఠునికి ఇచ్చిన ఆ శక్తియే యుద్దరంగంలో లక్ష్మణునికి ప్రాణాంతకమైన మూర్చను కల్పించింది!
కుంభకర్ణుడు బలి చక్రవర్త మనుమరాలు వజ్రజ్వాలను పెండ్లాడాడు. శైలూషుడనే గంథ ర్వ ప్రభువు కూతురు సరమను విభీషణుడు పెండ్లాడాడు.
రావణునికి మండోదరియందు మేఘనాథుడు జన్మించాడు. అతడు పుట్టిన వెంటనే మేఘగర్జన వలె భయంకరంగా రోదించాడు. అందువల్ల అతనికి మేఘనాథుడు అని నామకరణం చేశారు. అతడే తరువాత ఇంద్రజిత్తు అని ప్రఖ్యాతి వహించాడు.
కుబేరుని హితబోధ
కుంభకర్ణుడు దేవతల పన్నాగం ఫలితంగా గాఢనిద్రను వరంగా పొాండు. బ్రహ్మ వాక్కు అమోఘం అవడంవల్ల నిద్రాదేవి కుంభకర్ణుని ఆవహించింది. కుంభకర్ణుడు కునికిపాట్లు పడుతూ అన్న దశకంఠుని వద్దకు వచ్చాడు. తాను నిద్రించడానికి తగిన వసతులతో భవనాన్ని కల్పింపుమన్నాడు. దశకంఠుడు వెంటనే మహోన్నత విశాల రమ్య హార్యాన్ని నిర్మింపజేశాడు. కుంభకర్ణుడు నిద్రమత్తుతో భవన ప్రవేశం చేసి గాఢనిద్రా పరవశుడయ్యాడు.
దశకంఠుడు ముల్లోకాలలో తిరుగులేనివాడై, సజ్జనులను, దేవతలను, గంధర్వాదులను ముప్పు తిప్పలు పెట్టాడు. సాత్వికులైప మునీశ్వరులను క్రూరంగా హింసించాడు. నందనవనం మున్నగు ఉద్యానవనాలను ధ్వంసం కావించాడు.
కుబేరుడు దశకంఠుడు సాగిస్తున్న దారుణ మారణకాండను గూర్చి విన్నాడు. అతనికి బుద్ధి చెప్పతలచి , హితకరమైన సందేశాన్ని దూత ద్వారా పంపాడు. దూత మొదట సాధు పురుషుడైన విభీషణుని సందర్శించాడు. విభీషణుడు దూతను సాదరంగా ఆహ్వానించాడు. దశకంఠుని అనుమతిపొంది, దూతను రాజ్యసభలో ప్రవేశపెట్టాడు. దూత జయ జయ నినాదాలతో దశకంఠుని ప్రస్తుతించాడు. పిమ్మట కుబేరుని సందేశాన్ని వినిపించాడు.
తమ్ముడా, బాల్య చాపల్యంతో ఎన్నో దారుణ కృత్యాలు చేశావు. మనం వశం కీర్తిప్రతిష్టలకు క్రూర కర్మములు కళంకాన్ని కల్పిస్తాయి. దేవతలను పీడించావు. మునులను హతమార్చావు. అని విన్నాను. దేవతలు నీపై దాడి చేయ తలచారని నాకు తెలిసింది. తండ్రి మాట ధిక్కరించావు! నీ కంటే పెద్దవాడైన నా మాటను కూడా పెడ చెవిన పెట్టావు!
నేను రౌద్రమనే వ్రతాన్ని కఠోర నియమవ్రతుడనై, జితేంద్రియుడనై చేశాను. పరమ శివుడు మెచ్చి పార్వతీ సమేతుడై ప్రత్యక్షమయ్యాడు. పరమ శివుని ప్రక్కనే చోటు సంపాదించుకున్న ఈ పుణ్యాత్మురాలు ఎవరో అనుకుంటూ నేను తదేక దృష్టితో ఆమెను చూశాను. నా మనస్సులో ఏ దోషమూ లేదు. అయినా పార్వతి కోపించింది. ఆమె రూక్ష వీక్షణానికి నా ఎడమ కన్ను దగ్ధమయ్యింది. ఆ బూడిద కప్పడంవల్ల నా ఎడమ కన్ను పింగళ వర్ణాన్ని పొందింది.
తరువాత నేను కైలాసగిరికి పోయి, చీర్ణ అనే వ్రతాన్ని అవలంబించి, నియమ నిష్టలతో 800 ఏండ్లు తపస్సు చేశాను. శివుడు మెచ్చి ప్రత్యక్షమై నాకు మిత్రుడయ్యాడు. ఏకాక్షి పింగళుడు అనే పేరును ప్రసాదించాడు. శంకరునికి మిత్రుడనై పవిత్రుడయ్యాను. నేను అలకాపురికి తరిగి వచ్చాను. నీ దుష్ట కృత్యాలను గూర్చి ఇప్పుడే విన్నాను. నీవు మన వంశాచారాన్ని, ధర్మాన్ని మంట కలుపుతున్నావనీ గ్రహించాను. నా మాటను వినుము. క్రూరకృత్యాలను విడువుము అనే కుబేరుని సందేశాన్ని విని, దశకంఠుడు క్రోధ ఘూర్ణిత నేత్రుడయ్యాడు. రోషగ్రస్తుడై ఆవేశపరుడై పండ్లు కొరుకుతూ ఓరి మూర్ఖుడా! నీకు నీ ప్రభువు కుబేరునికి పోగాలం దాపురించింది. తనకు శివుడు మిత్రుడని విర్రవీగుతూ నన్నే బెదిరిస్తున్నాడు! నీ ప్రభువు కారు కూతలతో తన పతనాన్ని తానే ఆహ్వానిస్తున్నాడు. తరువాత నీ ఈ ప్రభువు పని పడతానులే! ఇప్పుడు నా చేతిలో నీ చావు మూడింది అని గర్జిస్తూ, సింహాసనం నుండి దూత మీదకి లంఘించాడు. ఖడ్గాన్ని ఝళిపించి ఒక్క వేటుతో దూత తల నరికాడు. దూత కళేబరాన్ని రాక్షస భృత్యులకు అల్పాహారంగా ఇచ్చాడు.
కుబేరుని సందేశం దశకంఠుని పౌరుషాగ్నిని ప్రజ్వలింపజేసింది. ముల్లోకాలను జయించాలని పంతం పట్టాడు. చతురంగ డళంతో దిగ్విజయ యాత్ర చేయడానికి బయలుదేరాడు.

– కె.ఓబులేశు
9052847742

Advertisement

తాజా వార్తలు

Advertisement