శ్రీరాముడు అరణ్యవాసానికి వెళుతున్నపుడు మొదట లక్ష్మణస్వామి తాను కూడా వస్తానంటే అంగీకరిస్తాడు. అయితే తరువాత అంత:పురానికి వెళ్ళి సీతతో మాట్లాడి తిరిగి బయటకు వచ్చినపుడు మాత్రం ‘నీవు అరణ్యానికి రావద్దు. ఇక్కడే ఉండి కౌసల్యను, సుమిత్రను జాగ్రత్తగా చూసుకొమ్మ’ని లక్ష్మణస్వామితో అంటాడు. అపుడు సీత ద్వారా కాక రాముడు అనుగ్రహించడని తలంచి అన్నగారి పాదాలను గట్టిగా పట్టుకుని సీతతో మాట్లాడతాడు. ఇదీ ఆ శ్లోకం….
‘స భ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య రఘునందన:
సీతామువాచాతియశా: రాఘవంచ మహావ్రతమ్”
లక్ష్మణస్వామి రామపాదాలు పట్టుకుని ‘అమ్మా! నీవు చెప్పమ్మా! నీవు చెప్పితేనే రాముడు అంగీకరిస్తాడు. అదుగో స్వామీ! వదిన చెబుతోంది చూడు! అంటాడు. అం త లక్ష్మణస్వామికే సీతను ఆశ్రయించనిదే పని కాలేదంటే ఇక మనకు విడిగా చెప్పవలసిన దేముంటుంది! అందుకే శ్రీమద్రామాయణాన్ని ‘సీతాచరితం’ అన్నారు. కావ్యం రామాయణం కృత్స్న సీతాయాశ్చరరితం మహత్’ అని చెప్పారు. సీతాచరితం అంటే పురుషకార వైభవం. అంటే స్వామిని చేరాలంటే అమ్మదయ ఒక్కటే దారి అన్నమాట.
…శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి