98. ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలి గొంటివి వింతగాదె? నీ
మంతన మెట్టిదో ఉడుత మైని కరాగ్ర నఖాంకురంబులన్
సంతసమంద చేసితివి, సత్కుల జన్మమదేమి లెక్క వే
దాంతముగాదె నీ మహిమ, దాశరథీ! కరుణాపయోనిధీ!
తాత్పర్యం: ఓ దశరథ రామా! శబరి ఎంతటి పుణ్యాత్మురాలో గదా! ఆమె ఎంగిలి చేసిన పండ్లు స్వీకరించడం వింతగా తోస్తుంది. నీ ఆలోచనా స్రవంతి ఎట్టిదో తెలియదు. ఉడుత సాయానికి మెచ్చి దాని శరీరాన్ని చేతివేళ్ళ గోటి కొనలతో నిమిరి సంతోషపెట్టావు. జాతి, కులం తో నీకు ప్రమేయం లేదు. నీ మహత్వం తెలుసుకోవడం కష్టసాధ్యం. వేదాంతం వంటిది దయాసముద్రా!
విశేషం: రామచంద్రుని జీవిత గమనంలోని రెండు సన్నివేశా లను గుర్తుజేసి ఆయనకు జాతి, కుల వివక్ష లేదని గోపన్న విశద పరుస్తున్నాడు. అయితే ఈ రెండు సందర్భాలు వాల్మీకి రామాయ ణంలో కనిపించవు. శబరి ఎంగిలి చేసిన పండ్లు రాముడు స్వీకరించి నట్లు లేదు. అలానే సేతుబంధన సమయంలో ఉడుత సహాయం. హరిదాసులు ప్రచారంలోకి తెచ్చారు.
డాక్టర్ రేవూరు అనంతపద్మనాభరావు
98665 86805