ఆంధ్ర శతక సాహిత్య ప్రక్రియలో వేమన, సుమతి శతకాల్లోలాగా విశేష ప్రచారం పొందినది భాస్కర శతకం. పలు నీతులను ఉపమానములుగా తమ శతకంలో రచయిత మారన వెంకయ్య సమాజానికి అందించి మేలు చేశారు.
కవి ఒక మంచి పద్యం ద్వారా విధి లిఖించిన కర్మను ప్రస్తావించారు.
ఉ. కట్టడమైన యట్టి నిజ కర్మము చుట్టుచు వచ్చి యేగతిం
బెట్టునోపెట్టినట్లను భవింపక తీఱదు కాళ్ళు మీదుగా
గిట్టక వ్రేలుడంచు దలక్రిందుగ గట్టిరె యెవ్వరైన నా
చెట్టున గబ్బిలంబులకు జేరిన కర్మముగాక భాస్కరా
అంటూ సంచిత కర్మలో నుంచి వచ్చిన ప్రారబ్ద కర్మ ఎలా నడిపిస్తే ఆ విధంగా ఎవరైనా న డవక తప్పదు. ఇది జగమెరిగిన సత్యం. మానవులే గాకుండా పశుపక్ష్యాదులు, కీటకాలు కూడా విధిననుసరించి ప్రవర్తింపవలసినదే. కవి ఈ పద్యంలో ఉదాహరణగా గబ్బిలాల తీరును తెలుపుతూ గబ్బిలాలు చెట్టు మీద కాళ్ళు ఉంచి తలక్రిందులుగా వేలాడుతుంటాయి.
అది వాటి ప్రారబ్ధ కర్మఫలమే తప్ప, వాటిని సహించక ఎవరైనా చెట్టుకు కట్టి వేశారా? లేదు కదా! అలాగే శరీర ధారులందరూ ఏదో కర్మ చేయడం సహజం. అది జీవ లక్షణం. సంచిత కర్మలలో నుంచి నియమంగా వచ్చిన ఈ జన్మ ప్రారబ్ద కర్మ ఫలాన్ని అనుభవిస్తూ ఉండటం ఒక నియమమే. కర్మలు మూడు విధాలు. సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. జన్మ జన్మలనుంచి చేసిన కర్మలు సంచితం. సంచిత కర్మల నుండి వచ్చేది ప్రారబ్ధం. ఇప్పుడు చేస్తున్న కర్మలలో ముందు జన్మకు కారణమయ్యేది ఆగామి కర్మ.
సంచిత కర్మ అంతా గతానికి సంబంధించినది. నడుస్తున్న జన్మకు కారణమైనది ప్రారబ్ధ కర్మ. ఇది వర్తమానానికి సంబంధించినది. జన్మ జన్మలలో చేసిన కర్మలన్నీ సంచిత కర్మలు. ఆగామి కర్మ భవిష్యత్తుకు చెందినది. ఈ జన్మలో చేసిన కర్మలు కూడా సంచితంలోనే కలుస్తాయి. అందులో రాబోయే జన్మకు హేతువైన కర్మ ఆగామి అంటారు. దీని గురించి సంస్కృత సూక్తి రత్నకోశంలో కవి ఒక శ్లోకం చెబుతూ
అవశ్యమను భోక్తవ్యం- కృతం కర్మ శుభాశుభం
కృత కర్మ క్షయో నాస్తి కల్ప కోటి శతైరపి అన్నాడు. చేసిన పని మంచిదైనా చెడ్డదైనా తప్పకుండా అనుభవించక తప్పదు. వందకోట్ల కల్పాలైనా చేసిన కర్మ అనుభవించకుండా తరిగిపోదు అని భావన చేశాడు. జగతికి సందేశం అందించాడు.
బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యంలో జీవుడు గర్భంలో వుండగానే ఆ జీవి ఆయష్షు, చేయబోయే పనులూ, ధనమూ, చదువూ, మరణమూ ఈ అయిదు నిర్ణయించాడు.
ఇదే విషయాన్ని పంచతంత్రం మిత్రలాభ గ్రంథంలో యిలా తెలిపాడు. ఆయుతి కర్మచ విత్తంచ విద్యాని ధనమేవచ
పంచైతాని హిసృజ్యంతే గర్భస్థ స్వైవ దేహిన: అన్నారు.
ఈశ్వరేచ్ఛ బలవత్తరమైనది.
విధి విధానం గురించి వివరిస్తూ, దైవం తోడు లేని సమయాల్లో శుభం చేకూరదు. దైవబలం ఎవరికైనా కావాలని ధ్వనిగా తెలిపాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రునికి తండ్రి అయిన దశరథ మహారాజు, కుల గురువు వశిష్టులవారు కూడా పట్టాభిషేకం చేయదలచారు. కానీ ఒక చిన్న కారణం చేత ఆ ప్రయత్నం నెరవేరలేదు. విధి విధానాలకు కట్టడి అనగాని యతి లేక నియమం ఉండాలి. నియతి అంటే దైవం. విధి కలసిరానప్పుడు మేలు చేకూరదు. గొప్పవారు ఎంత ప్రయత్నం చేసినా భాగ్యం కలగదు. అది సమకూరదు. దీనికి ఉదాహరణ శ్రీ రామ పట్టాభిషేక ప్రయత్నమే.
ప్రజలందరు అయోధ్యకు రాజుగా శ్రీరాముడు కావలెనన్నారు. మనసారా కోరుకున్నారు. విధి వారి కోరికను నెరవేర్చలేకపోయినది గదా! పట్టాభిషేకం జరగడానికి బదులుగా దానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా శ్రీరామునికి వనవాసం దాపురించినది. కుల గురువైన వశిష్ట మహర్షియే రాజ్యాభిషేక లగ్నం నిర్ణయించినాడు. కానీ ఆ లగ్నం నెరవేరలేదు. కర్మ ప్రధానమైనది. శుభ గ్రహాలు ఏమి చేయలేక పోయాయి. రాముడు అడవుల్లో సంచరించక తప్పలేదు. విధి వంచితులై రాముడు, జానకి, లక్ష్మణుడు, అడవులకు వెళ్ళారు. కాగల దానిని గూర్చి ఎవరూ ఏమీ చెప్పలేరు గదా! విధి ఎలా ఉంటే అలా జరుగుతుందని సర్ది చెప్పుకుంటూ వుంటుంది సమాజం. దైవానికి తప్పలేదు విధిని ఎదిరించడం. మనమెంత అని భావిస్తారు.
”దైవే విముఖతాం. యాతేన కోష్యస్తి సహాయక:” అంటే దైవం ప్రతికూలమైనప్పుడు, సహకరించనప్పుడు ఒక్క రూపాయి సాయపడరు. విధి వక్రించి ఉండగా కార్యాలు సిద్ధించవు. లోకంలో ఒక సామెత తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది. అని. ఇది వ్యవహారంలో ఒకటై చరిస్తున్నది.
ఆంధ్ర మహా భారతంలో కూడా పాండవులు విధి వశాన జూదంలో పాల్గొని తమ రాజ్య సర్వస్వాన్ని పోగొట్టుకుని పన్నెండు సంవత్సరాలు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం అనుభవించారు. విధి వంచితులైనారు. కావ్యాల్లో ప్రబంధాల్లో కవులు, విధి వంచితులైన వారి ఉపాఖ్యానాలను ప్రపంచానికి అందించి జాగరూకులలై ఉండమని సందేశాన్ని అందించారు.
కలి మానవులు నేటికీ తలచినది జరుగనప్పుడు ‘మనందరం విధి చేతిలోకీలు బొమ్మలం. ఆ దైవమే అందరినీ దయతో చూడాల’ని అంటూ ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రవేశించి కొంతలో కొంతైనా శాంతి సౌఖ్యాలను పొందుదాం అని సరిపె ట్టుకొనుటలో ఎంతో అంతరార్థం ఉంది. విధి లిఖించిన కర్మ అనుభవించక తప్పదు. ఎంతటివారికైనా!
పి.వి. సీతారామమూర్తి
94903 86015