Wednesday, November 20, 2024

వానర శ్రేష్ఠుడి వాలంలో గంట

తండ్రి మాట ప్రకారం అడవులకు వచ్చాడు రాముడు. తోడుగా సీతమ్మ తల్లి. నీడగా లక్ష్మణుడు. వనవాసంలో అనుకోని ఘటన సీతమ్మ అపహరణ. భార్యను వెదుకుతూ బయల్దేరిన రామచంద్రునికి సుగ్రీవుడు, హనుమంతునితో స్నేహం కుదిరింది. సుగ్రీ వుడు సీతమ్మ జాడ కనిపెట్టడానికి నలుదిక్కులకూ వానరుల్ని పంపాడు. రావణ లంకలో ఉన్న అమ్మ జాడను హనుమ కనిపెట్టాడు. యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాము డు కపి సైన్యాన్ని, భల్లూక పటాలంతో జతకూర్చాడు. కోతులు, ఎలుగుబంట్ల రణానికి తరలివెళుతున్న తమ వాళ్ళను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు. ఒకవైపు స్వామికార్యం, మరొక వైపు పేగుబంధం – ఈ రెండింటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామి కార్యానికే పూనుకున్నారు వానర వీరు లు. కన్నీళ్ళు కారుతున్నా ‘విజయోస్తు – దిగ్విజయోస్తు’ అని అంటన్నారు కుటుంబ సభ్యులు. ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదలిపోయాడు. తుది వీడ్కోళ్ళు ముగిసాయి. అప్పుడు లేచాడు రాముడు.
”ఓ వానరులారా! ప్రాణాస్పదులైన మీ బిడ్డలను, భర్త లను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు. మీ నిస్వా ర్థతకు నా నమోవాకాలు. నేను అఋణిని. ఎవరి ఋణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగినవాణ్ణి. కనుక, ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో, అంతమందితోనే వెనక్కు తిరిగి వస్తాను.’ అని అన్నాడు.
…రామ సేవ కోసం కదలిన కపిసైన్యంలో సుగ్రీ వుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నత కాయులతో బాటు ‘సింగిలీకలు’ అని పిలువబడే పొట్టి పొట్టి మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగిలీక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పళ్ళు, వాడియైన గోళ్ళు వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగిలీ కలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్ళతో కొరికి, గోళ్ళతో రక్కి చంపుతాయి. రామరావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది. కుం భకర్ణుడు యుద్ధరంగానికి వచ్చాడు. కుంభ కర్ణుడు రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్నిచిన్ని గంటలు కట్టి వున్నాయి. ఘోరమైన పోరు తర్వాత రామ బాణం దెబ్బకు నేలకూలాడు. రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట క్రింద పడింది. అదే సమయంలో యుద్ధరంగంలో వెయ్యి మంది సింగిలీక కోతులు గుంపుగా వెళుతున్నాయి. కుంభకర్ణుని రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి, నేరుగా ఈ కోతుల పైన పడింది. గంటదేమో భారీ ఆకారం. కోతులేమో మరు గుజ్జులు. ఇంకేముంది – ఆ వెయ్యి కోతులూ గంట కింద ఇరుక్కుపోయాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది. అంతే, ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది. అలా కొద్ది సేపు గడిచాక, ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొ క్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడసాగింది. అప్పుడు ఒక ముసలి కోతి ‘స#హనంతో ఉందాం. రామ నామ స్మరణ చేద్దాం.’ అంది. ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకుని రామ తారక మంత్రాన్ని జపించడం మొదలు పెట్టింది. అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామ నామాన్ని చేయసా గాయి. అలా కొద్ది కాలంలోనే, అన్ని కోతులు రామ నామ సంకీర్తనలో మునిగిపోయాయి.

యుద్ధం తర్వాత సీతతో రాముడు అయోధ్యకు వెళు తూ సుగ్రీవుణ్ణి పిలిచి, తన
వాగ్దానాన్ని గుర్తు చేసాడు. కపి సైన్యాన్ని లెక్కించ మన్నాడు. లెక్కలు వేసి సుగ్రీవుడు ‘ఒక
వెయ్యి కోతులు తక్కువగా ఉన్నా’ యని చెప్పాడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయల్దేరాడు. ముందు హనుమ దారి చేస్తుండగా, యుద్ధ రంగంలోకి వచ్చాడు రాముడు. ఎటు చూసిన రాక్షసుల శవాలు, విరిగిన రథాలు, కత్తులు, పగిలిన డాళ్ళు. వాట న్నింటి మధ్యా ఎక్కడైనా వానరులు పడివున్నారేమో స్వయంగా వెదుకుతున్నాడు రాముడు. అంతలో, స్వామి దృష్టి ఒక గంటపై పడింది.’హనుమా’ అన్నాడు. పవనసు తునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమయింది. వెం టనే తోకను పెంచి గంటను పైకి లేపాడు. అక్కడ ఆ గంట క్రింద పెదవులపై రామనామం తాండవిస్తుండగా, మూసి న కళ్ళతో, రామభక్తితో వికసించిన మనసులతో కూర్చుని వున్న కోతులు. సుగ్రీవుడు లెక్కవేసాడు. వెయ్యి సింగిలీక కోతులు. లెక్కసరిపోయింది. చుట్టూవున్న వానర సైన్యం ఒక పెట్టున ‘జయ రామ” అంటూ జయఘోష చేసింది.

అప్పటి వరకూ చీమ చిటుకుమన్న శబ్దం కూడ వినని మరుగుజ్జు కోతులు జయజయ ధ్వానాలకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాయి. ఎదురుగా ఆజానుబాహుడు… అరవింద దళాయతాక్షుడు నిశాచర వినాశకరుడు, భక్తకోటికి శీత కరుడు అయిన రాముడు నిలబడివున్నాడు. అంతే… సింగిలీక కోతులకు దిగ్భ్రమ కలిగింది. దిక్కు తోచలేదు. వానరసైన్యం మరొక్కమారు జయఘోషను చేసింది. ‘జై శ్రీరామ జై శ్రీరామా” అప్పుడు తెలిసింది ఏం చేయాలో. వెంటనే రామపాదారవిందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు. అలా సింగిలీక కోతుల జన్మ ధన్యమయ్యా యి. ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకు మళ్ళింది.
‘సుందరే సుందరం కపి:’- ‘ము్దదన కోతి తోకకు ముచ్చ టైన గంట’. మురిపెంగా చూసాడు ముగ్ధమోహనుడైన రాముడు. ‘హనుమా! ఈ సింగిలీక కోతుల కథకు గుర్తుగా, తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు అర్చిస్తారో వారికి నా అనుగ్రహం రెండింతలు లభిస్తుంద’ని వరమి చ్చాడు శ్రీరాముడు. వాలంలో గంటను కలిగిన వానర శ్రేష్టుణ్ణి దర్శించేప్పుడు, పూజించేప్పుడు ఈ సింగిలీక కథను గుర్తుచేసుకోండి.

  • దైతా నాగ పద్మలత, 9502734852
Advertisement

తాజా వార్తలు

Advertisement