బ్రహ్మ దేవుడు స్వాయంభువ మనువు, శతరూపను సృష్టించి, సృష్టి పెంచమని వారిని కోరినపుడు సృష్టించబడిన ప్రాణులు నివసించడానికి ఆధారమైన భూమి నీటిలో ఉన్న కారణాన పైకి తీసుకువస్తే సృష్టి కొనసాగిస్తామని బ్రహ్మకు విన్నవించగా ఇది తన పని కాదని బ్రహ్మ పరమాత్మను ప్రార్థించగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మ నాసికా రంధ్రం నుండి అంగుష్ట మాత్ర పరిమాణంతో వరాహ రూపంలో అవతరించాడు. చూస్తుండగానే గం డశిలా పరిమాణంలో పెరిగి గూర్గురారావం చేస్తూ సముద్రంలోకి చొచ్చుకుని వెళ్లి దేవతలు, మునులు, ఋషులు, యోగులు స్తోత్రం చేస్తుండగా భూమిని పైకి తీసుకుని వచ్చి సముద్రంపై నిలిపి ఆ సమయంలోనే అడ్డు వచ్చిన హిరణ్యాక్షుడిని సంహరించిన వాడు వరాహ స్వామి. ఈ స్వామి ఒంటిని ఒక్కసారి దులపగా రోమములు కింద రాలి పడగా, తన గిట్టలలో ఇరుక్కున్న మట్టిని రాలిపడిన రోమాలపై మూడు చోట్ల దులిపి మూడు ముద్దలుగా చేశారు. ఈ వరాహ రోమాలే దర్భలు. ఆ మూడు ముద్దలు పితృ, పితామహ, ప్రపితామహ భాగములైన మూడు పిండములు. ఈ విధంగా పితృ యజ్ఞమును తాను స్వయంగా ఆచరించి లోకానికి చెప్పాడు. ఋషులకు వేదాంత సారాన్ని వరాహ పురాణంగా అందించి ఋషి యజ్ఞాన్ని నిర్వహించాడు. అదేవిధంగా యజ్ఞ స్వరూపునిగా దేవ యజ్ఞమును, భూమిని పైన నిలిపి భూత యజ్ఞమును, భూమిపై పాడిపంటలకు నెలవు అందించి అతిథి యజ్ఞమును నిర్వహించి సకల లోకాలచే స్తుతించబడుతున్నాడు.
…శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి