అమరావతి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై తొమ్మిది రోజుల పాటు జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్కడక్కడా మిగిలిన పనులను బుధవారం సాయంత్రంలోగా పూర్తి చేసేందుకు అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఉపలయాలు సైతం శరన్నవరాత్రి శోభను సంతరించుకున్నాయి. గురువారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో రోజుకు 10వేల మందికి మాత్రమే దర్శనం చేసుకునే అవకాశం ఉంది. ఉచిత దర్శనాలు నాలుగు వేలు, రూ.300 టిక్కెట్టుపై మూడు వేలు, రూ.100 టిక్కెట్టుపై మూడు వేల మంది భక్తులను మా త్రమే అనుమతిస్తారు. తొలి రోజు ఉదయం 9గంటలకు శ్రీ కనకదుర్గమ్మ వారి దర్శనం ప్రారంభమై రాత్రి 10గంటల వరకు కొనసాగు తుంది. మిగిలిన రోజుల్లో ఉదయం 4గంటల నుంచి రాత్రి 10గంటల వరకు, మూలా నక్షత్రం రోజున తెల్లవారు జామున 3గంటల నుంచి రాత్రి 11గంటల వరకు శ్రీకనకదుర్గమ్మ అమ్మవారి దర్శనం ఉంటుంది. ఆన్లైన్లో నమోదు చేసుకున్న భక్తులను మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తా రు. ముందస్తు ఆన్లైన్ చేయించుకోని వారి కోసం విజయవాడ నగరపాలక సంస్థ కార్యాల యం, దుర్గగుడి టోల్‌గేటు, ఓమ్ టర్నింగ్ పా యింట్, పున్నమి ఘాట్‌లో కరంట్ బుకింగ్ కౌం టర్లు ఏర్పాటు చేశారు. పున్నమిఘాట్లో రూ.300 టిక్కెట్లు కొనుగోలు చేసిన భక్తులను ప్రత్యేక బస్సుల్లో కొండ పైభాగంలోని ఓమ్ టర్నింగ్ వరకు తీసుకెళ్లి దించు తారు. అమ్మవారి భక్తుల కోసం కనకదుర్గానగర్‌లో 12 ప్రసాదం కౌంటర్లు, కొండ పైభాగంలో ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. కోవిడ్-19 నిబం ధనల నేపధ్యంలో థర్మల్ స్క్రీనింగ్ చేసిన తర్వాతనే దర్శనానికి అనుమతిస్తారు. ఇదే సమయంలో అన్ని క్యూలైన్లలోను రోజుకు మూడు సార్లు శానిటైజేషన్ చేస్తారు. కోవిడ్-19 నిబంధనల మేరకు భక్తుల రక్షణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ జే.నివాస్ నేతృత్వంలో పలుమార్లు అధికారులతో సమీక్షించి తగిన ఏర్పాట్లు చేశారు.
ప్రత్యేక క్యూ మార్గాలు..
శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. కొండ దిగువన కెనాల్ రోడ్డులోని వినాయకుని గుడి, కుమ్మరి పాలెం సెంటర్ నుంచి మూడు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పా టు చేశారు. వీరు కొండ పైభాగానికి వెళ్లిన తర్వాత ఓమ్ టర్నింగ్ పాయింట్ వద్ద ఐదు క్యూలైన్లు చేశారు. ఇందులో ఒకటి వీఐపీల కోసం అధికారులు కేటాయించారు. వర్షం వచ్చే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని క్యూలైన్లకు వాటర్ ప్రూ ఫ్ షామియానాలు అమర్చారు. భక్తులు నడిచేందుకు అసౌకర్యం లేకుండా క్యూలైన్లలో మ్యాట్లు వేశారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు శ్రీ మల్లేశ్వరస్వామి ఆలయం సమీపంలోని మెట్ల మార్గం గుండా కొండ దిగువకు వెళ్లాల్సి ఉంటుంది.
అన్నదానం లేదు..
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అన్నదానం ఆపేశారు. శ్రీ అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ప్యాకెట్ల రూపంలో సాంబారు, పెరుగు అన్నం అందిస్తారు. ఉదయం, సాయం త్రం వేళల్లో బెల్లం పొంగలి పంపిణీ చేస్తారు. వీలైతే క్యూ మార్గాల్లో భక్తులకు టీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధి కారులు ఆదేశించారు.
జల్లు స్నానాలే.. కోవిడ్ నేపధ్యంలో
కృష్ణా నది ఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అవకా శం లేదని అధికారులు స్పష్టం చేశారు. సీతమ్మ వారి పాదాలు, కృష్ణవేణి ఘాట్ వద్ద భక్తులు జల్లు స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేకంగా తాత్కా లిక గదులు నిర్మించారు. సమీపంలోనే కేశఖండన శాలలు ఏర్పాటు చేశారు.
దుర్గమ్మ భక్తులకు హెలీరైడ్ సౌకర్యం
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి శరన్నవ రాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కు అధికారులు తీపి కబురు చెప్పారు. ఆకాశం నుంచి విజయవాడ అందాలను వీక్షించేందుకు వీలుగా తొలిసారి హెలీరైడ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించే శరన్నవరాత్రి మహోత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా హెలీరైడ్ నిలు స్తుందని కృష్ణాజిల్లా కలెక్టర్ జే.నివాస్ తెలిపారు. ఆకాశం నుంచి నగర అందాలను ఆరు నిమిషాల పాటు వీక్షించేందుకు ఒక్కొక్కరికి రూ.3,500 వసూలు చేస్తారు. 15 నిమిషాల పాటు నగర అందలాను వీక్షించుకోవాలనుకుంటే ఒక్కొక్కరికి రూ. 6 వేలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. హెలీరైడ్ ద్వారా నగర అందాలు, ప్రకృతి సౌందర్యాలను వీక్షించి తగిన అనుభూతి పొందేందుకే ఇది ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.