తిరుమల : ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం, కరోనా వ్యాధిని అరికట్టాలని శ్రీవారిని ప్రార్థిస్తూ సెప్టెంబర్ 3 నుండి 18వ తేదీ వరకు తిరుమల వసంత మండపంలో రామాయణంలోని బాలకాండ పారాయణ దీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో అంకురార్పణ జరుగనుంది.
బాలకాండలోని మొత్తం 77 సర్గల్లో 2,232 శ్లోకాలు ఉన్నాయి. బాలకాండలో బభౌరామఃసంప్రహృష్టఃసర్వదైవతైః అనే 16 అక్షరాల వాక్యం విశిష్టమైనది. ఇందులోని అక్షర సంఖ్య క్రమం ప్రకారం శ్లోకాలు ఆలపిస్తారు. చివరిరోజు ఒక సర్గ ఎక్కువ పారాయణం చేస్తారు. మొదటిరోజైన సెప్టెంబరు 3న మొదటి మూడు సర్గల్లోని 181 శ్లోకాలను పారాయణం చేస్తారు.
తిరుమలలోని వసంత మండపంలో ప్రతిరోజూ ఉదయం 16 మంది వేద, శాస్త్ర పండితులతో పారాయణదీక్ష చేపడతారు. అలాగే మరో 16 మంది పండితులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో జప, తర్పణ, హోమాదులు నిర్వహిస్తారు. వీటి వల్ల సకలశుభాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయి.