Saturday, November 23, 2024

రేపటితో ముగుస్తున్న నవరాత్రులు

అమరావతి, ఆంధ్రప్రభ: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి(దుర్గగుడి) వార్ల దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్స వాలు ముగింపు దశకు చేరుకున్నాయి. విజయదశమి రోజైన శుక్రవారం తెప్పో త్సవం కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ నెల 7న ప్రారంభమైన ఉత్సవాల్లో బుధవారం వరకు సుమారు మూడు లక్షల మంది శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. మరో రెండు రోజుల్లో లక్ష మందికి పైగా భక్తులు ఆలయానికి చేరుకొని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. గురు వారం నుంచి ఆదివారం వరకు లక్షలాది మంది భవానీలు శ్రీ అమ్మవారి దర్శనా లకు వచ్చే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ఇరుముడి విరమణ కార్యక్రమాలు రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. శ్రీ అమ్మవారి దర్శనం కోసం వచ్చే భవానీలు దీనిని దృష్టిలో పెట్టుకొని సహకరించాలని అధికారులు కోరారు. ఈ నెల 7న వైభవంగా ప్రారంభమైన శ్రీ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొలి రోజు 9వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆన్‌లైన్‌ స్లాటు బుకింగ్‌ చేసుకున్న వారికే దర్శనాలు అని ప్రకటించడంతో తొలి రోజు భక్తుల సంఖ్య పెద్దగా లేదు. ఆ తర్వాత నేరుగా వచ్చే భక్తుల కోసం కరెంట్‌ బుకింగ్‌లు ఏర్పాటు చేయడంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. రెండో రోజు 22వేలు, మూడో రోజు 30వేలు, నాలుగో రోజు 40వేలు, ఐదో రోజు 25వేల మంది వరకు భక్తులు దర్శించుకున్నారు. ఆరో రోజైన మంగళవారం శ్రీ అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో లక్షకు పైగా భక్తులు దర్శించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అర్థరాత్రి వరకు దర్శనపు వేళలను పొడిగించారు. బుధవారం మరో 30వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. గత ఏడు రోజుల్లో టిక్కె ట్లు, ప్రసాదములు, వివిధ టిక్కెట్ల విక్రయాల ద్వారా రూ.కోటిన్నర వరకు శ్రీ అమ్మవారికి ఆదాయం వచ్చింది. మరో రెండో రోజుల్లో భక్తుల సంఖ్యతో పాటు ఆదాయం కూడా పెరగనుంది.
మాల విరమణ లేదు
భవానీలు శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని తమ తమ ప్రాంతాల్లో మాలధా రణ విరమణ చేయాలని సూచిస్తున్నారు. కోవిడ్‌ నిబంధనలను దృష్టిలో ఉంచు కొని ఇరుముడుల విరమణకు ఆలయంలో ఏర్పట్లు చేయలేదని ఈవో భ్రమరాంబ తెలిపారు. దర్శనం కోసం వచ్చే భవానీల కోసం ఇంద్రకీలాద్రి దిగువన సీతమ్మవారి పాదాల సమీపంలో కళ్యాణకట్ట(కేశఖండన శాల), జల్లు స్నానాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ పాలక మండలి ఛైర్మన్‌ పైలా సోమినాయుడు, గురు భవా నీలు సైతం మాలధారులు సహకరించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement