Saturday, November 23, 2024

రావణుడు సీతాదేవిని తాకాడా

(నిన్నటి సంచిక తరువాయి)

రావణుడు అనే సార్థక నామ ధేయం కల వాడినని, గంధర్వు లు, పన్నగులు, గరుడులు తన్ను చూసి భయ పడతారని, మృత్యువును చూసినట్లు ఎవరి ని చూస్తే పరుగెత్తుతారో, యుద్ధం లో ఎవరిని చూసి కుబేరుడు పరు గెత్తాడో, ఎవరికి భయపడి తన పట్టణమైన లంకను విడిచి కుబే రుడు కైలాసం చేరాడో, ఎవరు పుష్పక విమానాన్ని లాక్కొని తన వాహనంగా చేసుకు న్నాడో, అలాంటి తన ముఖాన్ని చూసి ఇంద్రుడు మొద లైన దేవతలు కూడా పరుగెత్తుతారని, తనున్న చోట గాలి కదలనని, సూర్యుడు చంద్రుడిలాగా చల్లగా అయిపోతాడని, ఎక్కడెక్కడ తాను నిలుస్తాడో అక్కడ చెట్ల మీద ఒక్క ఆకైనా భయంతో కదలదనీ సీతాదేవిని తన మాట లతో భయ పెట్టాడు. ఆమె భర్త రాముడిని దూషించాడు.
పది తలల వాడినైన తనను, కైలాస పర్వతాన్ని ఎత్తిన తన ను, కుబేరుడిని ఓడించి పుష్పక విమానాన్ని పొందిన తనను, ఇంద్రుడిని బందీ చేసిన తనను, బ్రహ్మ-శివుడి వరాలు పొందిన తనను, ముల్లోకాలు జయించిన వాడినైన తనను చేరడానికి సీతకు సందేహమెందుకనీ అడిగాడు. ఇవన్నీ విన్న సీత రావ ణుడికి మునుపటి కంటే కఠినంగా జవాబిచ్చింది. సీతాదేవి కఠినంగా రావణుడిని నిందించగానే రావణుడు కోపంతో శరీరం తెలియకుండా, భుజాలు ఎగురవేస్తూ, సీతను భయపెట్టడానికి తన నిజ స్వరూపాన్ని చూపించాడు. దొంగ సన్న్యాసి వేషాన్ని వదిలి ఆ దుష్టుడు పదితలల, ప్రళయకాలం లో సూర్యాగ్నిలాగా మితిమించిన తేజం కల, బంగారు కుండ లాల, కోపంతో కూడిన, నల్లటి మేఘంతో సమానమైన, విల్లు- బాణాలు కల కాలుడితో సమానమైన తన శరీరాన్ని చూపిం చాడు. ఎర్రటి వస్త్రాలు ధరించి, ఎర్రటి కళ్ళతో, ఎండాకాలం లోని సూర్య తేజస్సు వేడిమితో, విజృంభించి, కఠినమైన మాట లతో రావణుడు సీతాదేవితో ఇలా అన్నాడు.
”వినవే సీతా నా మాట! కళ్యాణీ నన్ను చూడు. నేను అలాంటి పొగడ్త కలవాడిని. నీమీద ప్రేమ వున్నవాడిని. నీకిష్టం కాని పని ఎన్నడూ చేయను. నామాట విని ఆ మనుష్యుడిని మరిచిపోయి దనుజుడనైన నన్ను కూడి నాకు శుభం
కలిగించు. ఓసీ! బుద్ధిలేనిదానా! నువ్వు తెలివి కలదానివనుకుంటున్నావు కాని
నీకు తెలివేలేదు. నీకు తెలివే వుంటే, ఒక ఆడదాని మాట ప్రకారం, రాజ్యాన్ని, స్నేహతులను, బం ధువులను, అందరినీ వదిలి, క్రూర సర్పాలు, ఏనుగు లు, మృగాలు, రాక్ష సులు సంచరించే అడవిలో తిరుగు తూ, శత్రువులను ఎదిరించి రాజ్యా న్ని సంపాదించు కునే ధైర్యంలేని దరిద్రుడిని ఎలా మోహిస్తావు? ఏం గుణాలు చూసి మెచ్చా వే?” ఇలా అంటూ రావణాసురుడు, ”అయ్యో! వీడు చెడిపో తున్నాడే?” అని స్నేహ భావంతో మంచిమాటలు చెప్తున్న సీతను కామంతో పరవ శుడై, పట్టుకున్నాడు. రావణుడు, ఎడమ చేత్తో సీతాదేవి తల వెంట్రుకలను, కుడిచేత్తో తొడలను, శీఘ్రంగా పట్టుకుని, తన మాయారథం అక్కడికి రాగానే, ఆ క్రూరుడు భయంకరమైన మాటలతో బెదిరించి, బలాత్కారం గా ఒడిలో ఎత్తుకున్నట్లు ఎత్తుకుని, రథంలో వేశాడు. ఆ సమ యంలో యముడితో సమానమై, తీక్షణంగా ప్రకాశించే కోర లతో, పర్వతమంత శరీరం గల ఆ రాక్షసుడిని చూసి వనదేవ తలు భయంతో అడవుల్లోకి పరుగెత్తారు. ఈ విధంగా ఆకాశం లో శీఘ్రంగా పోయే రథం మీద కడుబాధతో సీతాదేవి పిచ్చి పట్టినట్లు భ్రమచెందిన దానిలాగా ఏడ్చింది.
సీతాదేవిని రావణుడు ప్రత్యక్షంగా తాకాడా? లేదా? అనే విషయం చర్చనీయాంశం. వాల్మీకి రామాయణంలో రావ ణుడు సీతాదేవిని తాకి తీసుకుపోయాడని స్పష్టంగా చెప్పడం జరిగింది. రామచంద్రమూర్తి మాయామృగం వెంట పోయిన ప్పుడు అసలు సీతను దాచి మాయా సీతను ఆశ్ర మంలో వుంచాడనీ, రావణుడు తాకింది ఆమెనేననీ కొందరి వాదన. సీతాదేవి చుట్టూ గిరిగీసి, దానిని సీత దాటిపోవలదని లక్ష్మ ణుడు, రాముడి కొరకై పోయేటప్పుడు చెప్పినట్లు మరికొంద రి వాదన. రావణుడు పెళ్లను తీసుకుపోయాడే కాని సీతను తాకలేదని వారంటారు. రావణుడు అపహరించినది మా యా సీత అనడానికి వాల్మీకి రామాయణంలో ప్రమాణం లేదు.
రావణుడు ఎత్తుకుపోతున్న సీత రామలక్ష్మణులను తల చుకుంటూ ఏడ్చింది. ”అయ్యో! ఆశ్రిత రక్షణార్థివైన రామచం ద్రా! నీ ఆశ్రితురాలైన నన్ను వీడు ధర్మం తప్పి తీసుకుపోవడం చూడలేదా? రామా! న్యాయాన్ని ధిక్కరించి తిరిగే దుష్టులను శిక్షించే నువ్వు నన్ను దొంగిలించిన ఈ దుష్టుడిని ఎందుకు వదు ల్తున్నావు? పాపాత్ముడా! రావణా! నీ పాపఫలాలు వెంటనే అను భవానికి రావు. కొంతకాలానికి అవి పక్వాలై ఫలితమిస్తాయి. నువ్వు చేసే పాపానికి ఫలితం త్వరలోనే అనుభవిస్తావు. నీకు చెడిపోయే కాలం దాపరించినందున రావణా! ఇలాంటి పాప కార్యం చేయడానికి వచ్చావు. కాబట్టి శత్రువులకు మృత్యు వైన శ్రీరాముడి చేతిలో నీ ప్రాణాలు పోతాయి”.
”అడవిలోని పూలతో, పండ్లతో నిండివున్న వృక్ష సమూ హా ల్లారా! తీగలారా! ఆకాశాన సంచరించే వాళ్లూ, మీరు రాము డిని చూసినప్పుడు సీతను రావణుడు అపహరించాడని దయ తో చెప్పండి. మాల్యవంత పర్వతమా! దేవా విరోధి అయిన రావణుడు నీ భార్యను అపహరించి తీసుకుని పోతున్నాడని రాముడికి చెప్పు. గోదావరీ నదీ! నీకు దండం..దండం. కోదం డ ధరుడైన రాముడితో నీ భార్యను రావణుడు అపహరించా డని చెప్పు. నామీద దయవుంచి ఈ మాత్రం మాట సహాయం చేస్తే, ఆ తరువాత నేను స్వర్గంలో వున్నా, యమలోకంలో వున్నా, రామచంద్రమూర్తి నన్ను విడిపిస్తాడు” అని ఏడుస్తుంది సీత తనను రావణాసురుడు ఎత్తుకుని పోతుంటే.
”రామా! రామా! లక్ష్మణా!” అని ఏడుస్తున్న సీతాదేవి ఆకాశమార్గాన తీసుకుని అతి వేగంగా పరుగెత్తాడు రావణుడు. ఇలా రకరకాలుగా మాట్లాడుతూ, ఏడుస్తున్న సీత స్మృతి తప్పి పడుతూ ఉన్నప్పటికీ, రావణుడు ఆమెను తీసుకుపోవడం ఆప లేదు. రావణుడు సీతను చంకలో ఇరికించుకునిపోయాడు. ఆమె కుదురుగా వుండలేదు. ముందు వెనుకలకు వాలుతూ వుంది. ఎవరెప్పుడు అడ్డం తగులుతారో అన్న భయంతో త్వర గా లంకకు చేరాలన్న తపన రావణుడిది. రామలక్ష్మణులు రాక పోతారా అని సీత ఆశ. ఇలా చంకలో పొర్లడం వల్ల వెనుక పక్కగా వాలి సీత సొమ్ములను ఉత్తరీయంలో ముడికట్టి కిష్కింధ ప్రాంతం లో కిందకు పడేసింది. రావణుడు సీతతో లంక చేరాడు.
(వాసుదాసుగారి ఆంధ్రవాల్మీకి రామాయణం మందరం ఆధారంగా)


– వనం జ్వాలా నరసింహారావు
8008137012

Advertisement

తాజా వార్తలు

Advertisement