Tuesday, November 26, 2024

రాక్షస వంశచరిత్ర సుకేశుని వృత్తాంతం

రాముడు ”మునీంద్రా! రాక్షసులు పులస్త్య వంశీయులు అని పూర్వం విన్నాను. కానీ విశ్వప్రసాదుల కంటే ముందే లంకానగరం రాక్షస నివాసం అంటున్నావు! ఆ రాక్షసులు ఏ వంశానికి చెందినవారు రావణ కుంభకర్ణ మేఘనాదులకంటే వారు గొప్ప పరాక్రమవంతులా? వారు విష్ణువు వల్ల ప్రాణభీతితో పారి పోయారు అంటున్నావు! ఆ రాక్షసుల చరిత్రను సవివరంగా తెలు పు”మని కోరాడు. జగన్నాయకుడైన శ్రీ రామచంద్రుడు అమాయకంగా ప్రశ్నిం చడం విని అగస్త్యుడు భావగర్భితంగా నవ్వి, ఇలా తెలిపాడు. రామా బ్రహ్మ మొదట నీటిని సృష్టించాడు. వాటి రక్షణకై ప్రాణులను సృష్టించాడు. ప్రాణాలు ఆకలి దప్పులతో అలమటిస్తూ బ్రహ్మ వద్దకు వచ్చి, ‘మా కర్తవ్యమేమి?’ అని అడిగారు. బ్రహ్మ ‘ఈ నీటిని రక్షించండి’ అన్నాడు. వారిలో కొందరు ‘నీటిని రక్షిస్తాం’ అన్నారు. కొందరు జక్షామ (పూజిస్తాం) అన్నారు. రక్షిస్తాం అన్న వారు రాక్షసులు అయ్యారు. జక్షామ అన్నవారు యక్షులయ్యారు. రాక్షసులలో ప్రముఖులు హేతి, ప్రహేతి. వారు మధుకైట భులలో సమానులు. ప్రహేతి ధర్మాసక్తుడు. అతడు విరక్తుడై తప స్సు చేశాడు. హేతి సంసార బంధంలో తగులుకొన్నాడు. హేతి యముని ప్రార్థించి, అతని సోదరి ‘భయ’ను పెండ్లాడాడు. భయ, హేతి దంప తులకు సూర్య సమాన తేజోవంతుడైన కొడుకు పుట్టాడు. అతని పేరు విద్యుతే శుడు. అతడు వయ స్కుడయ్యాడు. హేతి తన పుత్రు నికి తగిన వధువు కొరకు అన్వేషించాడు. సంధ్య కుమార్తె సాలకటం కట అనే కన్యను చూశాడు. ఆమె విద్యుత్కేశునికి సరయిన జోడు అని నిశ్చయించుకున్నాడు. సాలక టంకటను తన కొడుకునకు భార్యగా ఇమ్మని సంధ్యని అడిగాడు. ఆడపిల్లను ఎప్పుడైనా ఒక అయ్య చేతిలో పెట్టా ల్సిందే కదా? యాదృచ్చికంగా వచ్చిన సంబంధాన్ని తృణీకరించ డం ఎందుకు? అని తలచి సంధ్య సాలకటంకటను విద్యుత్కేశునికి ఇచ్చి పెండ్లి జరిపించింది. సాలకటంకట విద్యుత్కేశులు యదేచ్ఛ గా విహరిస్తూ కామ సుఖాలను అనుభవించారు. సాలకటంకట గర్భవతి అయింది. భర్త తో సుఖించాలనే మోహంతో ఆమె రహ స్యంగా మందర పర్వత మందు ప్రసవించి తన కొడుకును వదిలి వెళ్ళిపోయింది. ఆ బాలుడు పిడికిలి నోటిలో ఉంచుకుని భీకరంగా ఏడ్చాడు. పార్వతి పరమేశ్వరులు వృషభ వాహనులై ఆకాశ మార్గంలో వెళుతూ, బాలుని ఏడుపు విన్నారు. పార్వతి మాతృ హృదయం పసివాని ఏడుపు విని కరిగిపోయింది. భార్య ఆసక్తిని పరమేశ్వరుడు గమ నించాడు. భార్యకు ఆనందాన్ని కలిగించాలనే తలంపుతో శివుడు పసిబాలుని వెంటనే నవయువకుని చేశాడు. అతనికి కామ గమన శక్తికల ఒక పురాన్ని ప్రసాదించాడు.పార్వతి రాక్షస స్త్రీల కామాసక్తిని దృష్టిలో ఉంచుకుని, వారికి సద్యోగర్భంలో బిడ్డలు పుడుతారు. పుట్టగానే బిడ్డ తల్లితో సమాన వయస్కుడు కాగలడు అని వరాన్ని ప్రసాదించింది. సాలకటంకట విద్యుత్కేశ దంపతుల కొడుకు సుకేశుడు అనే పేరుతో వ్యవహరింపబడ్డాడు. యాదృచ్చికంగా లభించిన పార్వ తి పరమేశ్వరుల వరాల వల్ల సుకేశుడు గర్వితుడయ్యాడు. కామ గమన శక్తి గల పురంలో యదేచ్ఛగా విహరించాడు. మాల్యవంతుడు, సుమాలి, మాలి వృత్తాంతం గంధర్వ ప్రభువు గ్రామణి రెండో కూతురు దేవవతి. గ్రామీణి తన పుత్రికకు తగిన వరునికై అన్వేషిస్తూ శివ వరప్రసాద సంప న్నుడైన సుకేశుని చూశాడు. అతడు తన కూతురికి తగిన వరుడు అని నిర్ణయించాడు. గ్రామీణి సుకేశునికి దేవవతిని ఇచ్చి పెండ్లి చేశా డు. పుట్టిన వెంటనే పార్వతి పరమేశ్వరుల అనుగ్రహాన్ని పొం దిన ఐశ్వర్యవంతుడు తనకు భర్త అయ్యాడని దేవత మురిసి పోయింది. పేదవానికి పెన్నిధి లభించినట్లు సంబరపడింది. దేవవతి సుకేశులకు మూడగ్నులవలె మహా తేజోవంతుల యిన కొడుకులు ముగ్గురు జన్మించారు. వారు మాల్యవంతుడు, సుమాలి, మాలి, వారు ముగ్గురూ సింహ పరాక్రములు, ధనమ దాందులు, అధికార గర్విష్టులు, ముల్లోకాలకు వారు కొరకరాని కొయ్యలు అయ్యారు. తమ తండ్రి శైశవాస్థ యందే శివుని కటాక్ష వీక్షణం వల్ల వర్దిల్లాడు అని వారు తెలుసుకున్నారు. బ్రహ్మను మెప్పించి వరాలు పొందగోరి మేరుపర్వతమందు ఘోర తపస్సు చేశారు. వారి తపస్సు తాపం తీవ్రతకు ముల్లోకాలు క్షోభించాయి. బ్రహ్మలోకాల తాపాన్ని తొలగింప తలచి, సుకేశుని కొడుకు లను అనుగ్రహింప తలచి ప్రత్యక్షమయ్యాడు. అజేయత్వాన్ని శత్రు విజయాన్ని, చిరకాల జీవనాన్ని, పరస్పర స్నేహాన్ని వరాలుగా కోరారు. బ్రహ్మ వారు కోరిన వరాలను ప్రసాదించి అదృశ్యుడ య్యాడు. సోదరులు ముగ్గురూ బ్రహ్మ ప్రసాద గర్వితులై కన్నూ, మిన్నూ కానక, దేవ దానవులను ముప్పుతిప్పలు పెట్టారు. వారు అత్యద్భుత సుందర నగరాన్ని నిర్మింపుమని విశ్వకర్మను ఆజ్ఞాపిం చారు. విశ్వకర్మ తాను పూర్వం నిర్మించిన అపూర్వ మనోహరమైన నగరాన్ని గూర్చి వారికి ఇలా తెలిపాడు. దక్షిణ సముద్ర తీరంలో త్రికూట పర్వతంపై అత్యద్భుత శిల్పనైపుణ్యంతో లంకా నగరాన్ని నిర్మించాను. దాని చెంతనే సువేల పర్వతం కూడా నెలకొని ఉంది. పూర్వం ఇంద్రుని ఆజ్ఞను అనుసరించి దాన్ని నిర్మించాను. లంక శత్రు దుర్భేద్యమైన కోట. మహోన్నత ప్రాకారాలతో అగాథం వంటి అగడ్తతో పరివృత్తమై ఉంది. మణిమయములు, వైఢూర్య ఖచితములయిన స్వర్ణ రమ్య హార్మ్యాలతో చూడ ముచ్చటగా ఉం టుంది. ఉద్యానవనాలు, విహార ప్రదేశాలు, కృత్రిమమైన కొండ గుహలతో రమణీయంగా ఉంటుంది. లంకానగరం అందచందా లు, వైభవ ప్రాభవాలు వర్ణనాతీతం అని విశ్వకర్మ తెలిపాడు. రాక్షసు లు లంకను తమ స్థావరంగా చేసుకున్నారు. నర్మద అనే గంధర్వ కాంత తన పుత్రికలు సుందరి, కేతుమతి, వసుధలను ముగ్గురు సోదరులకు ఇవ్వాలని నిశ్చయించింది. సుందరిని మాల్యవంతునికి, కేతుమతిని సుమాలికి, వసుధను మాలికి ఇచ్చి అత్యంత వైభవంగా వివాహాలు జరిపించింది. సుందరి మాల్యవంతులకు వజ్రముష్టి, విరూపాక్షుడు, దుర్ము ఖుడు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు, మత్తుడు, ఉన్మత్తుడు అనే ఏడు గురు కొడుకులు, అనల అనే కూతురు జన్మించారు. కేతుమతి సుమాలి దంపతులకు ప్రహస్తుడు, అకంపనుడు, వికటుడు, కాలకర్ముడు, ధూమ్రాక్షుడు, దండుడు, సుపార్శ్యుడు, మహాబలుడు, సంహాద్రి, ప్రఘనుడు, భాసకర్ణుడు అనే పదకొండు గురు కొడుకులు పుట్టారు. రాకా, పుష్పోత్కట, కైకసి, కుంభీనస అనే నలుగురు కూతుళ్ళు పుట్టారు. మాలికి, వసుధయందు అనిలుడు, అనలుడు, హరుడు, సంపాతి అనే నలుగురు కొడుకులు పుట్టారు. వీరు విభీషణునికి సన్నిహితులై అతనికి మంత్రులు అయ్యారు. రాక్షస బలం పెరిగింది. వారి అహంకారం ఇనుమడించింది. దురాగతాలు, మారణకాండ రెట్టింపయ్యాయి. లోకాలను పీడిం చడమే వారి నిత్యకృత్యమయ్యాయి. వారి ఆగడాలకు అడ్డూ అదు పు లేకుండా పోయాయి. దేవగణాలను పీడిస్తూ, సజ్జనులను హిం సిస్తూ, యజ్ఞ యాగాదులకు వి ఘ్నాలు కలిగిస్తూ, సింహ స్వప్నాలై ముల్లోకాలను కలవరపెట్టారు. ముల్లోకాలను సంక్షోభింప జేశారు.

– కె.ఓబులేశు
90528 47742

Advertisement

తాజా వార్తలు

Advertisement