101.తరువులు పూచి కాయలగు తత్కుసుమంబులు పూజగా భవత్
చరణము సోకి దాసులకు సారములౌ ధన ధాన్యరాసులై
కరిభట ఘోటకాంబర నికాయములై విరజానదీ సము
త్కరణ మొనర్చు చిత్రమిది దాశరథీ! కరుణాపయోనిధీ!
తాత్పర్యం: ఓ రఘు రామచంద్రా! దయాసముద్రా! చెట్లు పూచి పూవులు, ఆపైన కాయలు అవుతాయి. ఆ పూలను భక్తులు కోసి నీ పాదాల వద్ద పూజా కుసుమాలుగా వుంచితే నిన్ను సేవించినవారికి అధికమైన ధనధాన్య రాసులుగాను, ఏనుగులు, భటులు, గుర్రాలు, వస్త్ర సంపదగా పరిణమించి ఇహలోక సుఖాలనందిస్తుంది. అంత్య సమయంలో విరజానదిని దాటించి స్వర్గ సుఖాలను లభింపజేస్తుంది. అది నీ పూజా మహిమ.
విశేషం: పూలతోటలో పూలను కోయకపోతే అవి కాయలవు తాయి. అవి పూలుగా ఉన్నపుడు స్వామి పూజలకు సమర్పిస్తే ధన ధాన్య సంపదలు భగవంతుడు కల్పిస్తాడు. మరణానంతరం స్వర్గ సుఖాన్ని కలిగించి సాయుజ్యం అందిస్తాడు. భక్తిలో పూజ ప్రధానం. ఇహలోక సుఖాలతోబాటు పరలోక సుఖాన్ని కూడా భక్తితో సమర్పిం చిన పూజాకుసుమాలు ఫలితాన్నిస్తాయి.
డాక్టర్ రేవూరు అనంతపద్మనాభరావు
98665 86805