Friday, November 22, 2024

యోగం – యోగ్యత

మనం ఉండే స్థానం బట్టి మన స్థాయి పెరు గుతుంది. స్థాయిని బట్టి మన విలువ పెరుగుతుంది. మనం కలిసుండే వ్యక్తుల ద్వారా మన యోగ్యత పెరుగుతుంది. మంచితో కలిసి ఉంటే మహాత్ములవుతాం. మంచితనానికి ప్రతీకలు, మానవత్వానికి ప్రతిబింబాలవుతాం. ఔన్నత్యానికి, ఔదార్యానికి, వసుధైక తత్త్వానికి ప్రతినిధులవుతాం.
అదేవిధంగా అమానుషత్వంతో, అసహనంతో, అహంభావంతో, ఆత్మన్యూనతతో మనం కలిసి ఉంటే అల్లకల్లోలానికి కారణమవుతాం. అథ:పాతాళానికి పడిపోతాం. అవమానాల పాలౌతాం. హన చరిత్ర కు ఆద్యులం అవుతాం. చరిత్ర హనులుగా మిగిలిపోతాం.
”సహవాస దోషం” అని ఒకటుంది. మనం ఎవరితో సహవాసం చేస్తున్నామో, వారి దోషాలు తెలియకుండానే మనకు వస్తాయంటారు. అందుకే మంచివారితో, శీలవంతులతో సహవాసం చేయమంటారు. అయితే యిక్కడో ప్రశ్న ఉదయిస్తుంది. ఓ మంచివాడు, ఓ దుష్టుడితో సహవాసం చేస్తే దుష్టునిలోఉండే దుష్టత్వమే మంచివానికి ఎందుకు అంటుకుంటుంది? మంచివానిలో ఉండే సుగుణాలు దుష్టునికి రావ చ్చు కదా! అనేదే ఆ ప్రశ్న. ఇదే ప్రశ్న ఓ కుర్రాడికి వొచ్చింది. జవాబు కోసం గురువుగారిని ”చెడ్డవాని చెత్త గుణాలు మంచివానికి ఎందు కొస్తాయి? మంచివాని లో ఉండే మంచి లక్షణాలు దుష్టునికి వొచ్చి, దుష్టుడు మంచి మనిషి అవవచ్చు కదా?” అని అడిగాడు.
అప్పుడు గురువుగారు దూరంగా పడిఉన్న పెద్ద మసిబొగ్గుని తెమ్మన్నారు. దగ్గర ఉన్న తెల్లని పంచె మీద శిష్యుడు తెచ్చిన మసి బొగ్గుని వేసారు. పంచెను శిష్యుడికి చూపిస్తూ ”ఏమైందో చూసావా?” అని అడిగారు. మసి అంటుకుని తెల్లటి పంచె మురికై పోయిందన్నాడు శిష్యుడు. ”చూసేవా! మంచివాడు పంచెలాంటి వాడు. మసిబొగ్గు అవలక్షణాలు ఉన్న దుష్టుడు లాంటిది. కాబట్టి సహవాస దోష ప్రభా వం మంచివాడినే పాడు చేస్తుంది. దుష్టత్వం మంచివానికే అంటుకుం టుంది.” సోదాహరణగా శిష్యునికి జవాబు చెప్పారు గురువుగారు.
అందుకే మనం మంచివారితో మెలగాలి. మంచివారితోనే సాహ చర్యం చేయాలి. మహనీయులతో మసలాలి. మహానుభావులతో మన గలగాలి. వారి స్థాయిని అందుకోవాలి. అందుకోగలగాలి. వారి సామీప్యంలో సజ్జనులుగా మారాలి. వారి సారూప్యాన్ని అనుభవిం చాలి. అనుభవంలోనికి తెచ్చుకోగలగాలి.
ఉదా#హరణకు పెద్దరాయి అడవిన పడి ఉంటే బండ అంటాం. అదే బండ సుత్తి గునపంతో సంస్కరింపబడితే బొమ్మ అంటాం. అదే బొమ్మ గర్భగుడిలో నిలిస్తే దేవుడంటాం. పూజలు చేస్తాం. అర్చనలు, అభిషేకాలు చేస్తాం. నైవేద్యాలు పెడతాం. ఊరేగింపులతో ఉత్సవాలు చేస్తాం.
నీరు మట్టిని కలిసుంటే బురద అనంటాం. అంటుకుంటే శుభ్రం చేసుకుని వదిలించుకుంటాం. అదే నీరు కళ్ళలో నిలిస్తే కన్నీరంటాం. సుగంధ ద్రవ్యాలతో కలిసిపోతే పన్నీరు అంటాం. గంగానదిలో ఉంటే పుణ్యత్వాన్ని దివ్యత్వాన్ని ఆపాది స్తాం. తలమీద జల్లుకుంటాం. తన్మయులవుతాం. అదే నీరు పరమశివుని జటా జూటంలో ఉంటే గంగమ్మ తల్లి అనంటాం. దేవతగా ఆరాధిస్తాం.
కాలనాగు ఒక్కతే ఉంటే వెతికివెతికి కొట్టి చంపేస్తాం. పుట్టలో ఉంటే పాలుపోసి పూజలు చేస్తాం. మొక్కులు మొక్కుతాం. మొక్కుబడులు చెల్లిస్తాం. అదే కాలనాగు పరమ శివుని మెడలో ఉంటే తరించిపోతాం.
బియ్యపు గింజలు నీటిలో చాలాసేపు ఉంటే కడుగుళ్ళు అంటాం. వేడినీటిలో (అంటే ఎసరుతో కలిసుంటే) అన్నం అంటాం. పాలూ పంచదార వేడితో కలిసి ఉంటే పరమాణ్ణం అని అంటాం. అవే బియ్యం గింజలు రోలు, రోకలితో కలిస్తే ఆకృతి కోల్పోయి పిండిగా మారిపోతాయి. అవే బియ్యం గింజలు పచ్చని పసుపుతో కలిస్తే అక్షింతలుగా మారతాయి. పరమ పావనమైనవిగా పవిత్రమైనవిగా పరిగణింప బడతాయి. పుణ్య స్థానాన్ని అందుకుంటాయి.
దేవుని పటంగానీ విగ్రహంగానీ గదిలో ఉంటే పూజగది అంటాం. పెద్ద ప్రాకా రం లోపల దివ్య మండపం ప్రక్కన గర్భగుడితో కలిస్తే దేవాలయం అంటాం. పెద్ద కొండను ఆనుకుని చిన్నగుహలో ఉంటే తీర్థం అంటాం. మహోన్నతమైన స్థానాన్ని, మ#హత్యాన్ని ఆపాదిస్తాం. అంగరంగ వైభవంగా పూజలు చేస్తాం. భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తాం.
ఓ పురుషుడు ఓ స్త్రీతో ఏడడుగులు నడిస్తే గృహస్థు అంటాం. భవబంధాలు అన్నీ వదులుకుని కాషాయాన్ని ధరిస్తే సన్యాసి అంటాం. అదే మనిషి మహా దైన్యంగా, పరమ దరిద్రంగా నీచత్వంతో కలిసి ఉంటే చవట సన్నాసి అంటాం. అవహళన చేస్తాం. చులకనగా చూస్తాం. అదే పురుషుడు అరణ్యానికి పోయి ముక్కు మూసుకుని కూర్చుంటే ఋషి/ముని అనంటాం. ఆధ్యాత్మిక/ దైవ మార్గంలో అతడు నడిస్తే భక్తుడంటాం. అతని #హృదయంలో దివ్యత్వపు వెలుగులు వెలిగితే, దైవత్వం నిండితే స్వామి అంటాం. అవధూత అంటాం. ఇంకా ఉన్నత స్థాయిన ఉంటే అవతారమూర్తి అని అంటాం. ఆదర్శ మూర్తి అనంటాం.
మనం కలిసి ఉన్న, మనతో కలిసి ఉన్న వారి వలన మన స్థానం మన స్థాయి మారిపోతుంది. ఆ కారణంగా మనకు యోగ్యతా వస్తుంది. యోగమూ కలుగు తుంది. శూన్యం (సున్నా) తనంతతానుగా ఒక్కటే ఉంటే విలువ ఉండదు. సున్నా ఒకటికి ఎడమ పక్కన ఉంటే విలువ లేకుండా ఉండిపోతుంది. అదే సున్నా ఒకటికి కుడివైపున ఉంటే పది అవుతుంది. వంద అవుతుంది. వెయ్యి అవుతుంది. అనంత మవుతుంది. సున్నా అనేది ప్రకృతి. ప్రకృతి పరమాత్మ (ఒకటి)తో ఉండదగిన స్థానంలో ఉంటే పూజింపబడుతుంది. పరమాత్మతో కూడి ఉన్న ప్రకృతి పరమాత్మ తోపాటు పూజలు అందుకుంటుంది. పరమాత్మతో కలిసి ఉంటే ఉత్కృష్టమైన యోగం, అందుకు అవసరమయ్యే యోగ్యత మనకు దక్కుతాయి.
– రమాప్రసాద్‌ ఆదిభట్ల, 93480 06669

Advertisement

తాజా వార్తలు

Advertisement