- సిద్దిపేట నియోజకవర్గ పక్షాన బహుకరణ
- త్వరలో మరో కిలో పసిడి సమర్పిస్తాం :మంత్రి హరీష్‌రావు
యాదగిరిగుట్ట, ప్రభన్యూస్: యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో గురువారంనాడు మంత్రి హరీష్‌రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాదాద్రి పునర్నిర్మాణ పనులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవాలయ పరిసరాలను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం దాదాపు పూర్తయిందన్నారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సిద్దిపేట నియోజక వర్గం నుండి ఒక కిలో బంగారం సమర్పించామన్నారు. మరో కిలో బంగారం కూడా త్వరలో బంగారు తాపడం కోసం సమర్పిస్తామని వెల్లడించారు. ఇప్పటివరకు దాతలు, భక్తుల నుంచి దాదాపు 35 కేజీల బంగారం సమకూరిందన్నారు. ఇంకా మరో 45 కేజీల బంగారం దాతలు, ఇతర భక్తులు ఇస్తామని చెప్పారని తెలిపారు. బంగారు గోపురం తాపడానికి కావాల్సిన బంగారం దాతల నుండి అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రత్యేక శ్రద్ధతో అద్భుతంగా నిర్మాణం చేయించారని చెప్పారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలోనే గొప్ప ఆలయంగా యాదాద్రి ఆలయం విలసిల్లనుందన్నారు. రానున్న రోజుల్లో మంచి పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిలుస్తోందని పేర్కొన్నారు.