Friday, November 22, 2024

ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి శివైక్యం

హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూత

హైదరాబాద్‌ ఆంధ్రప్రభ: శ్రీకాళహస్తి ఆస్థాన జ్యోతిష సిద్ధాంతి, శ్రీశైల పీఠాధిపతి, వీరశైవ పీఠాధిపతి ములుగు రామలింగేశ్వర సిద్ధాంతి కన్నుమూశారు. ఆదివారం సాయంత్రం 5.30 నిమిషాలకు శివైక్యం పొందారని ములుగు డాట్కామ్‌ నిర్వాహకులు, అయన తనయుడు సోమేశ్వర్‌ రావు తెలిపారు. శ్వాసకోస సమస్య ఏర్పడటంతో ఆస్పత్రికి తరలిస్తూండగా మార్గం మధ్యలో నే ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. సోమవారం హైదరాబాద్‌ రేస్‌కోర్స్‌ రోడ్‌ వెనుక స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. దాదాపు 4 దశాబ్దాలకుపై గా జ్యోతిష ఫలితాలు, పంచాంగ శ్రవణం ద్వారా భవిష్యత్తులో జరగబోయే అనేక విషయాలను ప్రజలకు తెలియజేస్తూ, లక్షలాది మందికి మార్గదర్శకం చేసిన ములుగు సిద్ధాంతి గుంటూరు జిల్లాకు చెందినవారు. దశాబ్దాల క్రితం హైదరాబాద్‌ వలసవచ్చి స్థిరనివాసం ఏర్పరుచుకుని జ్యోతిష రంగంలో విశేష ప్రజ్ఞ సాధించారు. వివిధ రంగాల ప్రముఖులు, సామాన్యుల జాతక విశ్లేషణ చేసి వారి సమస్యలకు పరిష్కారాలు తెలిపి ఎన్నో కుటుంబాలకు ఆరాధ్యులైనారు. శ్రీశైలంలో ఆశ్రమం స్థాపించి, వేదాలలో, పూజా, హూమాది క్రతువులలో శిక్షణపొందిన బ్రాహ్మణులతో ప్రతీ మాస శివరాత్రికి పాశుపత హోమాలు నిర్వహించేవారు. అందరికన్న దైవం గొప్పదని, ఆ దైవం మంత్రానికి సంతుష్టుడవుతాడని, హోమాన్ని ప్రీతితో స్వీకరించి ఫలితాన్ని అందిస్తారని చెప్పేవారు. ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంగా ములుగు యూట్యూబ్‌ చానెల్‌లో ఆయన చెప్పే పంచాంగ ఫలితాలు తెలుసుకునేందుకు లక్షలాది మంది వేచి చూసేవారు. లోక కళ్యాణం కోసం, కరోనా మహమ్మారినుండి ప్రపంచా నికి రక్షణ కోసం ఇటీవల యాదగిరిగుట్ట, శ్రీశైలం, శ్రీకాళహస్తిలలో ఆయుష్య హోమాలు నిర్వహించారని ఆయన తనయుడు సోమేశ్వర రావు తెలిపారు. నిష్పాక్షికంగా, హితవు చెప్పినట్టుగా ఆయన జ్యోతిష, జాతక ఫలాలను చెప్పడం, ఆయన చెప్పిన ఫలితాలపై విశ్వాసం పెరగడంతో దేశవిదేశాల్లో ఆయనకు భక్తులున్నారు. ములుగు సిద్ధాంతిగా ఆధ్యాత్మ జీవనాన్ని ప్రారంభించడానికన్నా ముందు రామలింగేశ్వర వర ప్రసాద్‌ పేరుతో మిమిక్రీ కళాకారుడిగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందారు. సినీనటులు ఏవీఎస్‌, బ్రహ్మా నందం వంటి కళాకారులతో వేలాది ప్రదర్శ నలు నిర్వహించారు. ములుగు సిద్ధాంతి ఆశయాలను, ఆయన స్ఫూర్తితో ముందుకు తీసుకెళతామని, ఆయన దివ్య ఆశీస్సులతో ఆయన తలపెట్టిన పనులు తమవంతుగా చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement