ఈసకల చరాచర జగత్తులో ఎనభై లక్షలకు పైగా జీవరాశులున్నాయి. అందులో మానవ జీవితం విశిష్టమైనది, విలక్షణమైనది. సర్వోత్కృ ష్టమైనది. అన్ని జీవరాశుల వలే మానవ జీవితం కూడా అశాశ్వతమైనది. మానవ జీవితం బుద్భుద ప్రాయం. ఆగని కాలచక్ర భ్రమణంలో ఎవరి జీవితం ఎటు పోతుందో, ఎక్కడ ఆగిపోతుందో, ఎప్పుడు అనంత వాయువుల్లో కలిసిపోయి, జీవిత ప్రస్థానం ముగుస్తుందో ఎవరికీ తెలియదు. ఒకప్పుడు నిండు నూరేండ్లు వర్ధిల్లమని దీవించేవారు. ఆయురారోగ్యాలతో జీవించి, తన తదుపరి రెండు మూడు తరాల వారిని చూస్తూ, సంరక్షిస్తూ తరాల మధ్య అంతరాన్ని గమనిస్తూ, ఎన్నో అవరోధా లను అధిగమిస్తూ, ఎన్నో అనుభవాలతో తరతరాలకు విలువైన ఎన్నో పాఠాలను, గుణపాఠాలను జీవిత సారాంశంగా ఒడిసి పట్టుకుని, పరిపూర్ణమైన జీవితం గడిపి, తనతో గడిపి స్నే#హతులు, #హతులు బంధువుల ఆత్మీయ పలకరింపుల మధ్య తనువు చాలించి, పురిటిగడ్డను పునీతం చేస్తూ ”నా” అనే నలుగురి చేతిలో పాడె మోయించుకుని, కట్టె కాటికి చేరి, కట్టె కాలేవరకు, జీవిత ఆఖరి మజిలీ వరకు తనతో ఉండే తన వారిని వదలి ఆత్మ పంచభూతాల్లో కలిసిపోయే వరకు మానవ సంబంధాలు వాస్తవికతను సంతరించుకుని సమాజంతో పెనవేసుకుని, మానవ జన్మకు సార్ధకత చేకూర్చేవి. ఇదీ ఒకప్పటి మానవ జీవిత అంతిమ కథకు ముగింపు అధ్యాయం. తరాలు మారిపోయాయి. తరాల మధ్య అంతరం పెరిగిపోయింది. మానవ అంతరంగాలు, మానవ సంబం ధాలు కూడా నాటక రంగాలుగా రంగు పులుముకుంటున్నాయి. కృత్రిమ శోభను సంతరించుకుంటున్నాయి. జీవితమనే నాటకరంగంలో తెర వెనుక, తెర ముందు పాత్రధారులు, సూత్రధారులు తమ ప్రతిభతో నిజజీవిత సన్నివేశా లను పతాక స్థాయి నటనతో రక్తి కట్టిస్తున్నారు. నిజజీవితంలో కొనసాగుతున్న నేటి తరం నటనా విన్యాసం నభూ తో నభవిష్యతి… అనే విధంగా ఆద్యంతం ఆసక్తికరంగా కొనసాగుతున్నది. నడకలో ఒయ్యారం, నడతలో డొల్ల తనం రంగులద్దుకున్న లోకంలో వాస్తవం అందవికారంగా అగుపిస్తున్నది. మంచి తనం మసకబారిపోతున్నది. మానవత్వపు ఛాయలు ఊసరవెల్లుల వంటి అవకాశ వాదుల దుర్నీతి, దుర్మార్గాల మధ్య మటుమాయమై పోతున్నాయి. చదువులతో పాటు పెంపకాలు కూడా పెడదారి పడుతున్నాయి. దారిచూపిన జీవితాలు దారిలేక అలమటిస్తున్నాయి. చమురు లేని దీపంలా ఆరిపోతున్నాయి. త్యాగాలు వృథాగా మారిపోతున్నాయి. ఒడ్డుకు చేరిన నావలన్నీ మునిగిపోతున్న నావలను చూసి నవ్వుకుంటున్నాయి. రక్షించిన వారినే భక్షించే కర్కశమైన, పాషాణ మనస్తత్వాలు నూతన రూపాలు సంతరించుకుని గతాన్ని మరచి వర్తమానంలో విర్రవీగి #హుంకరిస్తున్నాయి. ఉచిత సలహాలతో ఊరిస్తున్నాయి.
”కాలం మారదు… మనుషులే మారిపోతున్నారు” అనే మాట మనం వింటు న్నాం. కాలం కూడా మానవ వికృత చేష్టలకు ప్రభావితమై మార్పు దిశగా పరుగెడు తున్నది. రుతువులు తమ క్రమాన్ని మార్చుకుంటున్నాయి. అన్ని కాలాలు మానవ జాతిని పోయే కాలం వైపు నడిపిస్తున్నాయి. మనం నేర్పిన విద్యకు మనమే బలైపోతు న్నాం. పెట్టిన చేతిని నరికేయడం, తిన్న నోరే తిరగబడి తిట్టడం, సాయం పొందిన చేతులన్నీ ఏకమై సాయం చేసిన చేతులకు చలనం లేకుండా చేయడం, తలవంచని వ్యక్తి త్వాలను తలదించేటట్టు చేయడం… ఇవీ నేటి మానవ జీవిత వాస్తవ చిత్రకథల్లో కొన్ని సంక్షిప్త సన్నివేశాలు. ఇన్ని పాపకార్యాలతో మానసిక దుర్గంధభరితమై, నిలువెల్లా విషం నింపుకుని వంచనతో మంచిని కాటేస్తున్న ఆధునిక మానవ రూప విషసర్పాల పరిష్వంగంలో ఇక మానవత్వం ఎలా జీవిస్తుంది? మనిషనేవాడు ఎలా మనగలుగు తాడు.? మానసిక రుగ్మతలతో, కుళ్ళిన మస్తిష్కాలతో, మంచీ- చెడు మరచిన ఆధుని కత్వంలో మానవ ఆయు: ప్రమాణం దిగజారిపోయింది. అయినా అందరినీ పొడు చుకు తింటూ, కలకాలం కాకుల్లా బ్రతికేయాలని ఉబలాటపడడం ఎందుకో? ఎవరి కోసమో? ఇవన్నీ సమాధానం తెలిసినా, చెప్పలేని నిస్సహాయత, అ#హం మధ్య మనసును వేధిస్తున్న చిక్కు ప్రశ్నలు.
– సుంకవల్లి సత్తిరాజు, 9704903463
మానవ అంతరంగం… ఒక నాటక రంగం
Advertisement
తాజా వార్తలు
Advertisement