Tuesday, November 26, 2024

మాండుక్యోపనిషత్‌ : జీవా గురుకులం వారి సౌజన్యంతో… (ఆడియోతో…)

ఓం భద్రం కర్ణేభి: శృణుయామ దేవా: భద్రం పశ్యేమాక్షభిర్యజత్రా |
స్థిరైరంగైస్తుష్టువాగ్‌ం సస్తనూభి:| వ్యశేమ దేవహితం యుదాయు: |
స్వస్తి న ఇంద్రో వృద్ధ శ్రవా:| స్వస్తి న: పూషా విశ్వావేదా:|
స్వస్తి నస్తార్‌క్ష్యో అరిష్టనేమి:| స్వస్తి నో బృహస్పతిర్ద ధాతు ||

3వ మంత్రము:

స్వప్నస్థాన: తైజస: ఉకారో ద్వితీయామాత్రా ఉత్కర్షాత్‌
ఉభయత్వాద్వా ఉత్కర్షతి హవై జ్ఞానసంతతిం సమానశ్చ భవతి
నాస్యా బ్రహ్మవిత్‌ కులే భవతి య ఏవం వేద|

కంఠప్రదేశపు నాడీమండలములోనుండు జీవునికి స్వప్నానుభవమును కలుగచేయుచుండెడు తైజస నామాంతరముకల ప్రద్యుమ్నుడు ప్రణవంలోని రెండవవర్ణమైన ఉకారస్వరూపుడుగా పేర్కొనబడుచున్నాడు. ఉకారమునకును, తైజసునికి రెండు విధముల సామ్యము కలదట, (1)ఉత్కర్షమునుబట్టి, ఉభయత్వమునుబట్టి. ఉకారము, అకారమును తనలో లయింపచేసుకొనును కనుక ఉకారమునకు ఉత్కర్షము. అలాగే జాగ్రత్‌ దశలోని జీవునికి ఉన్న దేహాభిమానమును విడిపించి ఆ జీవుని స్వప్నదశలోనికి లాగడం ఉత్కర్షము అందురు. తైజసుడు ఈ పని చేయును కనుక జాగ్రత్‌ దశా నిర్వాహకుడైన వైశ్వానరుడికంటే ఉత్కృష్టుడు. లేదా వైశ్వానరుడు స్థూలపదార్థానుభవమును కలుగజేస్తుంటే తైజసుడు అతని కంటే సూక్ష్మ పదార్థానుభవమును కల్గించుచున్నందువలన ఉత్కృష్టుడని చెప్పవచ్చును. ఇక ఉభయత్వమంటే రెండు పనులు చేయుచున్నట్లు తాత్పర్యము. ఉకారమునకు ఉభయత్వము.

తైజసుడు కూడా రెండు పనులు చేయుచున్నాడు. (1)బాహ్య పదార్థముల జ్ఞానము లేకుండా నిదురించునట్లు చేయుట, (2)ఏకవ్యక్తి మాత్ర అనుభాహ్యవములైన పదార్థముల యొక్క అనుభవాన్ని కల్గించడమనే రెండు పనులు చేయుచున్నాడు కనుక తైజసుడు ఉభయత్వం కలవాడు. ఉభయత్వమంటే మరొక అన్వయం చెప్పుకోవచ్చు. ఇద్దిరిరవలె చేయువాడు అని. ఒకపని వైశ్వానరుడివలె, మరొకటి ప్రాజ్ఞుడివలె చేయువాడు కనుక తైజసుడు ఉభయత్వం కలవాడు అని చెప్పుకోవచ్చు. ఏమిటా పనులు అంటే (1) వైశ్వానరుడు జాగ్రత్‌ దశలో ఏవిధంగా పదార్థజ్ఞానాన్ని కల్గిస్తాడో అదే విధంగా తైజసుడు కూడా స్వప్నదశలోనూ పదార్థజ్ఞానాన్ని కల్గిస్తాడు. అయితే స్వాప్న పదార్థజ్ఞానాన్ని ఇక్కడ ఇద్దరికీ(పోలిక)సామ్యము కేవలము పదార్థముల జ్ఞానాన్ని కల్గించడం వరకే.

- Advertisement -

ఇక రెండవ పని ఆంతర పదార్థజ్ఞానాన్ని అదీ ఆయా వ్యక్తి మాత్రమే అనుభవించగలిగే పదార్థజ్ఞానాన్ని కల్గించడం, ఇక ఏమాత్రం బాహ్యపదార్థములపై దృష్టి లేకుండా చేయడం, ప్రాజ్ఞుడిలాగా చేస్తాడు. ప్రాజ్ఞుడు సుషుప్తి నిర్వాహకుడు కదా! బాహ్మస్మరణ లేకుండా చేసి ఆయా జీవికి తన స్వరూపాన్నే దర్శింపచేస్తాడు. ఈ అనుభవం కూడా ఏకవ్యక్తి మాత్రమే. అలాగే తైజసుడు కూడా బాహ్యస్మరణ లేకుండా చేసి, ఆ వ్యక్తి మాత్రమే అనుభవించగలిగేట్టు పదార్థాలను సృష్టించి స్వాప్నానుభవం కల్గిస్తాడు.

ప్రాజ్ఞ, తైజసులకి సామ్యము బాహ్య విస్మృతి కల్గించడంలోనూ, ఏకవ్యక్తిమాత్ర పదార్థజ్ఞానాన్ని కల్గించడంలోనూ. ఈ విధంగా రెండు పనులు చేస్తాడు కాబట్టి, వైశ్వానర, ప్రాజ్ఞులిద్దరిలా పనిచేస్తాడు. కాబట్టి తైజసునికీ ఉకారమువలె ఉభయత్వము ఉన్నది.

ఇట్లు ఉత్కర్షమునుబట్టికాని, ఉభయత్వాన్నిబట్టికాని ఉకారమును తైజసుడు అనవచ్చును. ఎవరయితే తైజసుని ఇట్టి విశేషములు కలవానినిగా తెలుసుకొనునో, అతడు ధ్యానరూపమై అవిచ్ఛిన్న స్మృతి సంతానమును సంపాదించుకొనగలడు. అంతేకాదు, నిత్యులచేత, ముక్తులచేత కూడా గౌరవించబడుచుండును. అతరి వంశంలో బ్రహ్మవేత్తకానివారే ఉద్భవించ రట. అంటే, అతను బ్రహ్మవేత్తయి, ముక్తుడవడమేకాక, అతని వంశం వారంతా ఆ స్థితిని పొందగలరని ఫలితాన్నీ మంత్రము చెప్తోంది. ఇదీ తైజసుని ప్రభావము.

Advertisement

తాజా వార్తలు

Advertisement