Friday, November 22, 2024

మహిమాన్వితం.. శ్రీకృష్ణుని లీలామృతం

భగవంతుడు చెప్పినది చేయుట మన కర్తవ్యము. ఆయన చేసినది చేయుటకు మనకు అనుమతి లేదు. ఆయనను అనుకరించుట అసాధ్యము. సర్వమునకు అధికారి అత్యంత శక్తిశాలి. విశ్వమంతా వ్యాపించిన పరమాత్మ. పద హారువేలమంది సతులతో ఏకకాలమున శయనించిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వైభవమును, లీలను అవగాహన చేసుకొను జ్ఞానము అల్పులైన మానవులకు లేదు. అనన్యమైన భక్తి ప్రపత్తులలో సర్వశ్య శరణాగతి చేసిన భక్తులకు మాత్రమే ఆ అదృష్టము కలదు. శ్రీకృష్ణుని లీలలు నిగూఢము మరియు మహిమాన్వితము.
పవిత్ర జీవనమునకు మార్గము చూపు శ్రీ మద్భాగవతము నందు లీలామానుష విగ్రహ రూపుడైన శ్రీకృష్ణుని దివ్య చరి తము ఒక అమృతవాహిని. ఎవరికివారు అనుభవించిన గాని ఆ రసామృతము యొక్క రుచి అవగతము కాదు.
సూర్యోదయమునకు ముందుగానే నిదుర నుండి లేచెడి వాడు. బ్రహ్మీముహూర్తమున పారిజాత పుష్పముల మధుర సౌరభమును ఆస్వాదించు నందనవనములోని తుమ్మెదల ఝంకారమును వినుచూ, సువాసనలను ఆఘ్రాణించుచూ మేల్కొనెడి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. వెంటనే తన ముఖము, చేతులు, పాదములు శుద్ధ జలములతో శుభ్రము చేసుకొనెడి వాడు. తదుపరి ఆత్మధ్యానములో మునిగెడివాడు. బ్రహ్మీ ముహూర్తము అత్యంత మంగళప్రదమైనది. కానీ శ్రీకృష్ణుని పట్టమహిషులకు అది అంత ప్రీతివంతమైనది కాదు. వారు శ్రీకృష్ణుని విడిచి నిముషమైననూ ఉండలేకపోవుటయే దానికి కారణము.
ధ్యానము ముగించుకొని స్వచ్ఛమైన, పవిత్రమైన జలము లతో స్నానమాచరించెడివాడు. సచ్ఛిదానంద స్వరూపుడైన ఆయన అత్యంత సుందరమైన దుస్తులను ధరించి సర్వాలంక రణ భూషితుడై నిత్య వైదిక విధులను ఆచరించుటకు బయలు దేరును. యజ్ఞకుండములో హోమము చేయుట, గాయత్రిని మనమునందే జపించుట, సూర్యోదయ సమయమున సూర్యోపాసన చేయుట, గృహస్థుగా పితృదేవతలకు తర్పణ ములు విడుచుట మొదలైన విహిత కర్మలను ఆచరించెడివాడు. తరువాత బ్రాహ్మణులకు గోదానము చేసెడివాడు. ఆ గోదాన ము అత్యంత శోభాయమానముగా నుండెడిది. గోవులన్నీ సువర్ణ, రజిత ఆభరణములతో అలంకృతమై యుండెడివి. గోబ్రాహ్మణ సంక్షేమమే ఆయన అభీష్టము. తదుపరి తన సమ స్త పరివారముతో సుగంధభరితుడై సర్వ దేవతాలయము లను సందర్శించెడివాడు. అప్పటికే ప్రజలు ఆయనకు మధుర ఫలములు, వివిధ పుష్పమాలలు, నానావిధ సుగంధ ద్రవ్య ములు మొదలైనవి రాశులుగా అర్పింపగా వాటిని తిరిగి అంద రికీ పంచెడివాడు.
ఈవిధముగా ఉదయమున కార్యక్రమము ముగించుసరికి రథసారధి దారుకుడు దివ్యరథమును సిద్ధముచేసి అంజలి ఘటించి నిలబడెడివాడు. సాత్యకి, ఉద్ధవుడు తోడు రాగా రథ మునధిరోహించి పురవీధులలో పయనించుటకు వెడలెడి వాడు. అంత:పుర హర్మ్యముల నుండి రాణులు తమ విలాస వంతమైన దృక్కులను సారించగా మందహాసముతో వాటిని ఆస్వాదించెడివాడు. పురవీధుల పర్యటించి తన కొలువు కూట మైన ‘సుధర్మ’మును చేరెడివాడు. శ్రీకృష్ణుని సుధర్మమున ప్రవేశించిన వారికి ఆకలి, దప్పిక, దు:ఖము, మాయ, వార్థక్య ము, మృత్యువు అను ఆరు యాతనల నుండి విముక్తి కలిగెడిది.
సుధర్మమున మహోన్నతమైన సింహాసనముపై ఆసీనుడై దశదిశల ప్రకాశించెడివాడు. నర్తకీమణులు, విదూషకులు, గాయకులు వారివారి ప్రతిభను ప్రదర్శించెడివారు. నిత్యమూ మృదంగము, వీణ, వేణువు, వివిధ తాళములలో శ్రావ్యమైన సంగీతము మంగళప్రదమై మ్రోగుచుండెడిది. వేదపఠనము సమాంతరముగా సాగుచుంచెడిది. నారదాది మహర్షులు సుధర్మమును సందర్శించెడివారు. ముల్లోకములలోని వివిధ విశేషములు, సమస్యలు నివేదించెడివారు.
ధర్మమునకు క్షయమును గూర్చు ప్రయత్నములను నిరో ధించుటకు తగిన కార్యాచరణను అమాత్యులతో గూడి రచిం చెడివాడు. ముఖ్య ఆంతరంగికునిగా ఉద్ధవుడు ఎల్లవేళలా సిద్ధ ముగా నుండెడివాడు.
సాధారణ మానవునివలె ప్రవర్తించుచున్న మాధవుని గురించి ఉద్ధవునకు పూర్తిగా తెలుసును. భూత, భవిష్యత్‌, వర్త మానములకు అతీతుడని, సర్వమూ ఆయన కనుసన్నలయం దు నడయాడునని ఉద్ధవునకు తెలియుట ఒక రహస్యము.
ద్వారక ఒక దివ్య ధామము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఒక సామాన్య గృహస్థుగా ఉండెడివాడు. నిత్య నైమిత్తిక కర్మ లను ఆచరించవలసిన అవసరము లేకున్ననూ తన ప్రజలకు ఆదర్శమైయుండుటకు అన్నియూ నిర్వర్తించెడివాడు.
తన రాజ్య పరిపాలనకు తన శక్తి చాలునని తెలిసిననూ అం దరి సహాయమును, సలహాలను తీసుకొనెడివాడు. అనంత మైన కృష్ణలీలలను తెలుసుకొనుటకు మానవ మేధ సరిపోదు. ధర్మసంస్థాపనే ధ్యేయమైన ఆయన నిర్ణయాలు అమోఘమై నవి, సూక్ష్మమైనవి. ధర్మముననుసరించియే దుష్టశిక్షణ జరిగి నది. శ్రీకృష్ణుని కృపకు పాత్రులైన వారందరూ ఆత్మజ్ఞాన పరా యణులే! ధర్మానుసారులే!
సకల జీవ హృదయాంతర వాసి శ్రీకృష్ణభగవానుడు. పర మాత్మగా తన ఏకత్వమును విశ్వమంతయూ విస్తరించిన వాడు. పరిపూర్ణ ఆధ్యాత్మిక స్వరూపము. రాధాకృష్ణ తత్త్వము ను చైతన్యముగా చూసిన జగద్గురువు. రుక్మిణీమాతతో కలసి ఆదర్శ జీవన మార్గమును అందించిన పరాత్పరుడు. అట్టి శ్రీకృష్ణ భగవానుని దివ్య చరితమున చైతన్యవంతమైన, అను సరణీయమైన జ్ఞానమును గ్రహించి ముక్తి ని పొందుట మన వివేకము.

– వారణాశి వెంకట
సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement