నాసై రోగ హరై సబ పీరా|
జపత నిరంతర హనుమత బీరా||
నిరంతర హనుమ నామ జపము చేత, వీర హనుమ తలచుట చేత వ్యాధులు నశిస్తయ్. సమస్త పీడలు, బాధలు, యాతనలు హరింపబడతయ్. వ్యాధులు శరీర పరమైనవి, మానసిక పరమైనవి. వీటికి రోగమని పేరు. మనసు నామంపై నిమగ్నమైనపుడు రోగాన్ని గురించిన ఆలోచనలు తగ్గి ఉపశమనం కలుగుతుంది.
సమస్త పీడలు కూడా హనుమన్నామ స్మరణ వలన,
తొలగి క్రమంగా నశిస్తయ్.
దు:ఖం కలిగినపుడు స్మరిస్తే దు:ఖం తొలగి,
శాంతి లభిస్తుంది.
సుఖంలో, సంతోషంలో నామస్మరణ చేస్తే దు:ఖమే కలుగదు. కనుక, నామస్మరణ ప్రభావం శాంతిప్రదం.
మనం ఉంటున్న కలియుగంలో అత్యంత ప్రభావమంతమైనది, సులువైనది, అందరూ ఆచరించగలిగినది నామస్మరణ. ఒంటికి, ఇంటికి, మంటికి, మింటికి నామస్మరణ దివ్య ఔషధం. అవని నుండి ఆకాశం వరకు వ్యాపించిన భావ కాలుష్యం నియంత్రింపబడాలంటే నామస్మరణం ఆచరణీయం.
హనుమ నామం ప్రణవోపాసన! రామనామం, ప్రాణాయామం!!
‘రా’ అన్నపుడు పెదవులు తెరుచుకుంటయ్.
‘మ’ అనగానే పెదవులు మూసుకుంటయ్.
ఈ విరామ కాలంలో పూరక, కుంభక, రేచకాలు జరిగి ప్రాణాయామం జరుగుతుంది. దీనివలన నాడీమండల శుద్ధి జరుగుతుంది.
సత్య ధర్మ పరాక్రముడైన రాముడు, ధర్మవీరుడైన సుందర హనుమల నామస్మరణ మహా మహిమాన్వితం.
అది నిత్య స్మరణీయం, రమణీయం, వరణీయం.
– వి.యస్.ఆర్.మూర్తి
9440603499