Saturday, November 23, 2024

మంత్రము యంత్రము తంత్రము

హిందూ ధర్మంలో మంత్రము, యంత్రము, తంత్రములకు ఓ ప్రత్యేక స్థానం వుంది. ఆరోగ్యం, విద్య, ఉద్యోగంలాంటివి పొందాలంటే ఈ మూడింటిని అనుసరించాలని పురాణాలు తెలియజేస్తున్నాయి. ఎందరెందరో అనుసరిస్తున్న మంత్రము, యంత్రము, తంత్రము లంటే ఏమిటి? వాటి వివరణను తెలుసుకుందాం. మంత్రము- జ్ఞాన శక్తికి సంకేతం మంత్రము. ఇచ్ఛాశక్తి చిహ్నము యంత్రము. క్రియా శక్తికి మూలం తంత్రము.
మంత్రము
మంత్రము అనేది అక్షరాలతో కూర్చబడినది. మంత్రము శబ్ద తరంగాల సమూహశక్తి. సంస్కృత భాషలో అన్ని అక్షరాలే. అనగా నశించనివి అని అర్థం. మననంచే సాధింపబడుట చేత ఇది మంత్రమని పిలువబడుతోంది.
త్ర అనేది త్రైధాతువు నుండి వచ్చింది. దీని అర్థం విముక్తి కలిగించుట. త్రాణ అనగా ఇహలోక లేక సంసార బంధాల నుండి విముక్తి. సూక్ష్మంగా రక్షణ అనవచ్చు. దేనిని పఠిం చుట లేక ఉచ్ఛరించటం వల్ల రక్షణ కలుగుతుందో అది మంత్రము. సప్తకోటి మహా మంత్రా లున్నాయి. అందులో వివిధ దేవతలకు, ఉపదేవతలకు సంబంధించినవెన్నో ఉన్నాయి. వాటన్నింటిని అర్థం చేసుకోవడానికి ఈ జన్మచాలదు. అందువల్ల మన కనుగుణమైన మంత్ర శక్తిని మననం చేసుకోవాలి. మంత్రాన్ని మననం చేయటం వల్ల మనసులోవున్న మాలిన్యా లు తొలగుతాయి. మంత్రము ఒకేవిధమైన శబ్ద శక్త స్వరూపము. శబ్దము శూన్యము యొక్క స్వభావము. శబ్దము ఆకాశము గుణము. దీనినే శబ్ద బ్రహ్మ అనికూడా అంటారు. శబ్ద రూపం లో వ్యక్తమయ్యే పరబ్రహ్మము. అందువల్ల శబ్దానికి ఉన్న శక్తిని గ్రహించినప్పుడే మంత్రానికి ఉన్న శక్తి అర్థమౌతుంది. అక్షర శబ్దము, శాశ్వతత్వాలను వేదాలు ఆమోదిస్తున్నాయి.
మంత్రాలు ఏకాక్షరం మొదలుకొని ఒక దేవి లేక దేవత సహస్రనామాల వరకు ఉండ
వచ్చు.ఓంకారాన్ని ఏయే మంత్రాల వెనుక చేర్చాలనే విషయమై కొన్ని నిబంధనలున్నాయి.
యంత్రము
యంత్రము అనే పదము యమ్‌, త్రై అను రెండు ధాతువుకు అర్థము రక్షించుట. యంత్రము కొన్ని శక్తులతో నిక్షిప్తమైనది. యంత్రాన్ని ఆరాధించటం కూడా సాంప్రదాయ సిద్ధంగా పురాతనంగా ఆచారంలో ఉంది. యంత్రాలన్ని రేఖామాత్రంగా ఉంటాయి. వాటిలో బీజాక్షర సహితలు, రహితలని రెండు రకాలు. యంత్రాలలో అక్షరాలకన్నా రేఖలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాల్సి ఉంటుంది. సర్వ యంత్రాల్లో సామాన్య ధర్మమొకటి ఉంటుంది. అదేమిటంటే త్రిభుజాకారం. అన్నింటికంటే ఎక్కువ త్రిభుజాలున్నది. శ్రీ చక్రం. అందుకే సర్వమంత్రాలకు యంత్ర రాజమైంది. ‘యమ్‌’ అనేది వాయుతత్వానికి మూలం. వాయు తత్వముచే ఏర్పడే శక్తి చలన శక్తి, లేక భవిష్యత్తులో పెరుగు శక్తి కావచ్చు. ఇది విశ్వశక్తి లేక ప్రాణం. దేవతా విగ్రహం భౌతికమైన లేక బాహ్యమైన లక్షణాలను సూచించగా యంత్రం దేవత సారాన్ని ప్రతిబింబించే ప్రతీకగా చెప్పబడుచున్నది. సాధారణంగా యంత్రం ద్వారా దేవి దేవతను పూజించుట, విగ్రహం లేక ప్రతిమను పూజించటంకన్నా మిన్నగా పరిగణింపబడుతున్నది. విగ్రహం కన్నా యంత్రానికి ఇచ్చి ప్రాధాన్యత, దేవాలయాలలో విగ్రహారాలను ప్రతిష్టించే టప్పుడు స్పష్టంగా కనబడుతుంది. విగ్రహాన్ని ప్రతిష్టించటానికి ముందు యంత్రాన్ని ఏర్ప రచి, దానిపై విగ్రహం ప్రతిష్టిస్తారు.
తంత్రము
జ్ఞానాన్ని వివరించి, విశదీకరించేది తంత్రము. మంత్ర, యంత్రాలకు సంబంధించిన జ్ఞానము. తంత్రం అంటే పూజించులేక అర్జించు విధానము. ‘తం’ అనగా రక్షించుట తంత్ర మంటే జ్ఞానాన్ని పెంపొందించే శాస్త్రం. తంత్ర స్పర్శ లేని ప్రజాదరణ పొందిన దేవాలయ ప్రతిష్ట లోకంలో ఉండదు. తంత్ర స్పర్శ లేనిది వైదికకర్మ రాణింపు చెందదని వి జ్ఞుల విన్నపం.
పురాణపరంగా జనమేజయుడు సర్పయాగం ద్వారా సర్ప కులాన్నే నాశనం చేయడం, ద్రుపదుడు యజ్ఞం ద్వారా ద్రౌపదిని, దృష్టద్యుముడిని పొందడం, ఉప పాండవ వధకు పూర్వం అశ్వధ్దామ భూతనాధుని సేవించడం, విశ్వామిత్రుని త్రిశంఖు స్వర్గ నిర్మాణం, వేమనగారి హేమ తారక విద్య, ఇంకా అనేక పురాణ సంఘటనలు వైదిక ముసుగులో ఉన్న తాంత్రిక విద్యలే. భాగవత దశమ స్కంధంలో తాంత్రిక విద్యను గూర్చి ప్రస్తావిస్తూ ఉపాయంచేత వైదిక కర్మలను సఫలీకృతం చేయడమని చెప్పబడింది. త్రిగుణాల (సత్త్వ- రజస్‌, తమస్‌) ఆధారంగా తంత్రాలు విభజితమయ్యాయి. ఉదాహరణకు తంత్రంలో బలి ప్రధానమైంది. యజ్ఞయాగాదులలో జంతు బలి కూష్మాండము (గుమ్మడికాయ) కొబ్బరి కాయ, నిమ్మకాయ బలిగా ఇవ్వటం వంటివి.
వేదాలు భగవంతుని ప్రవచనాలైతే తంత్ర శాస్త్రం కూడా భగవద్విలాసమే కదా! అవతార పురుషుడైన శ్రీ కృష్ణుని ఆ యుగంలో చాలామంది తాంత్రికుడని అన్నారు.

– కోసూరు హయగ్రీవరావు
9949514583

Advertisement

తాజా వార్తలు

Advertisement