Saturday, November 23, 2024

భాద్రపద శుక్ల షష్ఠి (ఆడియోతో…)

భాద్రపద మాస కర్తవ్యాల గురించి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…

శుక్లే భాద్రపదే షష్ఠ్యాం స్నానం భాస్కర పూజనమ్‌
ప్రాసనం పంచ గవ్యస్య అశ్వమేధ ఫలాధికమ్‌
యేయం భాద్రపదే మాసి షష్ఠీస్యాత్‌ భరతర్షభ
యోస్యాం పశ్యతి గాంగేయం దక్షిణా పద వాసినామ్‌
బ్రహ్మ హత్యాది పాపైస్తు ముచ్యతే నాత్ర సంశయ:

అని భవిష్య పురాణంలో చెప్పబడింది. భాద్రపద శుక్ల షష్ఠిని సూర్యషష్ఠి అని అందురు. సప్తమితో కూడిన భాద్రపద షష్ఠిని ఆచరించాలని దివోదాసు అను ఋషి చెప్పియున్నారు. ఈనాడు స్నానమాచరించి సూర్యభగవానుడిని పూజించి పంచగవ్య ప్రాసన చేసినచో అశ్వమేధయాగ ఫలము లభించును. భాద్రపద శుక్ల షష్ఠి యందు దక్షిణా పధమున ఉన్న కుమారస్వామిని దర్శించినచో బ్రహ్మహత్యాది పాపములు నశించును.

పంచగవ్యము అనగా గోమూత్రము, గోమయము, గోక్షీరము, గోవు నెయ్యి, గోవు పెరుగుల మిశ్రమము. రెండు చెంచాల గోమూత్రము, రెండు పెసరగింజలంత గోమయము, సగం గ్లాసు గోవు పాలు, పావుగ్లాసు పెరుగు, 5 చెంచాల గోవు నెయ్యి కలుపవలెను. పురోహితులు ఒక్కొక్క దానిని కలిపేటపుడు ఒక్కొక్క మంత్రమును పఠించెదరు.

యత్వగస్థి కృతం పాపం దేహే తిష్ఠతి మామకే
ప్రాసనాత్‌ పంచగవ్యస్య దహత్యగ్ని రివేంధనమ్‌

- Advertisement -

ఈ మంత్రముతో పంచగవ్యమును ప్రాసనం చేయవలెను.

చర్మము, ఎముకలు, నరములతో చేసిన నా శరీరమున ఉన్న పాపము పంచగవ్య ప్రాసనము వలన కాలి బూడిద కావలెను. అగ్ని కట్టెలను కాల్చినట్లు పంచగవ్యము నా పాపమును కాల్చవలయును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement