Friday, November 22, 2024

భాద్రపద శుక్ల చతుర్థి (ఆడియోతో…)

భాద్రపద మాస కర్తవ్యాల గురించి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
భాద్రపద శుద్ధ చతుర్థి ఉదయం తృతీయతో కూడిన ఉన్నది శ్రేష్ఠమైనది. తృతీయతో కూడిన చతుర్థిని మాతృవిద్ధ అని అందురు. తృతీయ గౌరీ తిథి కావున తల్లితో కూడిన కుమారుడు సంతోషంతో వరాలు కురిపిస్తాడు. ఒకవేళ మధ్యాహ్నం వరకు చతుర్థి ఉండి అటు తరువాత పంచమి వచ్చినచో పంచమి నాగ తిథి కావున నాగవిద్ధ చతుర్థిగా వ్యవ హరిస్తారు. గణపతి నాగ యజ్ఞోపవీతుడు కావున నాగవిద్ధ ఆయనకు ప్రియమైనది. భాద్రపద శుక్ల చతుర్థి మాతృవిద్ధ అయినానాగవిద్ధ అయినా ప్రశస్తమే.

ఏకదంతం శూర్పకర్ణం నాగ యజ్ఞోపవీతినం
పాశాంకుశ ధరం దేవమ్‌ ధ్యాయేత్‌ సిద్ధి వినాయకమ్‌

ఒకే దంతం కలవాడు, చాటంత చెవులు కలవాడు, నాగమును యజ్ఞోపవీతంగా చేసుకున్న వాడు, పాశమును మరియు అంకుశమును ధరించిన సిద్ధి వినాయకునిని ఆనాడు ధ్యానించవలెనని స్కాంద పురాణ ఉవాచ.

భాద్ర శుక్ల చతుర్ధీయా భౌమేనార్కేణ వాయుతా
మహతీ సాత్ర విఘ్నేశం అర్చిత్వేష్టం ఫలం లభేత్‌

భాద్రపద శుక్ల చతుర్థి మంగళవారం లేదా ఆదివారం నాడు వస్తే గొప్ప ఫలమును ప్రసాదించునని వరాహ పురాణంలో చెప్పబడింది.

- Advertisement -

సింహాదిత్యే శుక్ల పక్షే చతుర్థ్యాం చంద్ర దర్శనమ్‌
మిధ్యాభి దూషణ ం కుర్యాత్‌ తస్మాత్‌ పశ్యేన్నతం తధా
కన్యాదిత్యే చతుర్థ్యాంతు శుక్లే చంద్రశ్చ దర్శనం
మిధ్యాభి దూషణ ం కుర్యాత్‌ తద్ధోష శాంతయే సింహ:
ప్రసేనమితి వై పఠేత్‌

సూర్యుడు సింహరాశిలో ఉన్నా కన్యారాశిలో ఉన్నా శుక్ల పక్ష చతుర్థి నాడు చంద్రుని చూసినచో అపవాదులు కలుగును. కావున ఈనాడు చంద్ర దర్శనం చేయరాదు.

సింహ: ప్రసేనమవధీత్‌ సింహోజాంబవతాహత:
సుకుమారక మారోదీ: తవహ్యేష స్యమంతక:

ఈ శ్లోకమును పఠించినచో భాద్రపద శుక్ల చతుర్థినాడు చంద్రుడిని చూసిన దోషం తొలగును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement