తువ్హురే భజన రామ కోపావై!
జనమ జనమకే దు:ఖ బిసరావై!!
హనుమను భజిస్తే, భావిస్తే, సేవిస్తే, అనుకరిస్తే రామాను గ్రహం లభిస్తుంది. అంతేకాదు జన్మజన్మలుగా ఏర్పడిన దు:ఖ రాశి మరుగునపడి, మనసును మరిపిస్తుంది. మురిపిస్తుంది. ప్రభు భక్తి, దాస భక్తి, దూత శక్తి, సీతామాతానురక్తి, సేవా భావ నల కలబోత హనుమ. హనుమను భజించటమంటే, ఆయన కథను ముందుగా విని, కథా ఘట్టాలనూ, వాటి వెనుక దాగిన పరమార్థాన్ని మననం చేసుకుంటూ, నిధి ధ్యాసనంలో నిలకడ చెందించటం. ఈ మూడు ప్రక్రియలు అష్టాంగ యోగాలలో ప్రధానమైనవి. హనుమను సేవించటమంటే అన్నివేళలా అన్ని అవస్థలలో ఆయనను స్మరిస్తూ ఉండటం. ఇది భ్రమర కీటక న్యాయ విశేషం. అంటే, అనగా అనగా, వినగా వినగా ఒక పురుగు భ్రమరం కావటం.
ఇది విలక్షణ ముక్తి!
హనుమను అనుసరించటమంటే, తన జాతి లక్షణమైన చంచల మనసును, ఇంద్రియాలను జయించి శమమును సాధించుకున్న స్థితిని మనమూ పొందే ప్రయత్నం. ఇది కఠోర సాధన. హనుమది నిష్కామ సేవ. ఫలి తాన్ని ఆశించి కాక పరమార్థాన్ని పొందే దివ్యరీతి. ఇది అనుకూల సాధన. హనుమ ప్రభు భక్తి నిరుపమైనది. తన ఉనికిని, అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని రామచంద్ర ప్రభు సేవలో లయం చేసి, కేవల దాసభక్తితో విరాజిల్లిన భాగవతోత్తముడు హనుమ. రావణ సభలో హనుమ ప్రదర్శించిన ధీర, వీర, గంభీర స్థాయిలు నరుడికి సైతం సాధ్యంకాదు. శ్రీ రామ దూతగా , హనుమ శ్రీ రామ వైభవాన్ని స్పష్టంగా సభా సదులకు కళ్ళకు కట్టినట్లు వివ రించాడు. సీతమ్మను తల్లిగానే భావించి, ఆమె నుండి దివ్య మాతృ ప్రేమను పరిపూర్ణంగా పొంది, ఆమె అనుగ్రహ పాత్రుడైనాడు.
– వి.యస్.ఆర్.మూర్తి
9440603499