భజ గోవిందం- ఒక మంత్రం కాదు. తంత్రం కాదు. ఇది ఒక రకంగా ఉపదేశ వాక్యం. మరో రకంగా ఆదేశ వాక్యం. మరణం ఆసన్నమయ్యే లోపు ఆత్మ జ్ఞానం పొందమని ఆదేశం. ఈ ఉపదేశాదేశాలను విస్మ రించి ఆత్మజ్ఞానోన్ముఖుడు కానివాడు ఎవడైనా వాడు మూఢుడే. మూర్ఖుడు అంటే తెలియనివాడు. మూఢుడు అంటే తెలిసి కూడా తెలియనివాడు. జ్ఞానం లేనివాడు మూర్ఖుడు. పైపైన జ్ఞానం ఉన్నట్టుగా కనిపిస్తూ, లోన జ్ఞాన శూన్యుడైన వాడు మూఢుడు.
మూఢ మతిని, ముక్త మతిగా ఎలాచేయాలో అద్భు తంగా చెప్పే గొప్ప ఆధ్యాత్మిక గ్రంధం. ”మోహ ముద్గర”. ఆది శంకరాచార్య విరచితాలలో అద్భుతమైన ఆధ్యాత్మిక గ్రంధ రాజములలో అది ప్రముఖమైనది.
”మోహ ముద్గర” అంటే మోహాన్ని నశింపజేసే ఒక బల మైన ఆయుధం అని అర్ధం. ”వివేక చూడామణి”లో ఆదిశంక రులు ”మోక్ష సాధన సామాగ్య్రాం భక్తి రేవ గరీయసీ” అని ప్రవచించారు. మానవుడు మోక్షసాధనకు అనుసరింప దగిన మార్గాల్లో భక్తి గొప్పది అని అర్థం. అద్వైతం జ్ఞాన మార్గం. భక్తి లేని జ్ఞానం వత్తిలేని ప్రమిద. అందువలననే భజగోవింద శ్లోకాల్లో భక్తిని, జ్ఞానాన్ని అద్భుతంగా అందించారు. ”గోభిర్వాక్యేనైవ విద్యతే లభ్యతే ఇతి గోవింద:” అని ఆర్యోక్తి. గో అంటే వేదం. భూమి, ఇంద్రియాలు, అరిషడ్వ ర్గాలు ఇలా ఎన్నో అర్థాలున్నాయి వేదార్థంలో. వేద వాక్యాల చేత మాత్రమే తెలియబడేవాడు. పొందబడేవాడు గోవిందు డు. అంటే బ్రహ్మ పదార్థమే. మృత్యు సమయం ఆసన్నమైనప్పుడు ఈ ”డుకృఞ్ కరణ”మనల్ని రక్షించదు. ”జాతస్య మరణం ధృవం” కదా, అటువంటి ఆపద సమయంలో ఈ భజ గోవిందం. భవ్యమైన దివ్యమైన అమృతత్వం..”
”సంప్రాప్తే సన్నిహితే కాలే..” అవసాన కాలం సమీపిం చుచున్నది. శ్రేయోదాయకమైన జ్ఞానాన్ని పొందకుండా, ఉదర పోషణార్థమైన వాటి గురించి పాటు పడడం మూఢ మతుల సహజ లక్షణం.
ఎప్పుడు జననం జరిగిందో. అప్పుడు మరణం కూడా సగం జరిగిపోయి, మిగతా సగం మాత్రమే ఇప్పుడు జరగ వలసి ఉంది. ఏదో ఒకరోజు అది పూర్తవుతుంది. జీవన ప్రక్రి య- మృత్యు ప్రక్రియ వేరువేరు కాదు. ఉచ్ఛ్వాసం జీవితం- నిశ్వాసం మృత్యువు. వయసు అనేది జీవిత కాలంలో మన కలలను నిజం చేసుకోవడానికి వచ్చిన అవకాశం. కానీ మనిషి వాటన్నింటిని పక్కకు నెట్టి, తుచ్చమైన, అనివార్యమైన కోరికలను వెచ్చించి, అదే జీవితం అనుకుని, బలంగా ఆలోచించి పరిజ్ఞానాన్ని మొత్తం వృధాచేసుకుని మిగిలిన జీవితానికి శూన్యాన్ని మిగు ల్చుకోవడం అనేది తనకు తాను మోసగించుకోవడమే అవు తుంది. ఏ విషయాన్నైనా చెప్పటం తేలిక. కానీ ఆచరించటం కూడా కష్టం. ఆచరణకు పూనుకుంటే ఎన్నో అవాంతరాలు, ఆటంకాలు వస్తాయి. వాటిని అధిగమించడానికి సామాన్యు లకు ఒక్కోసారి సాధ్యం కాకపోవచ్చు.
మోక్షేచ్ఛ. ముముక్షుత్వం ఒకటేనని అనుకుంటారు చాలామంది. కాని కాదు. రెండింటికీ ఎంతో వ్యత్యాసం ఉంది. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అలసి సొలసి నప్పుడు కలిగేది మోక్షేచ్ఛ. పరిణితిలోంచి పుట్టేది ముముక్షు త్వం..!!
మరణ సమయంలో కఫ, వాత, పిత్త, దోషాలకు లోనైతే నామస్మరణకు గొంతు, భగవద్ధ్యానానికి మనసు అనుకూలం గా ఉంటాయో, ఉండవో చెప్పలేము. అప్పుడే స్మరిస్తాలే అని ఇప్పుడు మానకూడదు. ఎందుకైనా మంచిది. ఈ రోజే దేవుని పాదపద్మాలనే పంజరంలో మనసు అనే రాజహంసను ప్రవేశ పెట్టాలనే భక్తాగ్రేసరులు ఎప్పుడూ భావిస్తారు.
మోక్షదాయకమైన స్వస్వరూప జ్ఞాన ప్రబోధానికి, అద్వై తం అని పేరు. అద్వైతం ఎవరో ఒక వ్యక్తి అభిప్రాయం కాదు. ఆలోచన అంతకంటే కాదు. ఆ పరమాత్మ తత్వాన్ని ఉన్న దాన్ని ఉన్నట్టుగా మనకు ప్రకటించే ప్రబోధమే అద్వైతం..!!
”తత్త్వ మసి” మహా వాక్యం ద్వారా ప్రతిపాదింపబడు తున్న ”ఆత్మైక్యం బోధపడనిదే మన బాధలకు నివారణ లేదు. ఈ ”ఆత్మైక్య బోధ”ను జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. ”ఆత్మైక్య బోధ అంటే ”ఈ జీవుడే బ్రహ్మం” అనే జ్ఞానం..!
ఆత్మజ్ఞానం మిక్కిలి సూక్ష్మమైంది. గూఢమైనది. ఎవరై నా తన స్వశక్తితో దాన్ని పొందలేరు. కనుక ఆత్మసాక్షాత్కారం పొందిన గురువు సహాయం మిక్కిలి అవసరం. గొప్ప కృషిచేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దాన్ని మనమే అందించాలి.
జీవితాన్ని సంపూర్ణంగా, సార్థక్యంగా జీవించాలంటే ఏ విద్య కావాలో దాన్ని నేర్చుకోవాలి. మిగతా విద్యలు కూడా అవసరమే. కాని ప్రధానమైన విద్య ఏదో దానికి ప్రాధాన్యత నివ్వాలి. !!
జీవితమే ఒక నిత్య పాఠశాల. ఎన్నో సత్యాలను బోధిస్తుం టుంది. కొన్ని మౌనంగా, మరికొన్ని అనుభవాలూ, అనుభూ తుల పరంగా కొన్ని సంప్రాప్తమవుతాయి. ఏవీ పుట్టుకతో రావు. అభ్యాసంతో అన్నీ వస్తాయి. గిరి గీసుకొని కూర్చుంటే ఎవరూ మన దగ్గరికొచ్చి సలహాలు ఇవ్వరు.
ఏవిధమైన ఆలోచనల్ని చేయకుండా, ఎటువంటి ఆందోళన పడకుండా రోజులో కొంతసేపైనా దృష్టిని బహి: ప్రపంచం నుంచి మరల్చి అంతర్ముఖులు కావాలి. అప్పుడు లక్ష్యం నెరవేరి తప్పక అలౌకిక దివ్యానుభూతిని పొందుతారు. ఏ పరిణామం లేని ఆ దైవానుగ్రహానికి పాత్రులవుతారు. చివరిగా చెప్పేదేమంటే మూఢమతి మూడు లక్షణాలు. ఒకటి ”మోఘాశ” అంటే ఏ ఆశ ఫలించకపోతే దు:ఖాన్ని, ఫలిస్తే నిరాశను కలిగిస్తుంది.
రెండోది ”మోఘ కర్మాణి” అంటే నిజమైన ఉన్నతిని కలి గించని కర్మాచరణ.
మూడోది ”మోఘ జ్ఞానం” అంటే సార్థక్యం కాని, వ్యర్థమైన జ్ఞానం..!!!
– ఎస్ ఆర్ భల్లం
98854 42642
భజ గోవిందం మూఢమతే..!
Advertisement
తాజా వార్తలు
Advertisement