సుఖం అంటే ఆనందం. సంతోషం. కష్టం అనగా బాధ నొప్పి, ఆపదలు కలుగుట. సుఖం వచ్చినప్పుడు అందరూ ఆనందిస్తారు. ఈ విషయంలో కొందరు ఇది తమ గొప్పతనం. ప్రజ్ఞ అను కుంటారు. మరికొందరు దైవానుగ్రహం అనుకుంటారు. కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండేవారు చాలా అరుదుగా ఉంటారు. కష్టాలు వస్తే సహించడం ఎంతో అవసరం. ఈ భావననే భర్తృహరి తన నీతి శతకంలో ఒక పద్యంలో ఇలా తెలిపారు.
సంపదలు గల్గుతఱి మహాజనుల హృదయ
మభినవోత్పల కోమలంబగుచు వెలయు
నాపదలు కల్గునప్పుడు మహా మహీధ
రాశ్మ సంఘాత కర్కశంబయి తనర్చు.
అనగా మహాత్ముల మనస్సు సంపదలు సంభవించినప్పుడు కలువ పూవు కంటె కోమలంగా ఉంటుంది. ఆపదలు వచ్చినపుడు పెద్ద కొండలోని రాతి గుండువలె కఠినంగా ఉంటుంది. సంపదలు కల్గినవేళ సజ్జనులు గర్వించి కఠినులుగా నుండరనియు. ఆపదలు వచ్చినప్పుడు వెల వెల బోరని భావము. అలాంటి మానవులు సుజన జీవితాన్ని గడుపుతూ ఆదర్శప్రాయులౌతారు.
భర్తృహరి సజ్జనుల స్వభావాన్ని వర్ణిస్తూ, ”ఆపదలందు ధైర్య గుణమంచిత సంపదలందు దాల్మియున్” అన్నారు.
ఇంక కలియుగంలో మానవులు అష్టకష్టాలు పడుతూ దు:ఖాల పాలవుతుంటారని, సుఖాలలో మునిగి తేలుతూ బాధలతోనే మరణిస్తుంటారని ప్రాచీ న తెలుగు, సంస్కృత కవులు నేటి తరానికి కనువిప్పు కలిగించే ఎన్నో శ్లోకాలు, పద్యాల ద్వారా వివరించిన తీరు అమోఘం.
అష్టకష్టాలు
ఈ కష్టాలు రకరకాలుగా సంభవిస్తాయి. వ్యావహారికంలో ఈ కష్టాలను అష్టకష్టా లంటారు. ఇవి వరుసగా రుణం అనగా అప్పు, యాచన, వార్ధక్యం, జారత్వం, చోరత్వం, దారిద్య్రం, రోగం ఒకరు తిన గా మిగిలినది తినడం. ఇవే 8 కష్టాలు.
ఋణం యాచ్నాచ వృద్ధత్వం జార చోర దరిద్రతా
రోగశ్చ భుక్త శేషశ్చాప్యష్టకష్టా: ప్రకీర్తితా:
అనిపంచతంత్రలో వ్రాయబ డింది. అవసరాలకు ఇతరుల వద్ద నుండి అప్పుగా తాను కొంత ధనమో, వస్తువులనో తీసి కొని వాడుకొనుట. దీనినే రుణం అంటారు. తీర్చినా తీర్చకపోయినా ఇది రుణమే.
రెండవది యాచన అనగా తనకున్నదంతా పోగొట్టుకుని పరులను దేహీయని అడుగుట యాచన. యాచనచే జీవించుట ఎంతో హేయం. దేశంలో యాచనే వృత్తిగా జీవించేవారు ఎందరో ఉంటారు. మన జీవితాలలో తటస్థపడుతుంటారు.
మూడోది వార్ధక్యం. అనగా ముసలితనం. వ్యక్తి తన కోసం, తన కుటుంబం కోసం పోషణార్థం ఎన్నో కష్టాలు పడి పోషణను కొనసాగిస్తూ వుంటూ వుండగా కాల నియమానుసారం తనకు వయస్సు పెరిగి ముసలితనం వస్తుంది. ఏమీ చేయలేని కుటుంబాన్ని పోషించలేని దుస్థితి కలుగుతుంది. ప్రతీ జీవికి ఈ వార్ధక్యం తప్పదు.
నాలుగవది జారత్వం. దీనినే వ్యభిచారం అంటారు. అగ్ని సాక్షిగా వివాహమైన భార్య ఇంటిలో నుండగా వ్యామోహంతో పరస్త్రీలను ఆశ్రయించి, భోగించి ఉన్నదంతా వదిలించుకుని కష్టాలు పాలౌతుంటారు పురుషులు. ఈ గుణం పలు కష్టాలనూ, నిందలనూ తెచ్చి పెడుతూ ఉంటుంది. సమాజంలో చెడ్డ పేరును కొనితెస్తుంది.
ఇక ఐదోది చోరత్వం. అనగా దొంగతనం. తనకు అవసరమున్నా లేకపోయినా పరుల సొమ్మును వారికి తెలియకుండా తెచ్చి దాచుకోవడం. ప్రాచీనులు తె ల్పిన 64 కళల్లో చోరత్వం కూడా ఒకటి. దీనిని ఒక కళగా చెప్పారు. పలు ఉపాయాలతో పరుల సొమ్మును వారికి తెలియకుండా కాజేయడం, సమాజంలో నిందల పాలవటం, పలు శిక్షలకు గురి అవటం జరుగుతుంది. చోరత్వం మహాపరాధం.
ఆరోది దారిద్య్రం. అనగా దరి ద్రాన్ని అనుభవించడం. తనూ తన కు టుండం అందరూ కష్టాలు పడి సంపా దించుకుని, అనుభవిస్తూ అహంకారం తో ఆడంబరాలకుపోయి ఉన్న ధన మం తా ఖర్చుచేసుకుని చివరకు ఏమి చేయా లో తోచక బాధల ప డుతూ పలురకా లుగా దారిద్య్రం అనుభవించే వారిని నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నా ము. దారిద్య్రంతో బాధలు పడేవారిని దరిద్రులు అంటా రు. సమాజం ఇలాం టి వారిని హీనంగా చూస్తూ ఉంటుంది. దారిద్య్ర బాధ భరింపరానిది.
ఏడోది రోగం. రోగం అనగా జబ్బు. అనారోగ్యం. ఎంత సంపద ఉన్నా మానవుడు అనారోగ్యంతో కొన్ని సమయాలలో కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. ఆరోగ్యం విషయంలో జాగరూకత పాటించకుంటే అవస్థల పాలుకాక తప్పదు. వైద్యులు సకాలంలో వ్యాధి నయం చేయ ప్రయత్నించినా, కొన్ని సమయాల్లో మానవులు కష్టాల పాలవక తప్పదు. శారీరక మానసిక విషయాలు జీవుడిని బాధలు పెట్టినప్పుడు రోగాలు రాక తప్పవు. ప్రతి జీవి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకుంటే ఎంతో మంచిది. రోగాలను కొని తెచ్చుకోరాదు. రకరకాల రోగాలు భయంకరంగా వుండి మానవుని పీడిస్తూ ఉంటాయి.
ఇంక చివరి కష్టం ఒకరు తినగా మిగిలినది తింటూ జీవనం సాగిస్తూ ఉండటం. ఇది ఎంతో దైన్యంతో కూడుకున్నది. హీన జీవనంగా పరిణమిస్తుంది. ఈ అష్ట కష్టాలను ఈతి బాధలు అంటారు.
వీటి నుండి మానవులు విముక్తి పొందాలంటే భవ రోగ వైద్యుడైన భగవంతుని ఆశ్రయించి ఆరాధించి శరణాగతి పొందాలి అని పలు పురాణాలు ప్రవచించాయి.
అయితే ఒక తెలుగు కవి తన చాటు పద్య రత్నాకరంలో కష్టాలు ఎనిమిది కాదు. పదిహేను అని ఒక చక్కని పద్యంలో తెలిపాడు.
చం. గురువుల రాక – దాసి మృతి – గుఱ్ఱపు దాడియు – వాన వె ల్ల్లువలే
పొరుగున నప్పు బాధ – చెవిపోటును- దొమ్మరులాట- ఇంటిలో
వరసతి గర్భ వేదన – వివాహము – విత్తుట- యల్లునల్కయున్
గ ఱవు – దరిద్ర – మాబ్దికము గల్గెనొకప్పుడు కృష్ణ భూవరా
పదిహేను రకా ల కష్టాల ను పేర్కొం టూ ఇవి అన్ని ‘అర్థ’ పురు షార్థానికి సంబంధించినవి అని వర్ణిం చాడు. కలి యుగ మా నవు లం దరూ కూడా వీటి బారిన పడ కుండా తగు జాత్త్రలు పాటి స్తూ, ఆధ్యాత్మిక భావనలతో ఉన్న తులు కావడానికి ప్రయత్నించి తమ జీవితాలను ధన్యం చేసుకుంటూ ముక్తికై ప్రాకులాడాలి. అన్నీ దైవం అందించిన పుడు ఆ దైవాన్ని విస్మరించక నిరం తరం మన కష్టాలను ఆయనకు వివరించి మనశ్శాంతితో హరి స్మరణతో తరించా లి. కష్టాలను ధౖౖెర్యంగా భరించి ఓర్పుతో నేర్పుతో మెలుగతూ ఉంటే ఆ దైవమే కష్టాలను దూరం చేసి గాలి పింజలుగా పోగొట్టి స్వస్థత చేకూరుస్తాడు, ఈ కష్టాలన్నీ దైవదత్తాలని భావించి ఆ దైవాశ్రయంలోనే జీవితాలను సుఖమయం చేసుకోవాలి.
‘తస్మాత్ జాగ్రత జాగ్రత్తా’
పి.వి.సీతారామమూర్తి
94903 86015