Saturday, November 23, 2024

బ్రహ్మాకుమారీస్‌.. దివ్య గుణధారణ పరిపక్వమై స్థితి ఎలా పెంపొందుతుంది (ఆడియోతో…)

ఏ విషయమైన సరే చక్కగా స్పష్టంగా అవగాహన కలిగితే దాని మహిమను గురించి నిశ్చయ బుద్ధి అవుతారు. మనసులో వారికా విషయం గాఢంగా నాటుకొంటే ఇక ఆచరించకుండా ఉండలేరు. ఏదో ఒక జ్ఞాన బిందువు ద్వారా అన్ని సమస్యలు పరిష్కారమగుట చూస్తున్నపుడు దానిని వ్యవహారానికి పరమార్థానికి మేలు కలిగించేదని తప్పకుండా భావిస్తారు. తమ ఆధ్యాత్మిక విద్యకు ఒక మహమాన్వితమైన అంగముగా అంగీకరించుటచే అది మన ధారణగా తయారవుతుంది. అది లేకపోతే మనకు ఉన్నతి లేదని, కళ్యాణం లేదని గ్రహించి ఆచరిస్తాము. అంతకు ముందు మనకు జ్ఞానం ఒక పాయింట్‌ మాత్రంగా ఉండేది. ఇపుడు ఒక సంస్కారముగా సహజ స్వభావంగా మారుతుంది. మన ముందు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని పరీక్షలు దాటుకోవలసి వచ్చినా మనం ఆ శ్రేష్ఠత నుండి తొలగిపోలేము. ఇంతటి పరిపక్వంగా మన బుద్ధిలో పాయింట్‌ ధారణ అవుతుంది. ప్రతి విలువలను ఆచరణలోనికి తీసుకొని వస్తాము. ఆత్మ నిశ్చయంలో ఉపస్థితులమై ఈశ్వరీయ మహా వాక్యాల గురించి ఆలోచనా సాగరమధనం చేస్తూ చేస్తూ ఇదే సర్వ సమస్యలకు ఒకే ఒక పరిష్కారం. ఇదే సుఖ శాంతికి ఏకైక సాదనం. ఇది లేకుండా జీవితానికి కళ్యాణం లేక ఉన్నతి కలుగదు అనే నిష్కర్ష వద్దకు చేరుకొంటారు. ఇపుడు చెప్పండి, ప్రతి పరిస్థితిలో ఈ శ్రేష్ఠత గురించే ఆచరించే ప్రయత్నం చేస్తారు గదా?

ఈవిధంగా మనం దీనిని ఆచరించే తీవ్ర ప్రయత్నంలో మునిగినపుడు మన ఆత్మిక స్థితి కూడా పెంపొందుతుంది. మనస్తితిని పెంపొందించే పురుషార్ధంలో బలాన్నిచ్చే వస్తువే నిశ్చయం. ఒక్క మాట యొక్క మంచిలో ఎంతగా మనకు నిశ్చయముంటే అంతగా మనం దానిని స్వీకరిస్తాము. ఈ ఒక్క మాట ఎంతగా మనం తప్పనిసరి అనుకొంటామో అంతగా పాటించుటకు తీవ్ర పురుషార్ధం చేస్తాము. ఆలోచనా సాగర మధనం తో మన నిశ్చయం కూడా దృఢమవుతుంది. మనం జ్ఞానం యొక్క ఏ రహస్యమును గురించైనా మహాత్వ పూర్వమైన దర్శనం చేసికోగలము. నిస్సందేహముగా మధనం యొక్క ఫల స్వరూపంగా మన ఆధ్యాత్మిక స్థితి కూడా పెంపొందుతుంది. ఉన్నత ఆలోచనల వలన మనం ఉన్నతంగా తప్పక తయారు కాగలము.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement