ప్రస్థాన త్రయమయిన ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రము లు, శ్రీమద్భవద్గీతలు సనాతన ధర్మ సాధనలో అత్యంత ప్రధానమైనవి. వీటిలో బ్రహ్మ సూత్రములు ప్రత్యేకమైనది. సాధకునికి ఏర్పడు అనేక ప్రాథమిక సందేహములకు సంపూ ర్ణముగా నివృత్తి కలిగించునది. సృష్టి, స్థితి, లయ కారకుడైన పరమేశ్వరుడు తన ముఖము నుండి వేదమును సృజించి లోకాలకు అందించాడు. ఈ వేద మును అపౌరుషేయంగా ఋషి పరంపర యుగయుగాలుగా లోకాలకు అందిస్తూ జ్ఞానమయం చేస్తోంది. ప్రతి మహా యుగములోను వేదాలు విభజించబడుతూ వస్తున్నాయి. ఈ ఇరవైఎనిమిదవ మహాయుగములో కృష్ణ ద్వైపాయను వేదమును నాలుగు వేదాలుగా విభజించి వేద వ్యాసుడైనాడు. తదుపరి వేద సారమును సూత్రీకరించి ”బ్రహ్మ సూత్రాలు” మనకందించాడు. బ్రహ్మ సత్యం, జగన్మాధ్య అను సత్య ప్రమాణమును ఈ సూత్రాల ద్వారా నిరూపించాడు. ఈ సకల చరాచర సృష్టిలోని ప్రాణమున్న, లేని సమస్త జీవరాశులు ఆత్మ అనే సూత్రములో ఒక పుష్పమాలగా గ్రుచ్చబడినవి. ఆత్మయను సూత్రము స్థితియను ఆధారంగా జీవాత్మలను భ్రమణము చేయుచున్నది. శ్రీ శంకరులతో సహా మరికొంత మంది ఈ బ్రహ్మ సూత్రములకు భాష్యములు వ్రాసియున్నారు.
మొత్తం ముప్పదిఒకటి సూత్రములలో మొదటి నాలుగు సూత్రములను ‘చతుస్సూత్రి’ అని సంభోధించిరి. ఈ నాలుగు సూత్రములు జిజ్ఞాసువులను బ్రహ్మమును గూర్చి కూలంకషం గా తెలుసుకొనుటకు ప్రేరేపించుచున్నవి. బ్రహ్మ జిజ్ఞాస ఎందు కు కలుగుతోంది? బ్రహ్మ లక్షణాలు ఎలా ఉంటాయి? వేదము నకు కారణం బ్రహ్మమేనా? బ్రహ్మను తెలుసుకోవాలంటే వేదాం త సమన్వయం అవసరమా? మొదలగు సందేహాలకు సమాధా నము వివరించేది ‘చతుస్సూత్రి’.
మొదటిది జిజ్ఞాన సాధికరణము. అందు మొదటి సూత్ర ము ”అథాతో బ్రహ్మ జిజ్ఞాసా”. మానవ జన్మకు గమ్యం మోక్ష మని, జీవాత్మ, పరమాత్మల ఏకత్వంను గ్రహించి అద్వైత మార్గ మున పయనించి మోక్షమును పొందవలెననే జ్ఞాన సముపా ర్జన సాధన చేయుట, దానికి సాధన చతుష్టయములైన నిత్యానిత్య వివేకము, వైరాగ్యం. షట్సంపత్తి, ముముక్షత్వమును లక్షణములుగా చేసు కొని విశ్లేషణ చేయాలి.
ఏది సత్యము? ఏది అసత్యము? అని ప్రశ్నించుకుని బ్రహ్మ మే శాశ్వతమని గ్రహించుట. ఆనందమయమైన బ్ర హ్మము సత్యమని గ్రహించి, ఇహపర లోకములలోని భోగము లను త్యజించి మహా వైరాగ్యములో బ్రహ్మమునకు దగ్గరగుట. ఆ స్థితి నిలుపుకొనుటకు శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ద, సమాధి అను షట్సంపదలను చేపట్టి మోక్షము పొందవలెనని ఆకాంక్షించుట. అదియే జిజ్ఞాస.
వేదములను ప్రమాణికముగా తీసుకుని బ్రహ్మ జిజ్ఞాసతో జన్మరాహిత్యమును పొందుట.
రెండవది జన్మాద్యధికరణము. అందున్న సూత్రము ”జన్మాద్య స్యయత:, జన్మాది అస్యయత:” పరబ్రహ్మము యొక్క లక్షణాలలో ముఖ్యమైనది సృష్టి, స్థితి, లయములను కొనసాగించడం.
కర్మ క్షయమైన, కాని జీవరాశులకు మోక్షమును ప్రసాదిం చుటకు సృష్టి పరిక్రమము ఒక లక్షణమై యుండుట. సృష్టి ఆదిలో నున్న బ్రహ్మము, లయమైన తరువాత నున్న బ్రహ్మము ఒక్కటియే! అదియే ఆత్మ! సృష్టి బ్రహ్మము యొక్క లక్షణము. నిరుక్తములో తెలిపినట్లు
”జాయతే స్తివి పరిణమతే వర్ధతే వినశ్యతి”
పుట్టి స్థితి కల్గి పరిణామం చెంది పెరుగుతూ క్షీణించి చివర కు నశించుటయే సృష్టి స్థితి లయము. దీనికి కారణము పర మాత్మ అయిన పరబ్రహ్మ. మూడవది శాస్త్ర యోనిత్వాధికరణము. సూత్రము ”శాస్త్ర యోనిత్వాత్”. వేదాలు బ్రహ్మము నుండి వెలువడినాయి. కావు న బ్రహ్మమే సర్వజ్ఞము. బ్రహ్మమే ప్రమాణికం. దాని నుండియే సనాతన వాఙ్మయం సృజించబడింది. అవి చతుర్వేదాలు. అష్టాదశ పురాణాలు, ధర్మశాస్త్రము, కల్పము, వ్యాకరణము, నిరుక్తము, చందస్సు, జ్యోతిష్యము. అందువల్ల వాటియందు గల బ్రహ్మమనే సర్వజ్ఞతను శిరసా వహించి ఆత్మ సాక్షాత్కారమును పొంద వలెను. నాల్గవది సమన్వయాధికరణము. అందుగల సూత్రము ”తత్తు సమన్వయాత్. తత్, తు, సమన్వయాత్”.
ఈ సర్వజ్ఞతామయమయిన శాస్త్రములను సమన్వయము చేసుకొనిన గాని ప్రామాణకత్వమును తెలుసుకోలేము. ”సత్యం జ్ఞాన మనన్తం బ్రహ్మ” సముద్రపు నీటిలోని లవణము కంటికి కనపడదు. స్వర్ణముతో చేసిన ఆభరణాలు అనేక రూపాలలో ఉన్ననూ వాటి మూల లోహము స్వర్ణమైనట్లు సత్యము, జ్ఞాన ము, అనంతమైన బ్రహ్మను తెలుసుకొనవలెనన్న శాస్త్ర ముల సమన్వయము అవశ్యం. వేదము కర్మ, బ్రహ్మ రెండింటి గురిం చి తెలియజేసింది. కాని అంతిమముగా బ్రహ్మమే సత్యమని నిర్వచించినది. కావున శాస్త్ర సమన్వయముతో బ్రహ్మ సత్యము అని గ్రహించవలెను.
ఈవిధముగా బ్రహ్మసూత్రములలోని చతుస్సూత్రి జిజ్ఞా సువును ప్రేరేపిస్తుంది. ముముక్షత్వమునకు దగ్గర చేస్తుంది.
మిగిలిన ఏడు అధికరణములలో గల ఇరువది ఏడు సూత్ర ములు ఆత్మ స్వరూపమైన బ్రహ్మమే చైతన్యమని, అదియే సత్యమని ధృవీకరిస్తాయి.
”బ్రహ్మవిద్ బ్రహ్మవభవతి” బ్రహ్మను తెలుసుకొన్నవాడు కూడా బ్రహ్మమేనని శ్రీ వ్యాసభగవానుడు బ్రహ్మ సూత్రముల ద్వారా మనకందించి బ్రహ్మములో ఐక్యమగుటకు ప్రేరణ కలిగించి, పరమ సత్యమును ఆవిష్కరించి మనకు
అందించి నాడు.
– వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269
బ్రహ్మసూత్ర భాష్యం చతుస్సూత్రి
Advertisement
తాజా వార్తలు
Advertisement