Saturday, November 23, 2024

బ్రహ్మకుమారీస్‌.. కేవలం నేను ఒక్కడినే కాదు ఇంకా చాలామంది కూడా ఉన్నారు (ఆడియోతో..)

”నిర్లక్ష్య పరులు నేను ఒక్కడినేనా? ఇలా చాలా మంది వున్నారు. వాళ్ళకేమవుతుందో అదే నాకు కూడా అవుతుంది. ఇపుడు అందరి స్థితిగతులు చూస్తుంటే ఇంకా పురుషార్థం కోసం కొంచెం సమయం ఉందనిపిస్తుంది” అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి ఆలోచనలతో మానవులు తమ బాధ్యతలను తేలిక పరుచుకుంటారు. నిర్లక్ష్యం యొక్క భావార్థం వాస్తవానికి బాధ్యతలను అర్థం చేసుకొనక పోవుటయే. ఏదైన ఈశ్వరీయ సేవ సమర్పించినపుడు నా పైననే ఈ కార్యం ఎందుకు పెట్టారు? అంటాడు. కానీ అతడు ”వీళ్ళు నేనే ఈ పని పూర్తి చేయగలరని ఆశించారు” అని ఆలోచించడు దీనితోటే నా భాగ్యోన్నతి కలుగుతుంది అనుకోడు. మాయా సంకల్పాలతో తన బుద్ధిని పాడుచేసుకొంటాడు. భాగ్యమును చెడగొట్టుకొంటాడు. అతడు సోమరితనంతో సంకల్పాన్ని గ్రహించలేక లభించిన భాగ్యాన్ని జార విడుస్తాడు.

ఈ విధంగా ఈశ్వరీయ సేవ పోగొట్టుకొంటాడు. కానీ ఎనిమిది గంటల స్మృతియాత్ర చేయమనిలేక అవ్యక్తస్థితిలో ఉండమని శివబాబా ఆదేశం’ నా కోసమే అని ఆలోచించడు. ఇతరులు దానిని పాటిస్తున్నారా? లేదా? అనేది, ఈ విషయాలు గమనించుట నా పని కాదు. నేను ఇతరులను ఎందుకు కాపీ చేయాలి? నేనెందుకు ఈ ఆజ్ఞా పాలన చేసి చూపించరాదు? ఇతరులు నన్ను చూచి గుణాలు గ్రహించరాదా? అని ఇలా చక్కగా ఆలోచిస్తే తన నిర్లక్ష్యం, సోమరితనం సంస్కారమును తొలగించుకొని చాలా ఉన్నతి పొందగలడు.

ఇదేవిధంగా ఈశ్వరీయ సేవ విషయంలో ‘సరే వీళ్ళు చేస్తున్నారు గదా చేయనీ నా పైన ఏమైన బాధ్యత వుందా. వీళ్లు నా సలహా తీసికొన్నార? నాకు చెప్పారా?”అని ఆలోచించరాదు. ఎవరైన చెప్పితేనే చేసేవారికి సగం ఫలం లభిస్తుంది. మిగతా సగం చెప్పిన వారికి లభిస్తుందని మనం గ్రహించాలి. ఇంతే కాకుండ ఇందులో ఎవరో చెప్పాల్సిందేముంది? ”చేసుకొన్నవారికి చేసుకొన్నంత” సామెత తెలుసు గదా! చేయండి అనే ఆహ్వానం అందరికీ వుంది . అవును పెద్దలకు గౌరవాన్నిచ్చి వారి అనుమతితో చేయాలి. కానీ ‘వీళ్ళు చేస్తున్న దానితో నేను సంతృప్తిగానే వున్నాను” అనుట మనలోని కోపాన్ని ప్రకటిస్తుంది. కోపం రావడం, అలగడం అంటే మన భాగ్యంతోనే అలుగుట వంటిది ప్రతి ఒక్కరూ తమ భాగ్యం తయారు చేసుకొనే ఆలోచన చేయాలి. దానికోసం ఛాన్సు తీసికొనాలి. అంతేగాని అలిగి ఒక మూలకు కూర్చొనాలా? లేక ఇతరుల స్వభావాలతో సంఘర్షణ పడి సోమరితనం, మరియు నిర్లక్ష్యం యొక్క హారాలు మెడలో వేసికోవాలా? ఆలోచించండి.

బ్రహ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement