Tuesday, November 26, 2024

ప్రారబ్ధము.. జన్మ కారణము

ఆత్మ అనగా ఏమిటి?

అనే చింతన మనసున చిగురించటమే ఆత్మచింతన. ఆత్మశోధన లో నిమగ్నుడై వున్న జీవుడికి లౌకిక పదార్థాలపై దృష్టి మరలుతూ వుంటుంది. ఈ పదార్థాల వలన ఫల భోగము కలగటం సహజము. దీనికి కారణము ప్రారబ్ధమని శ్రీ ఆదిశంకరులు తెలియజేసిరి. ఈ ప్రారబ్దము ఆత్మ సాక్షాత్కారానికి అనేక ఆటంకాలు కలుగజేస్తుం టుంది.
సనాతనము కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా విశ్వసించింది. మానసికముగాను, శారీరకముగాను కర్మలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇవి ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలు. ఈ జన్మలో చేసిన కర్మ ఫలితాలే ఆగామి. వీటి ఫలం ఈ జన్మలోనే అనుభవించాలి. కర్మ యొక్క ప్రతి రూపమే జీవుడు. ఇవి నిరంతరం గమనము కలిగి ఉంటాయి. సకర్మ, దుష్కర్మ ఏదైనా ఫలితం అనుభవించక తప్పదు. ఇక సంచిత కర్మలు ఇవి చక్రవడ్డీ లాంటివి. ఈ జన్మకు కారకులైన మాతాపితరులు చేసిన కర్మలు ఏవైనా వారు అనుభవింపగా మిగి లిన భాగము సంచితముగా జీవునకు సంక్రమిస్తుంది. కనుక ఆగామి కర్మల శేషము సంతానానికి ప్రాప్తిస్తుంది. లౌకిక దృష్టిలో చూస్తే తండ్రి చేసిన రుణానికి సంతానం బాధ్యత వహించాలి. ప్రారబ్ధ కర్మ పూర్వ జన్మలో జీవుడు స్వయంగా చేసుకున్న పాప పుణ్య కర్మ. ఆగామిగా చేసుకున్న కర్మల శేషము. దీని ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సిందే. ఈ ప్రారబ్ధమును అనుభవించుటకు అనేక జన్మలు ఎత్తవలసినదే! దేహాత్మ భావన వీడనంత వరకు ఈ ప్రారబ్ధము జీవుని వీడదు.
”ప్రారబ్ధం బలవత్తరం ఖలువిదాం భోగేన తస్యక్షయ:
సమ్యగ్‌ జ్ఞాన హుతాశనేన విలయ: ప్రాక్సంచితాగామినామ్‌
బ్రహ్మ త్మైక్యమవేక్ష్య తన్మయ తయాయే సర్వదా సంస్థితా
స్తేషాం తత్త్రితయం నహి క్వచిదపి బ్రహ్మైవతే నిర్గుణమ్‌”
పండితుని ప్రారబ్ధము జ్ఞానము చేత బలమైనదిగా వుంటుంది. అనుభవిస్తేనే గాని క్షయమును పొందదు. సంచితములైనవి. ఆగామిగా వచ్చు కర్మలు తత్వ జ్ఞానాగ్నిచే హుతము గావింప బడును. ఎవరైతే దేహాత్మ భావన వీడి బ్రహ్మము. ఆత్మ ఒకటే అని తెలుసుకుంటారో వారికి ఆగామి, సంచితము, ప్రారబ్ధాలతో పనిలేదు. అవి వారికి శూన్యం అవుతాయి. అలాంటి వారు నిర్గుణ పరబ్రహ్మము అని భావించ వచ్చు. శరీరము కర్మల చేత నిర్మితమైంది. అందువలన ప్రారబ్ధము కూడా శరీరానికే చెందుతుంది. దీనికి ఆత్మకు ఎటువంటి సంబంధం లేదు. ఆత్మ కర్మ నిర్మితం కాదు.
స్వప్నంలో చేసిన పాపాలుగాని, పుణ్యాలుగాని మేల్కొన్న తర్వాత స్వర్గ ప్రాప్తికి గాని, నరక ప్రాప్తికి గాని ఎలా కారణం కాదో, అలాగే ప్రారబ్ధానికి, ఆత్మకు ఎటువంటి సంబంధంలేదు. ఆత్మ జన్మరహిత మైనది. అది నిత్యమైనది. ఆత్మ అనాదియైనది. శ్రీ శంకరుల ప్రారబ్ద విశ్లేషణను పరికించిన బ్రహ్మాత్మ భావనతో కర్మల నాచరించిన వాటి ఫలితముగాని, స్థితిగాని స్వప్నములో చూసిన, చేసిన కర్మలకు ఎటువంటి సంబంధం వుంటుందో అటు వంటిదే అవుతుందని తెలుసుకోవచ్చు. అది ఒక భ్రాంతి అని తెలుసుకొని మేల్కొనిన తరువాత జీవుడికి ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే జ్ఞానం వలన ఈ స్థూల దేహం ఒక భ్రాంతియని జీవుడు తెలుసుకుంటాడు. అయినా కూడా ప్రారబ్ధము వలన కలిగిన ఈ జన్మయందు ఏది సత్యము? ఏది నిత్యము అనేది తెలుసుకోవడం జీవుని వివేకము.

”జంతునాం నరజన్మ దుర్లభమత: పుంస్త్వం తతోవిప్రతౌ
తస్మా ద్వైదిక ధర్మ మార్గ పరతా విద్వత్వమస్మాత్పరమ్‌,
ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి:
ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై: పుణ్యౖర్వినా లభ్యతే.”
ప్రారబ్ధ క్షయానికి జీవుడికి మానవ జన్మ ప్రాప్తించుట దుర్లభము. అందునా పురుషుడగుట, దానికంటె బ్రహ్మజ్ఞాని యగుట, వైదిక ధర్మము నాచరించుట, విద్వత్తు గల విద్య కలవాడైయుండుట, ఆత్మానాత్మ వివేకము కలిగివుండుట, చక్కని అనుభవంతో బ్రహ్మా త్మ భావన పొందివుండుట అనేవి నూరుకోట్ల జన్మలలో చేసుకొన్న శుభ కర్మల పరిపక్వ దశ వలన గాని లభ్యంకావు. అటువంటి మానవ జన్మ లభించుట ఒక మహత్తర అవకాశము. అందువలన జీవుడు స్వార్ధ ప్రవృత్తికి లోబడి దుర్వినియోగము చేసుకుంటే జనన మరణ చక్రములో పడి కొట్టుకొనే మూఢుడుగా మిగిలిపోతాడు.
ముఖ్యంగా సకల విద్యలను అభ్యసించి కూడా ధనాపేక్షతో అమృ తత్వాన్ని చూడలేకపోవటం దురదృష్టకరం.
సర్వానికి అతీతమైన బ్రహ్మాన్ని సత్యంగా తెలుసుకొనే అవకాశా న్ని ఎవరూ కోల్పోకూడదని ఆశిద్దాం.

– వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు
8074666269

Advertisement

తాజా వార్తలు

Advertisement