భారతీయ సంస్కృతిలో గురువు స్థానం చాలా గొప్పది. అందుకే ఆయన్ని త్రిమూర్తుల స్వరూపమని, ఆయన బోధనలు పరానికి చేరడానికి గొప్ప సాధనలని చెబుతారు. అందుకే గురువు బోధనలను జీవితంలో పాటించిన శిష్యులెందరో చరిత్ర పుటల కెక్కి నేటికీ కీర్తింపబడుతున్నారు. పాటించనివారు చరిత్ర హీనులుగా మిగిలి దూషింపబడుతున్నారు.
గురువు బోధనల గురించి తులసీదాసు ఒక వ్యక్తిత్వ వికాస నిపుణునిగా చెప్పిన పద్యం-
”సహజ్ సుహృద్ గురు స్వామి
సిఖ్ జో న కరయి సిర్ మాని
సో పఛితాయి అఘాయి ఉర్
అవసీ హోయి హిత్ హాని”
దీని అర్థమేమిటంటే ”గురువు బోధనలను జీవితానికి అన్వ యింపజేసుకొని ఆచరణలో పెట్టిన శిష్యుడు అన్నింట సుఖపడతా డు. అలా చేయనివాడు జీవితంలో ఏదీ సాధించక పోవడమేగాక తన జీవితం చివరి దశలో పశ్చాత్తాపం పడ తప్పదు.” అని.
వ్యక్తి, తను నేర్చుకున్న మంచి విషయాలను నిత్య జీవితంలో పాటించి సుఖశాంతులు పొందాలన్నదే తులసీదాసు పద్యంలోని అంతరార్థం.
”వేదశాస్త్రాలు చదవడం ముఖ్యం కాదు. వాటిలోని సారాన్ని జీవితంలో ఆచరించడం ముఖ్యం” అంటూ ప్రవచనకారులు ఓ చక్కని కథ చెబుతారు.
”ఒక ఊర్లో ఒక పండితుడు, భగవద్గీత పఠనం వల్ల కలిగే లాభాల కోసం క్రమం తప్పకుండా రోజూ నియమనిష్ఠంతో అధ్య యనం చేస్తూ కాలం గడిపేవాడు.
అదే ఊర్లో ఒక నిరుపేద రోజూ అడివికెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చే వాడు. అందుబాటు ధరకు అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకొనే వాడు. కొంతకాలం తరువాత పండితుడు, నిరుపేద పైబడిన వయస్సుతో మరణిస్తారు.
దేవదూతలు పేదవాణ్ని స్వర్గానికి తీసుకెళ్తుండగా గమనిం చిన ఆ పండితుడు ”ఇదేమిటి… నేను నియమనిష్ఠంతో భగవద్గీత ను చదివాను. నన్ను మోక్షానికి తీసుకెళ్లకుండా వేదపురాణాలు అంటే ఏమిటో బొత్తిగా తెలియనివాడిని స్వర్గానికి తీసుకెళ్తున్నారు. నా నియమనిష్ఠలు, పవిత్ర గ్రంథాల పఠనం మోక్షం పొందడానికి యోగ్యం కావా?” అని ప్రశ్నిస్తాడు.
సమాధానంగా దేవదూతలు ”నువ్వు కేవలం భగవద్గీతను పఠించావు. కానీ పఠించిన వాటిని జీవితంలో అన్వయించుకొని ఆచరించక నియమ నిష్ఠల మీదే ధ్యాస ఉంచావు. ఆ నిరుపేద అక్షర జ్ఞానం లేనివాడైనా, నియమ నిష్ఠలంటే ఏమిటో తెలియకపోయినా చేసే పనిలో పవిత్రత చూపాడు. ఏ ఆరాటం లేక సంపాదించిన దాం తో కుటుంబాన్ని పోషించుకుంటూ సంతృప్తిగా జీవించ ప్రయ త్నించాడు. కేవలం పఠించే నీకంటే, తెలిసిన వాటిని పాటించాడు కాబట్టే అతన్ని స్వర్గానికి తీసికెళ్తున్నాం” అని చెబుతారు. అందుకే పఠించడం కాదు… పాటించడం ముఖ్యం అన్నది కథలోని సారం.
ఇదే విషయాన్ని శ్రీ సత్యసాయిబాబా ”పుస్తకాలు చదివి మస్త కాల్లో నింపుకున్న జ్ఞానాన్ని ఆచరణలో చూపగలిగినవాడే నిజమై న చదువరి” అంటారు.
తాను స్వయంగా నిరక్షరాస్యుడై కేవలం సత్సంగాల ద్వారా ఇహ పర విషయాలను మనస్సుకెక్కించుకున్న మహాత్మా కబీరు ”పెద్ద-పెద్ద గ్రంథాలు చదివి తనను తాను గొప్పదైన పండితునిగా ప్రదర్శించుకునే ఆయన, ప్రేమ, ఆప్యాయతల వంటి మానవ విలు వలను తెలుసుకోలేని అతని పాండిత్యం పనికిరానిదే కదా” అంటా డు. అంటే చదువు సంస్కారాలు నేర్పాలి అనేది కబీరుదాసు చెప్పిన మాటల్లోని అంతరార్థం.
తత్త్వవేత్త, ఆర్థికవేత్త, వ్యక్తిత్వ నిర్మాత, గొప్ప రాజనీతిజ్ఞుడైన చాణక్యుడు ”ఆచరణ లేని అభ్యసనం ఆడంబరాలను ప్రదర్శిస్తుం ది. అనేక విద్యలు నేర్చుకున్నంత మాత్రాన విద్యావేత్త కాజా లడు. అభ్యసించిన విషయాలను జీవితంలో సంభవించే ప్రతి సంఘటన కు సానుకూలంగా స్పందించేవాడే విద్యావేత్త” అంటాడు.
నేటి యువత, ఇంతగా నిరాశనిస్పృహలకు లోను కావడానికి కారణం… చదివే చదువులను జీవితానికి అన్వయించక పోవడమే అంటున్నారు అనుభవజ్ఞులు. ప్రతి చిన్న విషయానికి బెంబేలెత్తి పోయేవారు తమకు అర్హత లిప్పించే చదువులతోపాటు మన పురాణతిహాసాలు చదివి వాటి సారాన్ని జీవితంలో ఆచరించ గలిగితే ఎదురయ్యే సమస్యల్ని సునాయాసంగా పరిష్కరించు కోగలరు.
మహాత్మా తులసీదాసు ”పెద్దలు చెప్పిన మంచి విషయాలు, గురువులు బోధించిన బోధనలు, నిజ జీవితంలో ఆచరించగలిగితే సుఖసంతోషాలు ప్రాప్తిస్తాయి” అంటాడు.
రావణాసురునికి వేదవేదాంగాలు నేర్పింది ఆయన తండ్రి విశ్రవసు బ్రహ్మ. అందుకే రావణునికి గురువు విశ్రవసు బ్రహ్మ అం టారు. రావణుడు నేర్చుకున్న విద్యలను జీవితంలో ఆచరించక పోవడం వల్లే దుష్టబుద్ధిగలవానిగా సీతను అపహరించి ప్రాణాలు పణంగా పెట్టాడు. దుర్యోధనుడు తన తాత భీష్ముని మాటలను గౌరవించక గురువు ద్రోణుని బోధనలు పెడచెవిన పెట్టడంవల్ల అర్థాంతరంగా జీవితాన్ని చాలించవలసి వస్తుంది. అందుకే గురువు బోధనలు జీవితానికి అన్వయించి ఆచరించాలి. పఠించిన గ్రంథాల సారాన్ని ప్రతి వ్యక్తి జీవితంలో పాటించాలి.
– పరికి పండ్ల సారంగపాణి
98496 30290