Friday, November 22, 2024

నేడు సిరిమాను సంబరం

పైడితల్లమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి… సాంప్రదాయబద్ధంగా తొలేళ్ల ఉత్సవం

విజయనగరం, ప్రభ న్యూస్‌ : ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఇల వేల్పుపైడితల్లమ్మ జాతరలో భాగమైన తొలేళ్ల ఉత్సవం సోమవారం సాంప్రదా యబద్ధంగా నిర్వహించారు. మంగళ వారంనాడు సిరిమాను సంబరానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా సాగిన ఈ ఉత్సవం ఆద్యంతం భక్తిపారవశ్యంతో తొణికిసలాడింది. ఆనవాయితీ ప్రకారం అమ్మవారి ఘటాలను ఆలయం నుంచి కోటకు ఊరేగింపుగా తీసుకొని వెళ్లి, అక్కడ వుంచారు. ఆపైన రైతులకు విత్తనాలు అందజేసి పంటలు బాగా పండాలని ఎప్పటిలాగానే పూజలు నిర్వహించారు. శ్రీపైడితల్లమ్మ దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌ గజపతిరాజు కుటుంబ సభ్యులతో సహా కోటలోని దుర్గమ్మ గుడి నుంచి పట్టు వస్త్రాలు, పసుపు-కుంకుమలను ఊరేగింపు నడుమ తీసుకువచ్చి ఆలయంలోని అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అశోక్‌ గజపతిరాజు ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు మెండుగా వుండాలని, అంతా సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ఆపైన జిల్లా కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి పైడితల్లమ్మను దర్శించుకొని పూజలు నిర్వహించారు. తొలేళ్లు కార్యక్రమంలో భాగంగా ఘటాల ఊరేగింపు, సాముగారడీల ప్రదర్శన వంటివి ఆనవాయితీ ప్రకారం జరిగాయి. కాగా, ఉచిత దర్శనాలపై స్పష్టతనివ్వడంలో అధికార యంత్రాంగం సరిగా వ్యవహరించలేదు. దీంతో తొలేళ్ల రోజున అమ్మవారిని దర్శించుకున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.అదలా వుంచితే మంగళవారం జరగనున్న సిరిమాను సంబరానికి భక్త జనులు భారీగా తరలి వచ్చేందుకు ఆస్కారం లేకుండా కోవిడ్‌ నిబంధనలకు లోబడి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement