శ్రీరాముడు చైత్ర శుద్ద పంచమినాడు, పద్నాలుగేండ్ల వనవాసాన్ని ముగించుకుని భరద్వాజాశ్రమం చేరాడు. అందరూ భరద్వాజ మహర్షికి నమస్కరించారు. శ్రీరాముడు, భరత శత్రుఘ్నుల , ముగ్గురు తల్లుల అయోధ్యా నగర ప్రజల క్షేమ సమాచారాలను భరద్వాజుని అడిగి తెలుసుకున్నాడు. భరద్వాజుడు రాముని ఘన కార్యాలను అభినందించి ప్రశసించాడు. ఈ రోజు నా ఆతిథ్యాన్ని స్వీకరించి, రేపు అయోధ్యకు వెళ్ళ వచ్చునన్నాడు. శ్రీరాముడు సమ్మతించి, భరద్వాజుని ఇలా ప్రార్థించాడు. మహాత్మ ఇక్కడి నుండి అయోధ్య వరకు మేము ప్రయాణించిన ప్రాంతమంతా ఎల్లవేళలా పుష్ప ఫల భరిత వృక్షాలతో ఉండునట్లు వరం ప్రసాదింపుము అన్నాడు. భరద్వాజుడు అనుగ్రహించాడు. భరద్వాజ ఆశ్రమం నుండి మూడు యోజనాల ప్రాంతం పుష్ప ఫల భరిత వృక్షాలతో విరాజిల్లింది.
శ్రీరాముడు హనుమంతుని చూసి ఆంజనేయా! మొదట శృంగి బేరపుర పాలకుడు, నా మిత్రుడైన గుహునకు నా ఆగమన వార్తను తెలుపుము. అతని కుశలమడుగుము. అతడు అయోధ్యకు, భరతుడు నివసించు ప్రాంతానికి దారి తెలుపగలడు. నీవు భరతుని వద్దకు చేరి, నేను వస్తున్నాను అనే వార్త తెలుపుము. రావణుడు సీతను అపహరించినది మొదలుకుని ఇంతవరకు జరిగినదంతయూ భరతునకు తెలుపుము. ఆంజనేయా! మరొక్క మాట! భరతుని మనసు తెలుసుకొనుము. అతని మాట తీరును, వర్తనాన్ని నిశితంగా పరిశీలింపుము. అతడు రాజ్యాధికారాన్ని ఆశిస్తున్నాడో లేదో తెలుసుకొనుము. అతడు రాజ్యాధి కారాన్ని ఆశిస్తున్నట్లయితే నేను తాపన జీవనాన్ని ఆశ్రయిస్తాను. మేము అక్కడికి చేరకముందే నీవు తిరిగి వచ్చి, అన్ని విషయాలను వివరంగా తెలుపుమన్నాడు.
ఆంజనేయుడు తక్షణమే ఆకాశానికి ఎగిరాడు. శృంగి బేరపురం చేరి రాముని ఆగమన వార్తను గుహునికి తెలిపాడు. గుహుని సూచనను అనుసరించి భరతుడు నివసిస్తున్న నందిగ్రామం చేరాడు. నార చీరలు ధరించి, నగరంలో ఆశ్రమ జీవనం సాగిస్తున్న రామ భక్తుడు భరతుని చూశాడు. అన్న పానాదులను సైతం మొదట రామునికి నివేదించి కందమూల పలాలను తింటున్న భరతుని నైష్టిక జీవనాన్ని చూశాడు.
హనుమంతుడు భరతుని చూసి అన్న రాక కోసం నిరీక్షిస్తున్నావు కదా! అనుక్షణం రామ నామ స్మరణ చేస్తున్న ధన్యాత్ముడవు. మీ అన్న నీ కుశలం అడుగుమని నన్ను పంపాడు. వనవాస దీక్ష ముగించుకుని రాముడు రాబోతున్నాడు అని శుభవార్తను తెలిపాడు. భరతుడు సంతోషపరవశుడై హనుమంతుని కౌగిలించుకుని ఆనంద ఆశ్రువులతో అతనిని తడిపాడు. తరువాత హనుమంతుడు, భరతుడు పాదుకలు కొని వచ్చిన నాట నుండి జరిగిన విషయములన్నింటిని పూసగ్రుచ్చినట్లు తెలిపాడు.
భరత శత్రుఘ్నులు సీతా రామలక్ష్మణులకు స్వాగత సత్కారాల కల్పనలో లీనమయ్యారు. అంతలో పుష్పక విమానం సవ్వడి వినిపించింది. అటుపిమ్మట సుదూర ప్రాంతంలో కనిపించింది. క్రమ క్రమంగా దగ్గరవుతున్న కొలది , భరత, శత్రుఘ్నుల హృదయ స్పందన అతిశయించింది. పుష్పక విమానమందున్న రాముని చూడగానే భరతుని ముఖ పద్మం వికసించింది. ఆనందంతో కను కొలకులలో నీరు నిండింది. దృష్టి అస్పష్టమైంది. త్వరత్వరగా భరతుడు కళ్ళు తుడుచుకున్నాడు. విప్పారిన విశాల నేత్రాలతో తనివి తీరా రెప్ప వేయకుండా రాముని చూస్తున్నాడు. తనువు పులకించింది. 14 ఏళ్ళ నిరీక్షణ ఫలించింది. హృదయ ఆనందం పరవశమయ్యింది. పుష్పక విమానం నేలకు దిగింది. సంతోషభరితుడై ఎదురేగిన భరతుని చేయి పట్టి, రాముడు పుష్పక విమానంలోనికి చేర్చాడు. భరతుడు రామునికి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. శ్రీ రాముడు భరతుని ఆలింగనం చేసుకున్నాడు. తనకు నమస్కరించిన లక్ష్మణుని భరతుడు అక్కున చేర్చుకున్నాడు. వదిన సీతకు భరతుడు నమస్కరించాడు. వానర శ్రేష్టులందరినీ ఆత్మీయతతో కౌగిలించుకున్నాడు. భరతుడు స్నిగ్ద హృదయుడైన సుగ్రీవుని హృదయాన్ని హత్తుకున్నాడు. అన్నకు చేసిన సాయానికి అభినందించి ప్రశంసించాడు. పిమ్మట శత్రుఘ్నుడు సీతా రామ లక్ష్మణులకు నమస్కరించాడు.
పుత్ర వియోగ దు:ఖంతో కృశించిన కౌసల్యమాత పాదాలకు శ్రీ రాముడు సాష్టాంగ దండ ప్రమాణం చేశాడు. సుమిత్ర, కైకేయి మున్నగు తల్లులందరికీ నమస్కరించాడు. కుల గురువ వసిస్టుని నమస్కరించాడు. పౌరులందరూ చేతులు జోడించి నమస్కరించారు. జయజయ నినాదాలతో రామునికి సాదర స్వాగతం పలికారు.
– కె.ఓబులేశు
9052847742