Sunday, November 17, 2024

ధర్మో రక్షతి రక్షిత:

ధర్మో రక్షతి రక్షిత:” వాల్మీకి రామాయణంలో చెప్పబడిన జన ప్రాముఖ్యం పొందిన సూక్తి. ”ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది” అని దీని అర్థం. ఆచరించవలసిన ధర్మాన్ని ఆచరించనప్పుడు అనేక విధా లుగా కష్టపడవలసి వస్తుందనేది ఇందులోని మరో అర్థం.
ప్రస్తుతం నడుస్తున్న కాలం కలియుగం. ఈ కలియుంలో ప్రజ ల ధర్మాచరణలు ఎలా ఉంటాయో తెలుపుతూ గోస్వామి తులసీ దాసు రామచరిత మానసంలో ఈ పద్యం చెబుతాడు.
కలిమల్‌ గ్రసే ధర్మ్‌ సబ్‌
లుప్త్‌ గయే సద్‌ గ్రంథ్‌
దభిహ్న్‌ నిజ్‌ మత్‌ కల్పి కరి
ప్రగట్‌ కియే బహు పంథ్‌
”కలి మాయ కారణంగా అన్ని ధర్మాలు క్షీణిస్తాయి. అన్ని ధర్మ గ్రంథాలు మూలనపడిపోతాయి. సనాతన ధర్మాలు మరిచిన మనుషులు, స్వార్థ చింతనతో కొత్త ధర్మాలు సృష్టించిన వారి వల లో చిక్కుకుపోయి తమ కష్టార్జితాన్ని వారికి పణంగా సమర్పించు కుంటూ మోసపోతారు.” అంటాడు కవి.
కలియుగంలో అంతా అధర్మమే, అంతా అన్యాయమే! స్వార్థ మే పరమార్థంగా భావిస్తూ అదే శాశ్వతమని ప్రజలు భ్రమ పడుతు న్నారనేది పద్యం అంతరార్థం. ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణ పరమాత్మ తన అవతారం చాలించే ముందు ”కలియుగం” గురిం చి చెప్పిన విషయాలను పౌరాణికులు చెబుతుంటారు-
”కలియుగం ప్రవేశించగానే మనుష్యులందు రెండు ప్రధాన లక్షణాలు… అపారమైన కోర్కెలు, విపరీతమైన కోపం మొదలవు తాయి. వీటి కారణంగా వారు తమ ఆయుర్దాయాన్ని తగ్గించుకుం టారు. వేదాలు, పురాణతిహాసాల మీద నమ్మకం కోల్పోయి వ్యవ హరిస్తుంటారు. ఇంద్రియాలకు బానిసలై మంచిచెడుల విచక్షణా జ్ఞానం కోల్పోయి కంటికి కనబడిన ప్రతిదాన్ని అనుభవించాలని ఆరాటపడుతుంటారు. కంచే చేనుమోసిన విధంగా రాజులే ప్రజల సొమ్మును దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరుగుబాటు చేస్తారు. ధనమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయోగ్యులకే అన్నింట గౌరవ మర్యాదలు లభిస్తాయి. యోగులకు అవమానాలు, ఛీత్కా రాలు. భక్తిశ్రద్ధలతో దేవాలయాలకు వెళ్లేవారు చాలా తక్కువగా ఉంటారు. భగవతారాధనల్లో ఆడంబరాలు ప్రదర్శించేవారు చాలా ఎక్కువ. సంస్కృతీ సాంప్రదాయాల్లో, జీవన విధానాల్లో మచ్చు కైనా నైతికత కనబడదు. ఎవరో ఒకరు సత్యమార్గాన్ని అనుసరిస్తే ‘సత్యహరిశ్చంద్రుడు వచ్చాడయ్యా’ అంటూ ఎత్తిపొడుపు మాటల తో వ్యంగ్యంగా మాట్లాడతారు. వృత్తి ధర్మాన్ని ఆచరించేవారు తక్కువ సంఖ్యలో ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే… మాన వత్వంతో మెలుగుతూ నీతి నియమాలతో ధర్మానికి కట్టుబడి జీవించే సత్పురుషులు కలియుగంలో ఎక్కడోగాని కనిపించరు.”
గడిచిన మూడు యుగాల్లోని ధర్మం గురించి తెలుసుకుంటే ఈ కలియుగంలో ధర్మం ఎంత కనిష్ఠ స్థాయికి చేరుకుందో మన కర్థమవుతుంది.
మొదటిది సత్యయుగంగా పిలువబడే కృతయుగం. కృత యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచేదంటారు. ఈ యుగం లోని ప్రజలు దీర్ఘాయుష్కులై ఎలాంటి బాధలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తుండేవారు. అకాల మరణాలుండేవికావు. సకా లంలో వర్షాలు కురిసేవి. పంటలు సమృద్ధిగా పండేవి. రాజులు ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించి రాజ్యపాలన చేసేవారు. గురువుల ప్రభావం ఎక్కువగా ఉండేది. ఈ యుగంలో ఎక్కడ చూసినా బంగారం మయమే!
రెండవది త్రేతాయుగం. ఈ యుగంలో ధర్మం మూడు పాదాల మీద నడిచేదట. భగవంతుడు శ్రీరాముడిగా అవతరించి రాక్షసుడైన రావణున్ని సంహరించి ధర్మ సంస్థాపన చేసింది ఈ యుగంలోనే! మూడవ వంతు ప్రజలు ధర్మానికి కట్టుబడి జీవించే వారు. రాజు, ప్రజల మధ్య ఒకవంతు సుహృద్భావం తగ్గినట్టు చెబుతారు. అయినా రాముని పాలన, రామరాజ్యంగా జగత్ప్ర సిద్ధమైంది.
మూడవది ద్వాపరం. ఈ యుగంలో ధర్మం రెండు పాదాల మీదే నడిచేదంటారు. అందుకే కంసుడు, జరాసంధుడు, శిశు పాలుని వంటి రాక్షసుల అరాచకాలు ఎక్కువ కావడం వల్లే శ్రీ కృష్ణుడిగా భగవానుడు అవతరించి వారిని సంహరించి ధర్మాన్ని కాపాడాడు. ద్వాపర యుగంలోని ప్రజల్లో సగం మంది అధర్మ పరులే. అధర్మమని తెలిసినా భారతంలోని భీష్ముడు, ద్రోణాచా ర్యుని వంటి జ్ఞానులు కౌరవుల దుశ్చర్యలకు అడ్డుకట్ట వేయలేకపో యారనే అపవాదు ఉంది. అదే పాండవులు, ఎదు రయ్యే కష్టాలను ధర్మబద్ధంగా ఎదుర్కొన్నారు కాబట్టే కృష్ణపరమాత్ముని అండదం డలు అడుగడుగున లభించాయి వారికి.
నాలుగవది చివరిదైన కలియుగంలో ధర్మం ఒక్క పాదం మీదే నడుస్తుంది. అందుకే అకాల మరణాలు సంభవిస్తున్నాయి. చాలామంది ఏవో కారణాలతో ఈర్ష్యాద్వేషాలు, కోపతాపాలకు గురై అంతుపట్టని జబ్బులతో బాధపడుతున్నారు. నాలుగింట ఒకవంతు ప్రజలు మాత్రమే కష్టనష్టాలకు గురవుతూ ధర్మబద్ధంగా జీవిస్తున్నారు.
మన వేద పురాణాల్లో ఏనాడో కలియుగంలో ఉండబోయే పరిస్థితులు, జీవన విధానాల గురించి చెబుతూ యుగాంతం గురించిన విషయాలు వివరించబడ్డాయి.
”ధర్మం పూర్తిగా అంతరించి, అధర్మం భూమండలమంతా చీకట్ల వలె కమ్మినప్పుడు నన్ను నేనే సృష్టించుకొని ధర్మాన్ని తిరిగి స్థాపిస్తాను” అన్నాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో.
శ్రీ త్రిదండి చిన్నజీయర్‌ స్వామిని ఓ విద్యార్థిని ధర్మం అంటే ఏమిటని అడిగింది. అందుకు స్వామి సమాధానమిస్తూ ”మంచిగా బతకడానికి చేసే ప్రతి పని ధర్మమే” అన్నారు.
అంటే, మనం నిత్య జీవితంలో నిజాయితీగా చేసే ప్రతి పని ధర్మం అని చెప్పవచ్చు.
అధ్యాపకునిగా విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించడం గురువు ధర్మం. విద్యార్థిగా అధ్యాపకుడు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినడం శిష్యుని ధర్మం. ఇంటి పెద్దగా నిజాయితీతో ధనం సంపా దించి కుటుంబ పోషణకు ఖర్చు చేయడం యజమాని ధర్మం. యజమానురాలుగా యజమాని సంపాదించిన డబ్బును ఉప యోగకరమైన మంచి పనులకు ఖర్చు చేయడం గృహిణి ధర్మం. కొడుకుగా వృద్ధ తల్లిదండ్రులకు సేవ చేయడం పుత్ర ధర్మం, స్నేహి తునిగా తన మిత్రులకు సాయపడడం స్నేహ ధర్మం. ఇలా మనం జీవితంలో నిర్వహించవలసిన అనేక ధర్మాలున్నాయి. ప్రతి ఒక్క రం చేయవల్సిన పనులు శ్రద్ధగా నిస్వార్థంతో చేసినప్పుడు మనకు సుఖసంతోషాలు, ప్రశాంతత వంటివి వాటంతటవే చేకూరుతాయి. అంటే మనం చేసే పనుల ద్వారా ధర్మాన్ని కాపాడినవారమవుతాం. ధర్మాన్ని కాపాడినప్పుడు మనకు ఆ ధర్మం సుఖసంతోషాలనిచ్చి మనల్ని కాపాడు తుంది. అదే ‘ధర్మో రక్షతి రక్షిత:’.

– పరికిపండ్ల సారంగపాణి
9849630290

Advertisement

తాజా వార్తలు

Advertisement