Tuesday, November 26, 2024

ధర్మం – మర్మం : సుభాషితాలు – సత్య పద్ధతి (ఆడియోతో…)

మహాభారతం, శాంతి పర్వంలోని సుభాషితానికి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి విశ్లేషణ…

11. సత్య పద్ధతి
న తధ్యవ చనం సత్యం నా తధ్య వచనం మృషా
య ద్భూత హితమత్యన్తం తత్‌ సత్య మితర న్మృషా

జరిగినది జరిగినట్లు ఉన్నది ఉన్నట్లు నిజమును నిజముగా చెప్పుట సత్యము కాదు. జరుగునిది జరిగినట్లు లేనిది ఉన్నట్లు అబద్ధములను చెప్పుట అసత్యము కాదు. సకల ప్రాణులకు లేదా చాలా ప్రాణులకు అత్యన్త హితమును కలిగించునది సత్యము. ప్రాణులకు అహితమును కలిగించునది అసత్యము. ”సత్యం సర్వహిత ప్రోక్తం యదార్థ కథనం నహి” అని మహాభారతము ద్వారా తెలుస్తోంది. అనగా సర్వ జనులకు హితమును కలిగించునది సత్యము కాని యదార్థమును చెప్పుట మాత్రమే కాదు అని అర్థము.

తన ప్రాణమును రక్షించుకొనుటకు ఒక వ్యక్తి వచ్చి మన ఇంట తలదాచుకొన్నచో అతన్ని తరుముతూ వచ్చిన వారు సదరు వ్యక్తి ఉన్నాడా అంటే అవునని నిజం చెప్పి అతని ప్రాణాలకు అపాయం కలిగించుట కన్నా రాలేదనే అబద్ధంతో అతని ప్రాణములను రక్షించునదే సత్యము.

మారీచుడు మరణిస్తూ అడవిలో ‘హా సీతా! లక్ష్మణా!’ అని పలకడం వలన సీతాపహరణం జరిగి రావణ వధ ద్వారా సకల లోక హితమును కలిగించెను కావున మారీచుడు సత్యమునే పలికెను అంటాడు వాల్మీకి.

- Advertisement -

శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యులు
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement