Friday, October 18, 2024

ధర్మం – మర్మం : శ్రావణ పూర్ణిమ విశిష్టత (ఆడియోతో…)

శ్రావణ పౌర్ణమి విశిష్టత గూర్చి శ్రీమాన్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…..

పౌర్ణిమ నాడు శ్రవణా నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు శ్రావణమాసం అని అంటారు. ఈరోజు యజుర్వేదీయులు ఉపాకర్మ జరుపుతారు. కొత్తగా ఉపనయనం చేసుకున్నవారు ఈనాడు మౌంజీ విమోచనం అనగా ఉపనయనం నాడు ముంజగడ్డితో నడుముకు కట్టిన తాడును విప్పి కొత్త యజ్ఞోపవీతం ధరిస్తారు. మరునాడు పాడ్యమినాడు బ్రహ్మచారులు, గృహస్థులు కూడా గాయత్రి జపం చేస్తారు.

శ్రావణ పౌర్ణమిని హయగ్రీవస్వామి జయంతిగా కూడా వ్యవహరిస్తారు. హయగ్రీవుడు అను రాక్షసుడు బ్రహ్మ నుండి వేదాలను అపహరించుకొని పోగా బ్రహ్మప్రార్థనతో నారాయణుడు హయగ్రీవరూపాన్ని ధరించి సామగానము చేసి హయగ్రీవ రాక్షసుడిని మోహింపచేసి సంహరించి వేదములు తెచ్చి బ్రహ్మకు అందజేసెను. వేదములు తిరిగి లభించిన ఆనాడు నూతన వటువులు(కొత్తగా ఉపనయమైనవారు) వేద స్వీకారం చేస్తారు. ఈవిధంగా శ్రావణ పౌర్ణిమనాడు యజుశ్శాఖవారు తప్పక ఉపాకర్మ, నూతన యజ్ఞోపవీతధారణ, సమిధాదానం, వేదస్వీకారం కావించి హయగ్రీవ జయంతిని జరుపుకుంటారు.

ఇదే రోజు ధన్వంతరి అవతార ఆవిర్భావం కూడ జరిగిందని బ్రహ్మాండ పురాణంలో తెలుపబడింది. అమృత కలశంతో వచ్చిన ధన్వంతరి మోహినీ ద్వారా అమృతమును దేవతలకు మాత్రమే అందేటట్లు ప్రణాళిక చేసెను. మోహిని రాక్షసులను మోహింపచేసి, మైమరపించి దేవతలను మాత్రం సోదరులుగా భావించి రక్ష కట్టి అమృతమును తాగించెను. శ్రీమహావిష్ణువు, దేవతలు, రాక్షసులు అందరూ కశ్యప మహర్షి సంతానమే. కావున దేవతల సోదరుడు నారాయణుడే అని గుర్తుచేసి అమృతాన్ని దేవతలకు మాత్రమే తాగించిన పండుగ రాఖీ పండుగ.

ఈనాడు ఉత్తరభారతదేశం వారు సోదరీసోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా రాఖీపౌర్ణమి జరుపుకుంటారు. తమ సోదరులు సురక్షితంగా ఉం డాలని కోరుకుంటూ సోదరీమణులు వారి చేతికి రక్షగా రాఖీని కడతారు. అందుకే దీనిని రక్షాబంధన్‌ అని వ్యవహరిస్తారు. సోదరులు తమ శక్తి కొలదీ సోదరీమణులకు కానుకలు అందిస్తారు. పర స్త్రీని సోదరిగా భావిం చాలని సందేశమందించే పండుగ రాఖీపూర్ణిమ.

Advertisement

తాజా వార్తలు

Advertisement