వినాయక చవితి సందర్భంగా శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ
గణపతి వృత్తాంతం..
శంకరుడు గజాసురుని కోరిక మేరకు అతని కడుపులో ఆత్మ లింగముగా దాగి ఉన్నాడని తెలిసిన పార్వతి తన భర్తను తనకు తెచ్చి ఇమ్మని శ్రీమన్నారాయణుని ప్రార్థించగా నారాయణుడు నందిని గంగిరెద్దుగా చేసుకొని ఇతర దేవతలతో కలిసి గజాసురుని ముందుకు తీసుకొని వెళ్ళి నాట్యం చేయించగా సంతోషించిన గజాసురుడు ఏమి కావాలో కోరుకొమ్మని అడిగినపుడు గంగిరెద్దు సాక్షాత్తు నందేనని శంకరుడు కావాలంటున్నది అని నారాయణుడు చెప్పి అతని ఆమోదంతో కడుపు చీల్చి శంకరుని బయటకు తీసుకొని వచ్చాడు. అయితే గజాసురుడు తానెలాగూ చనిపోతున్నానని, తన శిరస్సును లోకారాధ్యం చేయమని వరం కోరుకున్నాడు. అది పూర్వం రంగం.
తన భర్త శంకరుడు వస్తున్నాడని అతనికి పవిత్రంగా స్వాగతం చెప్పాలని భావించిన పార్వతి స్నానం చేయడానికి ఉద్యుక్తు రాలై తన శరీరానికి సున్ని పిండితో నలుగు పెట్టుకొని ఆ నలుగుతో వచ్చిన మట్టిని పరాకుగా బొమ్మను చేసి బొమ్మ ముద్దుగా ఉందని ప్రాణం పోసి ఆ బాలుడినే ద్వారం దగ్గర కాపలా ఉంచి తాను లోపలికి వెళ్ళి అలంకరించుకుంటూ ఉంది. శంకరుడు వచ్చినపుడు పిల్లవాడు అడ్డంగింపగా కోపగించి అతని శిరస్సును ఖండించి లోనికి వెళ్ళాడు. తన వద్దకు వచ్చిన శంకరుడిని బాలుడి గురించి అడగగా జరిగిన దాన్ని వివరించారు. తాను ప్రేమగా చేసుకున్న పిల్లవాడు అని పార్వతి బాధపడితే గజాసురుని శిరస్సును తెచ్చి అతికించి శంకరుడు ఆ బాలుడిని జీవింప చేయగా అతనే గజాననుడయ్యాడు. తరువాత ఇతను మూషికాసురుని సంహరించినపుడు లోకాలకు మేలు చేశాడని శంకరుడు కుమారస్వామికి గణపతికి మూడు లోకాలలోని ముక్కోటి తీర్థాలలో స్నానం చేసి ముందు వచ్చిన వారికి గణపతిగా అభిషేకం చేస్తానని పరీక్ష పెట్టగా కుమారస్వామి మయూర
వాహనుడు కావున వేగంగా వెళ్ళిపోయాడు. వినాయకుడు తాను మూషిక వాహనంతో వెళ్ళలేననే తనకు గణాధిపత్యం ఇవ్వవద్దనే ఈ పోటీ పెట్టారా అని శంకరుని అడగగా నీకే ఇవ్వాలని ఈ పోటీ పెట్టానని పోటీలో నెగ్గడానికి కావాల్సింది సాధన సంపత్తి కాదు దైవ భక్తి, మాతా పితృ భక్తి అని వివరించెను. నారాయణ నామాన్ని మూడు సార్లు పలికి తమ ఇద్దరి చుట్టూ మూడు సార్లు ప్రదిక్షణాలు చేయమనెను. అన్ని లోకాలు నారాయణుడిలో, అన్ని తీర్థాలు తల్లిదండ్రులలో ఉన్నాయి కావున మాతా, పితృ ప్రదక్షిణం, సకల తీర్థ స్నానంతో సమానం అని చెప్పాడు. అందుకే ఆ బాలుడు నారాయణ నామాన్ని స్మరించి పార్వతి పరమేశ్వర ప్రదక్షిణం చేసి నమస్కరించి కుమార స్వామి ఆమోదంతో గాణ పత్యాన్ని పొందాడు అంటే గణపతి అయ్యాడు.
తరువాత సిద్ధి, బుద్ధులతో కళ్యాణం జరుపుకొని గణపతి అయిన సందర్భంలో భక్తులు సమర్పించిన షడ్రసోపేతమైన భోజనాన్ని, ఉండ్రాళ్ళను ఆరగించి తన వైభవాన్ని తనకు లభించిన అరుదైన గౌరవాన్ని సన్మానాన్ని తల్లిదండ్రులకు చూపాలని వచ్చి సాష్టాంగ దండ ప్రణామం కోసం ప్రయత్నించి బొజ్జ అడ్డురాగా చంద్రుడు చూసి నవ్వినందున ఉదర భంగమై ప్రాణాలు కోల్పోతే పార్వతి చంద్రుడి ముఖం చూసినవారు ఇలాంటి మరణాన్ని పొందుతారని శపించగా బ్రహ్మాది దేవతలు వచ్చి గణపతికి ప్రాణం పోసి బ్రతికించి అనేక వరాలు ఇచ్చి పార్వతిని శాంతింప చేశారు. శాపాన్ని ఉపసంహరించమని చెబితే అపనిందలు పొందడం మరణంతో సమానమే కావున ఈ నాడు అనగా భాద్రపద శుద్ధ చతుర్ధి నాడు చంద్రుడిని చూసిన వారికి నీలాపనిందలు తప్పవని శాపాన్ని సవరించారు.
తరువాత శ్రీకృష్ణ పరమాత్మ శమంతకోపాఖ్యానంతో శమంతక మణిని తీసుకొని వచ్చి సత్రాజిత్తుకి ఇచ్చి తనకు వచ్చిన అపనిందను
తొలిగించుకున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు వినాయక చవతినాడు పాలల్లో చంద్రుడిని చూశాడని, అందుకు నిందలు వచ్చాయని, తాను తన సామర్థ్యంతో తొలగించుకున్నాడని తెలిసిన భక్తులు మరి తమలాంటి వారి గతేమిటని అడగగా వినాయక చవితి నాడు గణపతిని ఆరాధించి శమంతకోపాఖ్యానాన్ని విని.
సింహ: ప్రసేనమవ ధీత్
సింహో జాంబవతా హత:
సుకుమారక మారోదీ:
యస్తవైష స్యమంతక:
అనే శ్లోకాన్ని చదువుకొని పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదాన్ని పొందితే ఏ అపనిందలు రావని కృష్ణ పరమాత్మ పరిహారం ఉపదేశించాడు. సంగ్రహంగా ఇది వినాయక చవితి విశేషం.
శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యులు…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి